పాఠశాల విద్యలో గురుకులాలకు ఆద్యుడు

ABN , First Publish Date - 2020-06-27T06:24:47+05:30 IST

పీవీ ప్రారంభించిన రెసిడెన్షియల్‌ విద్యా విధానం దళిత, బహుజన వర్గాల విద్యా పురోగతికి విశేషంగా దోహదం చేసింది. పీవీ ఆశించినట్లుగా ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి...

పాఠశాల విద్యలో గురుకులాలకు ఆద్యుడు

పీవీ ప్రారంభించిన రెసిడెన్షియల్‌ విద్యా విధానం దళిత, బహుజన వర్గాల విద్యా పురోగతికి విశేషంగా దోహదం చేసింది. పీవీ ఆశించినట్లుగా ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి అన్ని రకాల సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చాలి. పీవీ శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ భావిస్తున్నది.


పీవీనరసింహారావు పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యలో గురుకుల వ్యవస్థ. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నల్గొండ జిల్లా సర్వేల్‌ గ్రామంలోని దేశంలోనే ప్రభత్వ రంగంలో మొట్ట మొదటి రెసిడెన్షిల్‌ పాఠశాలను నెలకొల్పారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడివుండి విద్యలో చురుకుగా ఉండే పిల్లల కోసం ఏర్పాటు చేయడమే ఈ గురుకుల పాఠశాల ప్రత్యేకత. 1972లో ‘ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటి’ ఏర్పాటు చేయబడి ఈ పాఠశాలలతో పాటు కళాశాలలను క్రమంగా రాష్ట్రమంతా విస్తరించారు. ఈ విధానమే క్రమంగా వెనుకబడిన తరగతల సంక్షేమ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ట్రైబల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మైనార్టీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ఏర్పాటుతో పాటుగా ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటుకు, మహాత్మ జ్యోతిరావు పూలే, కస్తూరిబా గాంధీ, మోడల్‌ స్కూళ్ళ ప్రారంభానికి ప్రేరణ అయింది. పాఠశాల విద్యారంగంలో ఈ నవ శకానికి నాంది పలికింది పీవీ స్పూర్తే. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా పనిచేసిన కాలంలో అప్పటి వరకు ఉన్న విద్యా మంత్రిత్వ శాఖను ప్రక్షాళన చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చగా పీవీ నరసింహారావు మొదటి కేంద్ర మానవ వనరుల శాఖమంత్రిగా 1985 సెప్టెంబర్‌ 25 నుండి 25 జూన్‌ 1988 పనిచేశారు.


విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకొని రావడం కొరకు 1986లో రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించింది. ఈ విధానం రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది పీవీనే. ఈ కొత్త విధానంలో ‘‘అసమానతలను తొలగించడానికి, విద్యా అవకాశాలను సమం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని’’, ముఖ్యంగా భారతీయ మహిళలు, షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్‌ కుల (ఎస్సీ) వర్గాలలో అటువంటి సామాజిక సమైక్యతను సాధించడానికి, స్కాలర్‌షిప్‌లను విస్తరించడం, వయోజన విద్య, ఎస్సీల నుండి ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించడం, పేద కుటుంబాలు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించడానికి మొదటి తరగతి నుండి ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకం పరిచయం లాంటి ప్రోత్సాహకాలు, కొత్త సంస్థల అభివృద్ధి, ప్రాథమిక విద్యలో ‘‘పిల్లల-కేంద్రీకృత విధానం’’ మొదలైనవన్నీ ప్రభుత్వం పీవీ రూపకల్పనలే. దేశవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను మెరుగుపరచడానికి ‘‘ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌’’ పథకాన్ని ప్రారంభించింది పీవీనే. ఈ పథకం కింద పాఠశాలలను బలోపేతం చేయడం కోసం 33% పాఠశాలలకు ఒకే టీచర్‌ ఉన్నాడని గుర్తించి సింగిల్‌ టీచర్‌ పాఠశాలల్ని డబుల్‌ టీచర్‌ పాఠశాలలుగా మార్చారు.


