ఖ‌తార్‌లో పంజా విసురుతున్న‌ 'క‌రోనా'.. ఒక్క‌రోజే 88 కేసులు..

ABN , First Publish Date - 2020-04-02T13:47:40+05:30 IST

గ‌ల్ఫ్ దేశాల్లోనూ కొవిడ్‌-19 చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్ దేశాల్లో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది.

ఖ‌తార్‌లో పంజా విసురుతున్న‌ 'క‌రోనా'.. ఒక్క‌రోజే 88 కేసులు..

ఖ‌తార్: ప్ర‌పంచ దేశాలు క‌రోనా వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నాయి. అగ్ర‌రాజ్యాల‌ను సైతం ఈ మ‌హ‌మ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ‌ల్ఫ్ దేశాల్లోనూ కొవిడ్‌-19 చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్ దేశాల్లో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఖ‌తార్‌లో ఏకంగా 88 కొత్త కేసులు న‌మోదు కావ‌డం అధికారుల‌ను క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. దీంతో ఖ‌తార్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 835కి చేరాయి. ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో 11 మంది కోలుకున్న‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇక కొత్త‌గా న‌మోదైన 88 కేసుల్లో ఇటీవ‌ల విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారిగా గుర్తించారు. వారి ద్వారా మ‌రికొంత మందికి క‌రోనా సోకింద‌ని అధికారులు తెలిపారు. అలాగే మంగ‌ళ‌వారం చ‌నిపోయిన 58 ఏళ్ల వ్య‌క్తి దీర్ఘ‌కాలిక వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. 


మ‌రోవైపు బ‌హ్రెయిన్ త‌మ దేశంలో క‌రోనా బారిన‌ప‌డిన 21 మంది కోలుకోవ‌డంతో డిశ్చార్జి చేసిన‌ట్లు తెలిపింది. కొత్త కేసులు కూడా న‌మోదు కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు బ‌హ్రెయిన్‌లో 569 మంది కొవిడ్‌-19 బారిన‌ప‌డ‌గా, న‌లుగురు మ‌ర‌ణించారు. క‌రోనాతో బాధపడుతున్న 47 మంది ప్రవాసులకు ఉచిత చికిత్స అందించాలని బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-04-02T13:47:40+05:30 IST