పుత్తూరులో తెలంగాణ కూలీల పాట్లు

ABN , First Publish Date - 2020-04-04T09:33:42+05:30 IST

అధికార యంత్రాంగం ఎంత విస్తృతంగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, యాచకులు పెద్ద సంఖ్యలో సరైన ఆశ్రయం, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.

పుత్తూరులో తెలంగాణ కూలీల పాట్లు

పుత్తూరు, ఏప్రిల్‌ 3: అధికార యంత్రాంగం ఎంత విస్తృతంగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, యాచకులు పెద్ద సంఖ్యలో సరైన ఆశ్రయం, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. రోజులో ఏదో ఒక పూట పస్తులుండక తప్పడం లేదు. ఉదాహరణకు పుత్తూరు పట్టణంలో తెలంగాణ వలస కూలీలు పలువురు చిక్కుకుపోయారు. నల్గొండకు చెందిన 20 మంది, సూర్యాపేటకు చెందిన 12 మంది రైల్వే ట్రాక్‌ పనుల కోసం వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే వుండిపోయారు.


ఓ రియల్టర్‌ మానవత్వం చూపి తన అసంపూర్ణ భవనంలో ఆశ్రయం కల్పించారు. వీరిలో పది మంది పిల్లలుండగా కూలీల్లో అత్యధికులు మహిళలే. సమీపంలోని బోరు వద్దకు పోయి నీరు తాగడం తప్ప మరే సదుపాయం లేదు. టాయిలెట్లు లేనందున ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మధ్యాహ్నం దాతలు ఎవరో ఒకరు వచ్చి భోజనాలు పెడుతున్నారు. ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం అందడం లేదు. మాస్కులు, శానిటైజర్ల గురించి అడగక్కరే లేదు. అసంపూర్ణ భవనం కావడంతో విద్యుత్‌ లేదు. రాత్రిళ్ళు చీకట్లో గడపాల్సి వస్తోంది.


పుంగనూరు జాతరకొచ్చి చిక్కుకుపోయారు

 పుంగనూరు గంగజాతరకు ఏటా మహరాష్ట్రలోని షోలాపూర్‌, కర్నాటకలోని మైసూర్‌ల నుంచీ రంగులరాట్నం తదితర పిల్లల ఆట వస్తువులు తీసుకుని వస్తుంటారు. ఈ ఏడాది కూడా జాతరకు 36 మంది ఆ పరికరాలు తీసుకొచ్చారు. కరోనా కారణంగా జాతరకు జనం రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. జాతర ముగిశాక వచ్చే ఉరుసు ఉత్సవాలు కూడా చూసుకుని తర్వాత స్వస్థలాలకు వెళదామని భావించి పట్టణ పొలిమేర్లలో గుడారాలు వేసుకుని వుండిపోయారు. ఉరుసు ఉత్సవాల సంగతి అటుంచి లాక్‌డౌన్‌తో ఎక్కడికీ వెళ్ళలేక, ఇక్కడా వుండలేక సతమతమవుతున్నారు. వారానికి సరిపడా సరుకులను మున్సిపల్‌ కమిషనర్‌ వారికి అందజేశారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతవరకూ బాగానే వున్నా మాస్కులు, శానిటైజర్లు వంటివి లేవు.


సమూహాలతో ప్రమాదం

తిరుపతి నగరంలో టీటీడీ రోజుకు 50 వేల అన్నం పొట్లాలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిరాశ్రయులకు శ్రీనివాసం, మాధవం వంటి దేవస్థానం సత్రాలలో ఆశ్రయం కూడా కల్పిస్తోంది. అయినా నగరంలో రోడ్ల పక్కన, దుకాణాల ముంగిట, పేవ్‌మెంట్లపైన, రుయా, స్విమ్స్‌ వంటి ఆసుపత్రుల ఆవరణల్లోనూ పెద్ద సంఖ్యలో నిరాశ్రయులు కనిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో కూడా నిరాశ్రయులు, యాచకులు పెద్ద సంఖ్యలో వున్నారు. వీరికి స్థానికంగా దాతలు ఏదో ఒక స్థాయిలో ఆహారం అందిస్తున్నారు. కానీ వైద్య పరంగా మాత్రం ఎటువంటి సాయం అందే పరిస్థితి లేదు.


సమూహాలుగా ఉండే వీరు భౌతిక దూరం పాటించే అవకాశమే లేదు. ఈ తరహా వ్యక్తుల్లో ఎవరికి కరోనా వైరస్‌ సోకినా శరవేగంగా ఆ సమూహంలోని అందరికీ వ్యాపించే ప్రమాదముంది. ఈ తరహా వ్యక్తుల్లో అత్యధికులు ఒకే చోట వుండకుండా కాలినడకనే ఊళ్ళు తిరుగుతున్నారు. దానివల్ల వైరస్‌ కూడా ప్రబలే అవకాశముంటుంది. అధికార యంత్రాంగం ఈ తరహా వ్యక్తులపై తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. వీరిని గుర్తించి తాత్కాలిక ఆశ్రయం కల్పించి, భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రభుత్వ విద్యా సంస్థలూ ఖాళీగానే ఉన్నాయి. ఇటువంటి వారి కోసం ఎక్కడికక్కడ వాటిని కేటాయించి, ప్రభుత్వమే తగిన వైద్య, భోజన వసతులు కల్పించకపోతే చాలా ప్రమాదం ఉంటుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-04T09:33:42+05:30 IST