Abn logo
Aug 1 2021 @ 04:08AM

ఆశలన్నీ కాంస్యంపైనే..

  • సెమీస్‌లో తై జు చేతిలో  సింధు ఓటమి 
  • కాంస్యం కోసం బింగ్‌జియావోతో పోరు  నేడు 

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వర్ణ పతక పోరాటం ముగిసింది. కోట్లాది భారతీయులు ఆత్రుతగా ఎదురుచూసిన సెమీఫైనల్‌లో ఆమెకు నిరాశే ఎదురైంది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌తో జరిగిన ఈ పోరులో మొదట ఆధిక్యం సింధుదే అయినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ ప్రత్యర్థి విశ్వరూపం ప్రదర్శించింది. మెరుపు కదలికలతో, సుదీర్ఘ ర్యాలీలతో సింధుకు చెక్‌ పెట్టి తై జు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సింధు.. ఇక కాంస్యం కోసం చైనా షట్లర్‌ బింగ్‌జియావోతో నేడు తలపడనుంది. డిస్కస్‌ త్రోలో కమల్‌ప్రీత్‌ కౌర్‌  ఫైనల్స్‌కు అర్హత సాధించి పతక ఆశలను సజీవంగా ఉంచగా.. మహిళల హాకీ జట్టు  41 ఏళ్ల తర్వాత క్వార్టర్స్‌ చేరింది. బాక్సింగ్‌, ఆర్చరీ, షూటింగ్‌లో  భారత్‌కు నిరాశే ఎదురైంది.


  • క్వార్టర్స్‌లో మహిళల హాకీ జట్టు
  • డిస్కస్‌ త్రోలో ఫైనల్స్‌కు కమల్‌ప్రీత్‌


టోక్యో: ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత అథ్లెట్ల బృందంలో స్వర్ణం సాధించగల సత్తా పీవీ సింధుకే అధికమని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టే ఈ స్టార్‌ షట్లర్‌ ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండా సెమీస్‌ వరకు దూసుకెళ్లింది. ప్రస్తుత ఫామ్‌తో సింధు తుది పోరుకు వెళ్లడం ఖాయమనే అంతా భావించారు. కానీ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 18-21, 12-21 తేడాతో వరల్డ్‌ నెంబర్‌వన్‌ తైజు యింగ్‌ చేతిలో సింధు పరాజయం పాలైంది. 2016 రియో గేమ్స్‌లో సింధు ఫైనల్‌కు చేరి రజతం సాధించిన విషయం తెలిసిందే. ఇక తైజు చేతిలో సింధుకిది వరుసగా నాలుగో ఓటమి కాగా, ఓవరాల్‌గా 14వది. 5సార్లు మాత్రమే సింధు గెలిచింది. తొలి గేమ్‌లో సింధు నుంచి పోరాటం కనిపించినా రెండో గేమ్‌లో మాత్రం తైజు అద్భుత డ్రాప్‌ షాట్లకు సమాధానమివ్వలేకపోయింది. 40 నిమిషాలపాటు సాగిన సెమీ్‌సలో సింధు తొలి గేమ్‌ బ్రేక్‌ సమయానికి  11-8తో జోరు మీదుంది. ఈ సమయంలో తైజు ఆట పేలవంగా ఉండడంతో సింధు గెలుపు సులువేననిపించింది. కానీ ఆ తర్వాత తైజు ఒక్కసారిగా గేరు మార్చింది. స్ట్రోక్‌ప్లేతో సింధు తడబడేలా చేసింది. తన నెట్‌ గేమ్‌, డ్రాప్‌ షాట్స్‌, ఫోర్‌హ్యాండ్‌ స్మాష్‌లతో చూస్తుండగానే స్కోరు 11-11, 18-18తో ఉత్కంఠభరితంగా మారింది. ఈదశలో చక్కటి డ్రాప్‌ షాట్‌తో తొలిసారిగా 19-18తో తైజు ఆధిక్యంలోకి వెళ్లి మరో రెండు పాయింట్లతో గేమ్‌ను కూడా దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోతైజు హవాకు ఎదురులేకపోయింది. సింధు ఆటతీరును పూర్తిగా అర్థం చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. మొదట 4-4తో సింధు కాస్త పోటీలోకొచ్చినట్టు కనిపించించింది. కానీ తైజుక్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుస నాలుగు పాయింట్లతో 16-8కి దూసుకెళ్లింది. ఈ దశలో సింధు కోలుకోవడం కష్టమై పోగా అటు తైజు విజయం లాంఛనమే అయ్యింది.  మరో సెమీస్‌లో  చెన్‌ యుఫీ (చైనా)  21-16, 13-21, 21-12తో హే బింగ్‌జియావో (చైనా)పై గెలిచి తై జుతో ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైంది.హోరాహోరీ తప్పదా!

