కమ్యూనిస్ట్ నీతికి నిలువుటద్దం

ABN , First Publish Date - 2020-05-27T06:01:25+05:30 IST

శ్రామిక ప్రజల ఆపద్భాందవుడు, రైతాంగం సమస్యలపై అలుపెరగని పోరుసల్పిన ఉద్యమ నేత, విద్యార్థి దశలోనే ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ విద్యార్థి కార్యాచరణ కమిటీకి కన్వీనరుగా అగ్రభాగాన...

కమ్యూనిస్ట్ నీతికి నిలువుటద్దం

నివాళి : కొల్లి నాగేశ్వర రావు (07.04.1938-– 21.05.2020)

శ్రామిక ప్రజల ఆపద్భాందవుడు, రైతాంగం సమస్యలపై అలుపెరగని పోరుసల్పిన ఉద్యమ నేత, విద్యార్థి దశలోనే ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ విద్యార్థి కార్యాచరణ కమిటీకి కన్వీనరుగా అగ్రభాగాన నిలబడి ఉద్యమించిన నాయకుడు, చల్లపల్లి జమీందారు భూములను పేదలకు పంపిణీ చేయాలని సంవత్సరాలపాటు సాగిన పోరాటంలో క్రియాశీల భూమిక పోషించిన ధన్యజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు (82) మే 21, 2020 గుండె పోటుతో మృతి చెందారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో జలవనరులపై లోతైన అధ్యయనం చేసి 2005లో ‘ఆంధ్రప్రదేశ్ జలదర్శిని’ శీర్షికతో ఒక గ్రంథా న్ని రచించారు. నాటి ముఖ్యమంత్రి డా.వై.యస్. రాజశేఖరరెడ్డి హైదరాబాద్ జూబ్లీహాలులో ఆవి ష్కరించి, ఒక ప్రత్యేక జీ.ఓ.జారీ చేసి, నీటి పారుదల రంగానికి సంబంధించి ఆ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని ఇరిగేషన్ కార్యా లయాలకు, అధికారులకు పంపించారు.


గోదావరి నదీజలాలను తరలించి తెలం గాణను సస్యశ్యామలం చేయాలన్న డిమాండుతో 1999 మార్చి 22న ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొన్నారు. రాజకీయ పక్షాలు స్పందించి, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసిన మీదట అన్ని పక్షాల నాయకుల సమక్షంలో మార్చి 24న దీక్ష విరమించారు. పోలవరం సత్వర నిర్మాణం కోసం, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ, పులిచింతల నిర్మాణం, బుడమేరు, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించి, యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని అంకితభావతో నిరంతరం పోరాడిన రైతాంగ ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు.


దేశ రైతాంగం ప్రయోజనాలకు హాని కలిగించే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) విధానాలను ఎండగడుతూ కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ‘డబ్ల్యూటీఓ– వ్యవసాయ సంక్షోభం’ అన్న శీర్షికతో రచించిన మరొక పుస్తకాన్ని సిపిఐ, ప్రధాన కార్యదర్శి కా.సురవరం సుధాకరరెడ్డి ఆవిష్కరించారు.


నాగేశ్వరరావు విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎ.ఐ.ఎస్.ఎఫ్.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (1962-– 65); సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శిగా (1978–-90), రాష్ట్ర కార్యదర్శి సభ్యుడుగా; ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా (1992-–2002), అధ్యక్షులుగా (2002-–07), జాతీ య ఉపాధ్యక్షులుగా (2007నుండి) సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించారు. ‘రైతులోకం’ మాసపత్రిక సంపాదకులుగా బాధ్యత నిర్వహించారు.


1938 ఏప్రిల్ 7న కృష్ణా జిల్లా ముసునూరు మండలం, గుడిపాడు గ్రామంలో ఒక ఉన్నత మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన నాగేశ్వరరావు గారు, ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, బీహార్‍లోని భాగల్పూర్ యూనివర్సిటీలో యం.ఏ. చదివారు. విద్యార్థి దశలోనే మార్క్సిస్టు భావజాలంవైపు ఆకర్షితులై విద్యార్థి, కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించారు నాగేశ్వరరావు. నిరాడంబర జీవి తాన్ని గడిపారు. కమ్యూనిస్టులకు సొంత ఆస్తి ఉండకూడదన్న భావనతోనే జీవితాంతం కట్టుబడి నిలిచారు. ఆయన ప్రేమించి, దండల పెళ్ళి చేసుకొన్నారు. తమ పెద్ద కుమార్తె ప్రేమించిన యువకునితో కులాంతర, అంతర్రాష్ట్ర, ఆదర్శ వివాహం చేశారు.


ఉన్నత వైద్య విద్యను ఆర్జించి, డాక్టరైన చిన్న కుమార్తెకు కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం పనిచేస్తున్న కార్యకర్తతో దండల పెళ్ళి చేశారు. తాను ఆదర్శ కమ్యూనిస్టు జీవితాన్ని గడపడమే కాదు, తన కుటుంబాన్ని కమ్యూనిస్టు నీతితో జీవించే వాతావరణాన్ని సృష్టించారు. నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో నాగేశ్వరరావుగారితో పరిచయం ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమం మా ఇరువురిని మామా అల్లుళ్ళ బంధంతో పెనవేసింది. మా కుటుంబ పెద్దగా కా.కొల్లి నాగేశ్వరరావు గారిని కోల్పోవడం తీరనిలోటు. అంతకుమించి కమ్యూనిస్టు ఉద్యమం ఒక ఆణిముత్యంలాంటి ఉత్తమ శ్రేణి, విలక్షణమైన నాయకుడ్ని కోల్పోయింది.

టి.లక్ష్మీనారాయణ

రాజకీయ విశ్లేషకులు

Updated Date - 2020-05-27T06:01:25+05:30 IST