పీవీ కీర్తి అపరిమితం

ABN , First Publish Date - 2021-03-05T06:30:15+05:30 IST

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల బరిలో అధికార తెరాస అభ్యర్ధిగా దివంగత ప్రధానమంత్రి పీవీ...

పీవీ కీర్తి అపరిమితం

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల బరిలో అధికార తెరాస అభ్యర్ధిగా దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మూడవ కుమార్తె సురభి వాణీ దేవిని పోటిలో నిలిపి ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురతను చాటారు. సుమారు సంవత్సరం క్రితం నుంచే పీవీ కుటుంబం తన వైపు చూసేలా ప్రణాళికలు వేసి, వారు బహిరంగంగా తన పార్టీనీ, తన నాయకత్వాన్ని పొగిడేటట్లు కేసీఆర్‌ వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏట నుంచే మరుగున పడిన తెలంగాణ తేజాలకు జయంతులు/ వర్ధంతులు జరుపుతూ(తమను బల పరచనివారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రించి) ఆ పరంపరలో పీవీ శతజయంతిని అధికారికంగా సంవత్సరం పాటు జరుపుతున్నారు. తమ తండ్రికి కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదన్న కినుకను పీవీ కుటుంబం వారు వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. పీవీ ఎప్పుడూ తన సంతానాన్ని చేయిపట్టి రాజకీయంగా నిలబెట్టేంత స్వార్థం చూపలేదు. పాపులర్‌ లీడర్స్‌ కాకున్నా ఆయన కుమారులు రంగారావు, రాజేశ్వరరావులకు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది. చట్ట సభలకు పంపింది. రంగారావు కొంత నిలదొక్కుకుని తదుపరి ఎన్నికలలో కూడా గెలుపోటములు చూశారు. రాష్ట్ర మంత్రిగా పని చేశాడు. రాజేశ్వరరావు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువకాలం నిలుపుకోలేక రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ తమ తండ్రిని గుర్తించలేదని కినుక ఉన్నా, వారెన్నడూ కాంగ్రెస్‌ను వీడలేదు. స్వంత పార్టీలో పీవీ కూడా చీకటి రోజులు చూశారు. అజ్ఞాతంగా ఉన్నారు. మళ్ళీ అవకాశం రాగానే వెలిగి నిలిచారు. అయినా పార్టీని నిందించలేదు, వీడలేదు. తండ్రితో కలిసి దేశ విదేశాలు తిరిగి ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను, నాయకులను చూసిన వాణీదేవికి, అధికారం ముళ్ళ కిరీటం అని తెలియంది కాదు. తన తండ్రిలాగా నిజాయితీ, నిబద్దతతో పనిచేయడం తెరాస పార్టీ నాయకత్వం నీడన ఆమెకు సాధ్యమా?


వారసత్వాన్ని ప్రోత్సహించని పీవీ వారసత్వాన్ని చెప్పుకుంటూ రంగంలో ఉన్న వాణీదేవిని, నిజంగా ఆయన వారసురాలనుకోవాలా? లేక పూర్తి భిన్నంగా వారసులకు పెద్దపీట వేసే కేసీఆర్‌ వారసత్వ రాజకీయాలలో పావు అనుకోవాలా? తండ్రిలాగ గెలుపోటములకు అతీతంగా, ఎన్నికల తర్వాత నిబద్ధతతో ఏదైనా చేయగలదా? అయితే దేనిపట్ట నిబద్ధత? కనీసం ఎన్నికల హామీలు విషయంలోనైనా ముఖ్యమంత్రి అప్పాయింట్‌మెంట్‌ పొందగలదా? పీవీ వారసురాలైతే, వారసత్వం మాటే ఎత్తకూడదు. ప్రలోభాలకు, పదవీ రాజకీయాలకు లొంగకూడదు. ఆమెకు అంత ఆసక్తి ఉంటే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాల్సింది. పీవీ పై నిజంగా గౌరవం ఉంటే కేసీఆర్‌ మద్దతునిచ్చి. ఇప్పటిలాగే ఆమె గెలుపునకు సాయపడితే గౌరవంగా ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ స్టాండు ఏమిటో తెలిసేది. ఇప్పుడు పీవీ గారి సంస్కరణలు, దూరదృష్టి ఫలితాలు చవిచూస్తూ, చర్చిస్తూ, అని వార్యంగా అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఆయనను స్మరిస్తూ, అనుసరిస్తున్నాయి. కాంగ్రెసుకు కూడా తమ పీవీని స్మరించకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వచ్చిన పీవీ శతజయంతిని కేసీఆర్‌ అందుకున్నారు. ఆయన కుటుంబం ఆ ఉత్సవాలకు పరిమితమై ఉండాల్సింది. ఈ పోటీ ప్రస్తుతానికి వాణీదేవి– కేసీఆర్‌/ తెరాస ఇద్దరికీ విన్‌–విన్‌ పరిస్థితిగా కనిపించవచ్చు. కానీ, వ్యక్తిగత చాణక్యం, ప్రాబల్యం ఆధారంగా వెలుగుతున్న ఈ ప్రాంతీయ పార్టీకి/ నాయకునికి పొద్దుగుంకితే వారితో పాటు పీవీ మరుగున పడాల్సిందేనా? దేశవ్యాప్తంగా స్మరించే, కీర్తించే అనివార్య దశకు పీవీ స్ఫూర్తి ఎదిగింది. వాణీదేవి పోటితో ఇప్పుడది ఒక పార్టీ పేటెంటుగా ప్రచారం అవుతుంది. దీర్ఘకాలంలో, ఆపేరు వారి రాజకీయ ప్రయోజనాలు తీర్చనిదయితే, పీవీ స్ఫూర్తిని కీర్తిస్తారా? పివి ఇమేజీ పార్టీలు/ వ్యక్తులకు అతీతమైంది. ఇప్పుడొక పార్టీ, నాయకుడు ఎత్తుకుంటే మిగతావారు ఆయనను అనుసరించినట్లా? పీవీని స్మరించినట్లా? ఇక అందరిలాగానే పీవీ కుటుంబం/ అభిమానులు కేసీఆర్‌ జపం చేయాలి.


ఆ ‘మహిత జాగృతి పుంజం’ వెలుగు ఒక పార్టీ, ఒక వ్యక్తి ద్వారా ఒక రాష్ట్రంలోనే ప్రసరిస్తే చాలా?

సిహెచ్‌. చంద్రశేఖర్‌

వంగర

Updated Date - 2021-03-05T06:30:15+05:30 IST