స్వర్ణం సాధించగలదనే అంచనాలు తలకిందులైనా.. పీవీ సింధుకు ఇంకా ఒలింపిక్‌ పతకం సాధించే అవకాశం చేజారలేదు. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే సింధుకు కాంస్యం దక్కుతుంది. తద్వారా రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ అందుకున్న అథ్లెట్‌గా నిలుస్తుంది. అయితే గతంలో జియావోతో తొమ్మిది సార్లు తలపడిన సింధు ఆరుసార్లు ఓడడం గమనార్హం. అంతేకాకుండా తనతో ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో సింధు ఒక్కసారే (2019 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌) గెలిచింది. కానీ అన్ని మ్యాచ్‌లు కూడా హోరాహోరీగానే సాగాయి. దీంతో కాంస్య పతక పోరులోనూ సింధు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. 41 ఏళ్ల తర్వాత..

భారత మహిళల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ క్వార్టర్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. తమ చివరి పూల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4-3తో విజయం సాధించింది. వందన కటారియా (4, 17, 49వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడం విశేషం. ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా హాకీ ప్లేయర్‌గా నిలిచింది. ఇక భారత్‌ క్వార్టర్స్‌ బెర్త్‌కు అడ్డుగా ఉన్న ఐర్లాండ్‌ను 2-0తో బ్రిటన్‌ ఓడించింది. ఈ సమీకరణంతో 1980 తర్వాత రాణీ రాంపాల్‌ సేనకు నాకౌట్‌ వెళ్లే సువర్ణావకాశం దక్కింది.

వావ్‌.. కౌర్‌ 


అథ్లెటిక్స్‌

మహిళల డిస్క్‌సత్రోలో కమల్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతంగా రాణిస్తూ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తను మూడో ప్రయత్నంలో డిస్క్‌సను 64.00 మీ. దూరం విసిరి గ్రూప్‌ ‘బి’లో రెండో స్థానం సాధించింది. తద్వారా 2012లో క్రిష్ణ పూనియా తర్వాత ఫైనల్‌ చేరిన రెండో డిస్క్‌స త్రోయర్‌గా నిలిచింది. ఇక వెటరన్‌ త్రోయర్‌ సీమా పూనియా ఆరో స్థానంలో నిలిచి నిష్క్రమించింది. పురుషుల లాంగ్‌జం్‌పలో 7.69మీ. దూరం దూకిన మురళి శ్రీశంకర్‌ 13వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.బాక్సింగ్‌

వరల్డ్‌ నెంబర్‌వన్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ దారుణంగా నిరాశపరిచాడు. పతకం ఖాయమనే అంచనాలున్న అతడికి ఫ్లయ్‌ (48-52కేజీ) విభాగం ప్రీక్వార్టర్స్‌లోనే ఓటమి ఎదురైంది. అమిత్‌ 1-4తో యుబెర్జన్‌ మార్టినెజ్‌ (కొలంబియా) చేతిలో ఓడాడు.ఆర్చరీ

ఆర్చరీలో చివరి పతక ఆశలకు కూడా బ్రేక్‌ పడింది. పురుషుల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లో స్టార్‌ ఆర్చర్‌ అతాను దాస్‌కు చుక్కెదురైంది. 4-6తో తను ఫురుకావా (జపాన్‌) చేతిలో ఓడాడు.షూటింగ్‌

మహిళల 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ 15వ స్థానం, తేజస్విని సావంత్‌ 33వ స్థానంలో నిలవడంతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. గోల్ఫ్‌

పురుషుల వ్యక్తిగత విభాగం మూడో రౌండ్‌లో అనిర్బన్‌ లాహిరికి 13వ స్థానం దక్కగా.. ఉదయన్‌ మానె 55వ స్థానంలో నిలిచాడు.సెయిలింగ్‌

49ఇఆర్‌ 11వ రేసులో భారత జోడీ గణపతి-వరుణ్‌కు 17వ స్థానం.. 12వ రేసులోనూ 17వ స్థానం దక్కింది.