ఆ ముగ్గురు ముందుకు

ABN , First Publish Date - 2021-07-29T09:47:20+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకమేనా అన్న నిరాశలో ఉన్న అభిమానులకు కాస్త ఊరటనిస్తూ ఆరోరోజు భారత్‌కు ఆశాజనక ఫలితాలు లభించాయి. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, నెంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి, అరంగేట్ర బాక్సర్‌ పూజా రాణి తమ విభాగాల్లో ముందంజ వేసి పతకాలకు చేరువయ్యారు...

ఆ ముగ్గురు ముందుకు

  • ప్రీక్వార్టర్స్‌కు సింధు, దీపిక.. 
  • క్వార్టర్స్‌కు పూజ 
  • సాయి ప్రణీత్‌ ఇంటికి 
  • హాకీ మహిళలు మళ్లీ విఫలం

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకమేనా అన్న నిరాశలో ఉన్న అభిమానులకు కాస్త ఊరటనిస్తూ  ఆరోరోజు భారత్‌కు ఆశాజనక ఫలితాలు లభించాయి. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, నెంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి, అరంగేట్ర బాక్సర్‌ పూజా రాణి తమ విభాగాల్లో ముందంజ వేసి పతకాలకు చేరువయ్యారు. ఇక, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై తెలుగు షట్లర్‌ సాయి ప్రణీత్‌ ఇంటిబాట పట్టగా.. హాకీ అమ్మాయిలు హ్యాట్రిక్‌ ఓటములతో నాకౌట్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకున్నారు. 


బ్యాడ్మింటన్‌ 

గత ఒలింపిక్స్‌లో రజతంతో మురిపించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యోలోనూ పతకం దిశగా సాగుతోంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-జెలో వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి ప్రీక్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆరోసీడ్‌ సింధు 21-9, 21-16తో హాంకాంగ్‌ షట్లర్‌  ని చెంగ్‌ను ఓడించింది. వరుస విజయాలతో గ్రూప్‌-జె టాపర్‌గా నిలిచి సింధు ప్రీక్వార్టర్స్‌ చేరింది. క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం గ్రూప్‌-ఐ టాపర్‌, డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్‌ మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో సింధు తలపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ రెండోమ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. గ్రూప్‌-డిలో భాగంగా జరిగిన పోరులో సాయి ప్రణీత్‌ 14-21, 14-21తో మార్క్‌ కాలిజౌ (నెదర్లాండ్స్‌) చేతిలో వరుసగేముల్లో కంగుతిన్నాడు. దీంతో వరుసగా రెండు ఓటములతో సాయి ప్రణీత్‌ విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు. 




ఆర్చరీ 

మిక్స్‌డ్‌  టీమ్‌ ఈవెంట్‌లో విఫలమైన స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత ఈవెంట్‌లో సత్తాచాటుతూ పతకంపై ఆశలు రేపుతోంది. బుధవారం మొదలైన వ్యక్తిగత విభాగంలో దీపిక రెండోరౌండ్లో 6-4తో అమెరికా ఆర్చర్‌ జెన్నిఫర్‌ మూసినో ఫెర్నాండెజ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌ చేరింది. అంతకుముందు తొలిరౌండ్లో దీపిక 6-0తో కర్మ (భూటాన్‌)ను చిత్తుచేసింది. ఇక, పురుషుల వ్యక్తిగత విభాగంలో వెటరన్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌, అరంగేట్ర ఆర్చర్‌ ప్రవీణ్‌ జాధవ్‌ పోరాటం ప్రీక్వార్టర్స్‌కు ముందే ముగిసింది. తొలిరౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌, రష్యా ఒలింపిక్‌ కమిటీ ఆర్చర్‌ గాల్సన్‌ బజార్జపోవ్‌కు 6-0తో షాకిచ్చిన ప్రవీణ్‌.. తర్వాతి రౌండ్లో తేలిపోయాడు. ప్రపంచ చాంపియన్‌, నెంబర్‌వన్‌ ఆర్చర్‌ బ్రాడీ అలిసన్‌ (అమెరికా)తో పోరులో ప్రవీణ్‌ 0-6తో ఓటమిపాలై ఇంటిబాట పట్టాడు. ఆరంభరౌండ్లో 6-4తో ఒలెక్సి హన్‌బిన్‌ (ఉక్రెయిన్‌)పై నెగ్గిన 37 ఏళ్ల తరుణ్‌దీప్‌ రాయ్‌.. రెండోరౌండ్లో 5-6తో ఇటే షన్నీ (ఇజ్రాయెల్‌) చేతిలో ఓడాడు. పురుషుల్లో భారత్‌ తరఫున మిగిలిన ఏకైక ఆర్చర్‌, దీపిక భర్త అతాను దాస్‌ తన వ్యక్తిగత విభాగం పోరును గురువారం ప్రారంభించనున్నాడు.


సెయిలింగ్‌ 

భారత సెయిలింగ్‌ జోడీ కే గణపతి, వరుణ్‌ టక్కర్‌ పురుషుల స్కిఫ్‌ 49ఈఆర్‌ విభాగంలో నాలుగు రేసులు ముగిసేసరికి 18వ స్థానంలో నిలిచింది. తొలిరేసు మంగళవారమే ముగియగా.. బుధవారం మూడు రేసులు జరిగాయి. వీటిని భారత జంట 18వ, 17వ, 19వ స్థానాలతో ముగించింది.  


రోయింగ్‌

పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరడంలో భారత రోయర్లు విఫలమయ్యారు. రెండో సెమీఫైనల్‌ రేసులో భారత రోయర్లు అర్జున్‌ లాల్‌, అరవింద్‌ సింగ్‌ ఆఖరిదైన ఆరోస్థానంలో నిలిచి నిరాశపరిచారు. 


మహిళల హాకీ

భారత హాకీ అమ్మాయిలు పరాజయాల్లో హ్యాట్రిక్‌ కొట్టారు. బుధవారం జరిగిన పూల్‌-ఎ పోరులో భారత్‌ 1-4తో బ్రిటన్‌ చేతిలో ఓటమిపాలైంది. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను షర్మిలా దేవి (23వ నిమిషం) చేసింది. బ్రిటన్‌ జట్టులో హన్నత్‌ (2వ, 19వ) రెండు గోల్స్‌ కొట్టగా, ఓస్లీ (41వ), బాల్డన్‌ (57వ) చెరో గోల్‌ సాధించారు. మూడో ఓటమితో భారత్‌ నాకౌట్‌ అవకాశాలు సన్నగిల్లాయి. 





బాక్సింగ్‌ 

భారత మహిళా బాక్సర్లు టోక్యోలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే లవ్లీనా క్వార్టర్‌ఫైనల్‌ చేరగా.. తాజాగా పూజా రాణి పతకానికి అడుగుదూరంలో నిలిచింది. బుధవారం జరిగిన 75 కిలోల ఆరంభ బౌట్‌లో రెండుసార్లు ఆసియా చాంపియన్‌ పూజ 5-0తో అల్జీరియా బాక్సర్‌ ఇచ్రాక్‌ చాయబ్‌ను చిత్తుచేసింది. తొలిసారి ఒలింపిక్స్‌ ఆడుతోన్న 30 ఏళ్ల పూజ శనివారం జరిగే క్వార్టర్స్‌లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లి కియాన్‌ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనుంది. 

Updated Date - 2021-07-29T09:47:20+05:30 IST