పీవీ ప్రపంచస్థాయి నాయకుడు

ABN , First Publish Date - 2021-04-11T01:48:11+05:30 IST

పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రపంచ స్థాయి నాయకుడని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు అన్నారు. కొన్ని కారణాల వల్ల పీవీకి రావాల్సినంత గుర్తింపు రాలేద

పీవీ ప్రపంచస్థాయి నాయకుడు

55దేశాల్లో శతజయంతి ఉత్సవాలు

మారిషస్‌లో ఉత్సవాలు ప్రారంభించిన కేకే

పీవీ విద్వత్తుతోనే విజయం సాధించారు: వాణీదేవి

పీవీ విమర్శలు లెక్కచేయని కర్మయోగి: ప్రభాకర్‌రావు

వివిధ దేశాల్లో పీవీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు: మహేశ్‌ బిగాల

ప్రారంభోత్సవంలో పాల్గొన్న మారిషస్‌ తెలుగు మహాసభ ప్రతినిధులు


హైదరాబాద్: పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రపంచ స్థాయి నాయకుడని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు అన్నారు. కొన్ని కారణాల వల్ల పీవీకి రావాల్సినంత గుర్తింపు రాలేదని వాపోయారు. ఏ పదవి చేపట్టినా సంస్కరణలు తీసుకురావడం పీవీ నైజమని కొనియాడారు. దేవదాయశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా కీలక సంస్కరణల్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. పీవీ శతజయంతి ఉత్సవాల్ని మారిషస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన కేకే.. సిద్ధాంతాలకు అతీతంగా నేతలందరూ పీవీని గౌరవించినట్టు తెలిపారు. ప్రధానిగా పంజాబ్‌, కశ్మీర్‌లో శాంతిస్థాపనకు కృషి చేశారని అన్నారు. బంగారం తాకట్టు పెట్టిన స్థితి నుంచి.. భారత్‌ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు పీవీ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని వెల్లడించారు. విదేశీ విధానాల్లో పీవీ అనుసరించిన ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’ ఫలాలు నేడు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.  


పీవీ విద్వత్తుతోనే విజయం సాధించారు: వాణీదేవి

పీవీ నరసింహారావు తన విద్వత్తుతోనే రాజకీయ రంగంలో విజయం సాధించారని పీవీ తనయురాలు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభివాణీదేవి అన్నారు. పీవీ ఖ్యాతిని ఈ తరానికి చాటి చెప్పాల్సిన అవసరముందని తెలిపారు. పీవీ సాహిత్యాన్ని దేశవిదేశాల్లోని తెలుగువారికి చేరవేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీవీ తీసుకొచ్చిన సంస్కరణ ఫలాల్ని దేశమంతా అనుభవిస్తోందని వివరించారు. రాజీయాల్లోకి రావాలనుకునే యువతరానికి పీవీ మార్గదర్శి అని చెప్పారు. రచయితగా, బహుభాషావేత్తగా, ప్రధానిగా ప్రత్యేకత చాటారని వివరించారు. 


పీవీ విమర్శల్ని లెక్కచేయని కర్మయోగి: పీవీ ప్రభాకర్‌రావు

పరిపాలనలో, సిద్ధాంతాల్లో విమర్శల్ని లెక్కచేయకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్వహించిన కర్మయోగి పీవీ నరసింహారావు అని పీవీ తనయుడు పీవీ ప్రభాకర్‌రావు అన్నారు. సిద్ధాంతాలు ఆటంకాలుగా మారకుండా.. సంపద సృష్టించడం.. ఆ సంపద ఫలాల్ని పేదలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాలన సాగించారని తెలిపారు. ఈ రోజు దేశంలో ఏ రంగం అభివృద్ధిని చూసినా.. పీవీ పాలనలో వేసిన పునాదులే కనిపిస్తాయని అన్నారు. ఐటీ రంగం, కమ్యూనికేషన్‌ అభివృద్ధి, రవాణా, భారీ ప్రాజెక్టుల్లో ప్రైవేటు భాగస్వామ్యం వంటివి సంస్కరణల వల్లే సాధ్యమయ్యాయని వివరించారు. సంస్కరణల ఫలితంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. తత్వవేత్త పాలకుడు అయితే పాలన అద్భుతంగా ఉంటుందన్న సోక్రటీస్‌ మాటలకు పీవీ నిదర్శనమని అన్నారు. 


వివిధ దేశాల్లో పీవీ విగ్రహాలు: మహేశ్‌ బిగాల

మారిషస్‌ సహా వివిధ దేశాల్లో పీవీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, ఎన్నారై కన్వీనర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. పీవీ సాహిత్యాన్ని పంపిణీ చేయడంపై దృష్టి పెడతామని తెలిపారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మారిషస్‌లోని తెలుగు మహాసభ ప్రతినిధులు ఆచార్య కార్తీక్‌, రామకృష్ణ, బల్‌రాజ్‌  పాల్గొన్నారు. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పీవీ మారిషస్‌ పర్యటల్ని గుర్తుచేసుకున్నారు. పీవీ గురించి ఈ తరానికి తెలియచెప్పేందుకు కృషి చేస్తామని అన్నారు.




Updated Date - 2021-04-11T01:48:11+05:30 IST