గ్రామీణ భారతదేశంలో అట్టడుగు స్థాయిలో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి జాతిపిత మహాత్మా గాంధీ తత్వశాస్త్రం ఆధారంగా ‘‘గ్రామీణ విశ్వవిద్యాలయ’’ నమూనాను రూపొందించారు. 1985లో సృష్టించబడిన ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయంతో దూర విద్యావిధానంలో విశ్వవిద్యాలయ వ్యవస్థను విస్తరించి అనేకమంది డిస్టెన్స్‌ మోడ్‌ ద్వారా ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అవకాశం కలుగడం పీవీ చలువే. 1986 విద్యా విధానం ప్రకారం జీడీపీలో 6% విద్య కోసం ఖర్చు చేయాలనే నిర్ణయం వెనుక పీవీ ప్రధానపాత్ర పోషించారు. 1986 నివేదికను, 1968 కొఠారి నివేదికను ఆధారం చేసుకొని పేద, గ్రామీణ విద్యార్థులకు పట్టణ, నగర, ప్రైవేట్‌ విద్యారంగం కన్న నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా 1985లో నవోదయ విద్యా సంఘటన్‌ ఏర్పరిచి 1986లో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకో ‘జవహర్‌ నవోదయ విద్యాలయం’ ను ప్రారంభించింది కూడా పీవీయే. ప్రస్తుతం ఇవి దాదాపు 660 వరకు ఉన్నాయి. వాస్తవానికి ఇటువంటి పాఠశాలలను గ్రామం వరకు విస్తరించి ‘తరగతి గదిలోనే దేశ భవిష్యత్తును రూపొందించాలని’ భావించిన కోఠారి కలను నెరవేర్చడానికి అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్షియల్‌ విధానాన్ని ప్రారంభించి ఉన్నాడు కనుక దేశవ్యాప్తంగా పీవీ నవోదయ విధానాన్ని తీసుకువచ్చారు. అంతే కాకుండా దేశంలోని ఇతర రెండు ప్రాంతీయ భాషలను నేర్చుకొని తద్వారా దేశ సమైక్యతకు తోడ్పతుందని భావించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినారు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఉత్తర భారతదేశంలోని అనేక నవోదయ పాఠశాలల్లో తెలుగును పాఠ్యాంశంగా నేటికీ చదువుతున్నారంటే, తెలుగు పండిట్‌లు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పనిచేస్తున్నారంటే అదంతా పీవీ ముందు చూపు వల్లనే సాధ్యపడింది. కాని పీవీ తదనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నవోదయ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలదాకా విస్తరించకపోవడం దురదృష్టకరం.


2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం తెలంగాణ గురుకులాల సొసైటి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ, తెలంగాణ గిరిజన సంక్షేమ సంస్థ, తెలంగాణ మైనార్టీ గురుకులాల సంస్థల ఆధ్వర్యంలో 290 పాఠశాలలు పనిచేస్తూండగా, పీవీ ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని మరింత ఉధృతం చేసి, సౌకర్యాలను మెరుగు పరిచి పీవీ లాగే గ్రామీ ణ ప్రాంతం నుండి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 906 రెసిడెన్షిల్‌ పాఠశాలలకు వాటిని పెంచడంతోపాటు, 53 డిగ్రీ కళాశాలలను, ఒక ఐఐటి కోచింగ్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించడం జరిగింది. రాబాయే రెండు, మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్యను 1190కి పెంచాలనే లక్ష్యం ఉంది. ప్రస్తుతం వీటన్నింటిలో చదువుకుంటున్న దాదాపు 4 లక్షల 20 వేల మంది దళిత, బహుజన జాతుల విద్యార్థుల జీవితాల్లోను, విద్యారంగంలోను సువర్ణాధ్యాయాన్ని ప్రారంభించి కె.సి.ఆర్‌ చరిత్రను నెలకొల్పడం వెనుక పి.వి ఉన్నారు. శారీరకంగా, మానసికంగా వికలాంగులను సాధారణ సమాజంతో అనుసంధానించడం, వారిని సాధారణ వృద్ధికి సిద్ధం చేయడం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవటానికి వీలు కల్పించడం నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యం అని పేర్కొనడం వెనుక కూడా పీవీ ఉన్నారు. ఈ విధానంలో భాగంగానే శాస్త్ర సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నూతన శకంలోకి విద్యారంగాన్ని తీసుకెళ్ళాలనేది పీవీ సంకల్పం. రాజీవ్‌గాంధీ కాలంలో 1986లో రెండవ జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టిన పీవీ 1992లో తన ప్రధానమంత్రిత్వ కాలంలో అందులో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు.


