సింధు సారథ్యంలో..

ABN , First Publish Date - 2021-12-01T08:59:20+05:30 IST

బ్యాడ్మింటన్‌లో సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. టాప్‌ షట్లర్లు పోటీపడే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ బుధవారం మొదలవనుంది.

సింధు  సారథ్యంలో..

భారత్‌ నుంచి బరిలో ఏడుగురు

సింగిల్స్‌లో శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌.. డబుల్స్‌లో సాత్విక్‌, సిక్కి జోడీలు

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నేటినుంచి

బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌లో సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. టాప్‌ షట్లర్లు పోటీపడే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ బుధవారం మొదలవనుంది. ఈసారి భారత్‌ నుంచి అత్యుత్తమంగా ఏడుగురు అథ్లెట్లు టోర్నీకి అర్హత సాధించడం విశేషం. వీరిలో మాజీ  చాంపియన్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ హాట్‌ ఫేవరెట్‌గా పోటీపడుతుండగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిపైనే అందరి దృష్టి నెలకొంది. మిక్స్‌డ్‌ మినహా ప్రతి విభాగం నుంచి భారత షట్లర్లు పోటీ లో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌తో పాటు కిడాంబి శ్రీకాంత్‌.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతి విభాగం నుంచి 8 మంది షట్లర్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నారు. గ్రూపు దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన షట్లర్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 


ఈసారి ఆసక్తికరంగా...

మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఎలో టాప్‌సీడ్‌ పోర్న్‌పవీ (థాయ్‌లాండ్‌), క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌), వొన్నీ లీ (జర్మనీ)తో సింధు ఆడనుంది. 2018లో ఈ మెగా ఈవెం ట్‌ చాంపియన్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది ఒలింపిక్‌ పతకాన్ని నెగ్గడంతో పాటు ఆ తర్వాత జరిగిన మూడు ఈవెంట్లలో సెమీస్‌ చేరి ఫామ్‌ను చాటుకుంది. అదే ఉత్సాహంలో ఈసారి టైటిల్‌ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో తోమా పొపోవ్‌ (ఫ్రాన్స్‌), కున్లావత్‌ (థాయ్‌లాండ్‌)తో కలిసి ఉన్న శ్రీకాంత్‌కు రెండోసీడ్‌ లీ జీ జియా (మలేసియా) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే చాన్సుంది.


ఇక టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), కెంటో మొమోటా (జపాన్‌), రాస్‌ముస్‌ జెమ్‌కె (డెన్మార్క్‌)లాంటి స్టార్లతో గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా కనిపిస్తున్న గ్రూప్‌-ఎలో యువ కెరటం లక్ష్యసేన్‌కు చోటు దక్కింది. దీంతో ఈ టాప్‌ ఆటగాళ్లను ఎదుర్కొని 20 ఏళ్ల లక్ష్య ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్‌ మార్కస్‌-కెవిన్‌, మూడోర్యాంకర్‌ లీ యాంగ్‌-వాంగ్‌, పదో ర్యాంకర్‌ కిమ్‌ ఆస్ట్రప్‌-ఆండర్స్‌ జోడీలున్న గ్రూప్‌-ఎ నుంచి ప్రపంచ 11వ ర్యాంకర్‌ జంట సాత్విక్‌-చిరాగ్‌ తమ పోరు ఆరంభించనుం ది. మహిళల డబుల్స్‌లో రెండోసీడ్‌ నమి మత్సుయామ-చిహారు, గాబ్రియెలా-స్టెఫా నీ, చోలె బిర్చ్‌-లారెన్‌ జంటలతో కలిసి సిక్కిరెడ్డి-అశ్విని గ్రూప్‌-బి నుంచి పోటీపడనుంది. 

Updated Date - 2021-12-01T08:59:20+05:30 IST