భావోద్వేగానికి లోనయ్యా.. చాలా బాధ అనిపించింది.. : PV Sindhu

ABN , First Publish Date - 2021-08-02T18:58:31+05:30 IST

ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా ఒక్క రజతంతోనే సరిపెట్టుకుంటున్న భారత్‌ ఖాతాలో మరో పతకం...

భావోద్వేగానికి లోనయ్యా.. చాలా బాధ అనిపించింది.. : PV Sindhu

టోక్యో : ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా ఒక్క రజతంతోనే సరిపెట్టుకుంటున్న భారత్‌ ఖాతాలో మరో పతకం జత చేరింది. మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజేతగా నిలిచి కాంస్యం అందుకున్న విషయం విదితమే. మ్యాచ్ ఆడిన మరుసటి రోజు టోక్యోలో మీడియాతో మాట్లాడిన సింధు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పింది. కాంస్యం గెలవడం సంతోషంగా ఉందని మీడియాకు వెల్లడించింది.


భావోద్వేగానికి లోనయ్యా..

కరోనా సమయంలో నా బలహీనతలపై దృష్టి పెట్టాను. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ పార్క్‌ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్‌ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ ఎంతో ఉపయోగపడింది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉంది. సెమీస్‌లో ఓటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యా, చాలా బాధ అనిపించింది. ఈ విజయాన్ని నా కుటుంబానికి, అభిమానులకు అంకింతం చేస్తున్నానుఅని పీవీ సింధు చెప్పింది.


కాగా.. సింధు కెరీర్‌లో తనకిది రెండో ఒలింపిక్‌ పతకం కావడం విశేషం. 2016 రియో గేమ్స్‌లో రజతంతో మురిపించింది. ఇక భారత మహిళా అథ్లెట్లలో సింధు మాత్రమే రెండు వ్యక్తిగత పతకాలను దక్కించుకుంది. ఓవరాల్‌గా సుశీల్‌ కుమార్‌ (2008లో కాంస్యం, 2012లో రజతం) సరసన నిలిచింది. ఆదివారం చైనా క్రీడాకారిణి హి బింగ్‌ జియావోతో జరిగిన ఈ ప్లేఆఫ్‌లో 21-13, 21-15 తేడాతో సింధు వరుస సెట్లలో గెలిచింది.

Updated Date - 2021-08-02T18:58:31+05:30 IST