అంతేగాక తెలుగుకు అధికార భాషగా పునాదులు వేసిన ఘనత పీవీకే దక్కుతుంది. పీవీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖమంత్రిగా పనిచేసిన కాలంలో ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆగస్టు 6, 1968న స్థాపించిన తెలుగు అకాడమి ఆయన మానస పుత్రికే! ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. నరసింహారావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ఉన్నత విద్యకు సంబంధించి అన్ని స్థాయిలలో అనగా ఇంటర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం, అధికారభాషగా తెలుగుని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, తెలుగు భాషను ఆధునికీకరించి, సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించడం అనే లక్ష్యాలు అయన నిర్దేశించినవే! ఆయన కాలంలోనే డిటెన్షన్‌ విద్యా విధానాన్ని రద్దు చేసి 7వ తరగతి వరకు కామన్‌ పరీక్షలను ప్రవేశపెట్టాడు. మార్కులు ముఖ్యం కాదని తెలివి కోసమే విద్య నేర్చుకోవాలనే సూత్రాన్ని ఆయన అమ లు చేశారు. సమైక్య రాష్ట్రంలో పీవీ నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగును ప్రాధమిక స్థాయి నుండి పి.జి వరకు బోధనా భాషగా చెయ్య డం కోసం అన్ని చర్యలూ తీసుకున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది. తెలుగు అకాడెమీ తెలుగుభాషకు ఎంత గొప్ప దోహదం చేసిందో లోతుగా చూస్తే తప్ప చెప్ప లేం. ఎప్పుడూ మౌనముద్రాంకితుడిగా, గంభీరుడిగా కనిపించే పీవీలో హాస్యం లేదనుకుంటారు కానీ, తెలుగు అకాడెమీతో ముడి పెట్టి ఆయన హాస్యచతురతను సీనియర్‌ పాత్రికేయులు ప్రస్తావిస్తూ ఉంటారు.


పీవీ ప్రారంభించిన రెసిడెన్షియల్‌ విద్యా విధానం విజయవంతమై దళిత, బహుజన పేదింటి బిడ్డలు ఆకాశంలో చదువుల ర్యాంకుల జెండాను రెపరెపలాడిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జాతుల నుండి ఉన్నతోద్యాగాలకు మొదటి తరం రాగలిగింది. దేశంలోని అత్యుత్తమ సర్వీస్‌లుగా పేర్కొనబడే ఐ.ఏ.ఎస్‌., ఐ.పి.ఎస్‌ లాంటి సర్వీసులలోకి, రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్‌-1, 2 లాంటి సర్వీస్‌లలోకి ఈ గురుకులాలలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఎంపికయ్యారు. అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన తొలి దళిత బిడ్డలుగా రికార్డు సృష్టించిన మలావత్‌ పూర్ణ, ఆనందకూమార్‌లు ఇద్దరు కూడా ఈ గురుకులాలకు చెందినవారే! పీవీ ఆశించినట్లుగా ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి అన్ని రకాల సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిని రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చడమే పీవీ శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ భావిస్తున్నది.



డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌



Updated Date - 2020-06-27T06:24:47+05:30 IST