ఖతార్ కొత్త కనీస వేతన చట్టం.. ప్రవాసీయులకు ప్రయోజనం !

ABN , First Publish Date - 2021-03-18T15:38:13+05:30 IST

ప్రవాస కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఖతార్ కొత్త కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చింది.

ఖతార్ కొత్త కనీస వేతన చట్టం.. ప్రవాసీయులకు ప్రయోజనం !

దోహా: ప్రవాస కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఖతార్ కొత్త కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ నెల 20 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయబోతుంది. కనీస వేతనాన్ని పెంచుతూ ఆ దేశ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. లా నెం.17 ఆఫ్ 2020 పేరిట తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం ఇకపై ప్రతి కార్మికునికి కనీస వేతనంగా 1000 రియాళ్లు(భారత కరెన్సీలో సుమారు రూ.20వేలు) అందనున్నాయి. ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు ఆయా కంపెనీలు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తే ప్రతి నెలా 1000 రియాళ్ల కనీస వేతనం చెల్లించాలి. ఒక వేళ వసతి, భోజన సదుపాయాలను కల్పించకపోతే అదనంగా 800 రియాళ్లను చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో వసతికి 500 రియాళ్లు, భోజనానికి 300 రియాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది.


ఈ నెల 20వ తేదీ నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని కార్మికశాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కంపెనీల యాజమాన్యాలకు కార్మిశాఖ సందేశాలు పంపించింది. కాగా, ప్రస్తుతం ఖతార్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస కార్మికులకు నెలకు 500 రియాళ్ల నుంచి 700 రియాళ్ల వరకు వేతనం అందుతున్నట్లు సమాచారం. తాజా కనీస వేతనం పెంపుతో ప్రవాస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    



Updated Date - 2021-03-18T15:38:13+05:30 IST