క్వాడ్‌ శిఖరాగ్రం

ABN , First Publish Date - 2021-03-16T06:52:04+05:30 IST

దాదాపు దశాబ్దంన్నర క్రితం ఒక ఆలోచనగా ఆరంభమైన ‘క్వాడ్‌’ మొన్న శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుకుంది. సర్వసాధారణంగా ఇటువంటి సదస్సులు...

క్వాడ్‌ శిఖరాగ్రం

దాదాపు దశాబ్దంన్నర క్రితం ఒక ఆలోచనగా ఆరంభమైన ‘క్వాడ్‌’ మొన్న శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుకుంది. సర్వసాధారణంగా ఇటువంటి సదస్సులు సామాన్యులకు పెద్దగా పట్టవు కానీ, కరోనా నేపథ్యంలో, ఇలా నాలుగుదేశాలు ఒక్కటై కోట్లాది వాక్సిన్ల తయారీకి సంకల్పించడం ఎంతోమందికి సంతోషం కలిగించింది. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్న ఈ చతుర్భుజ కూటమి చైనాకు వ్యతిరేకం కాదనీ, దీనికి మరిన్ని విస్తృతమైన లక్ష్యాలు, ఆదర్శాలు ఉన్నాయని అంటున్నారు. చైనా ఈ వాదనను నమ్మినా, నమ్మకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగే, కేవలం ఈ కూటమితో చైనా దూకుడును బాగా నియంత్రించగలమన్న నమ్మకం ఈ నాలుగుదేశాలకూ ఉన్నదని కూడా అనుకోలేం. 


క్వాడ్‌ దేశాధినేతల వర్చువల్‌ సమావేశం ఎంతో సంతృప్తినిచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తంచేశారు. నలుగురు దేశాధినేతలు ఇలా నేరుగా మాట్లాడుకొనే స్థాయికి ఇది చేరడం వెనుక నిజానికి ఆయన చొరవే అధికంగా ఉన్నది. బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా క్వాడ్‌ చురుకుగా కదలడం విశేషం. గతనెలలో ఆయన జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో గత కాలపు దోస్తీని పునరుద్ధరించే ప్రయత్నం ఒకటి చేశారు. చేయీచేయీ కలిపి చైనా దూకుడుకు ముకుతాడు వేద్దాం రండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు ఈయూ చప్పగా ప్రతిస్పందించింది. చైనాతో ఘర్షణ పెట్టుకొనే ఉద్దేశంలో ఈ దేశాలు లేవు. జర్మనీ, ఫ్రాన్స్‌ వైఖరి చూసిన తరువాత బైడెన్‌కు వాతావరణం బాగా అర్థమైంది. నాటో కూటమి కొనసాగాలంటే ఖర్చు మీరే పెట్టుకోవాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చేయడం, మిత్రదేశాలను ఓ ఆర్థికభారంగా ప్రచారం చేయడం ఈ దేశాలకు నచ్చలేదు. ఇదే అదనుగా ఈయూతో చైనా దగ్గరైంది. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై చర్చలను చకచకాపూర్తిచేసి అవగాహనలు కుదర్చుకుంది. ఈ నేపథ్యంలో, ట్రంప్‌ ఏలుబడిలో అమెరికాకు దూరమైన ఈ దోస్తులను తిరిగి దగ్గర చేసుకోవాలని బైడెన్‌ ఓ ప్రయత్నం చేశారు కానీ అది ఆశించినంత ఫలితానివ్వలేదు. దీంతో ‘ఆసియా నాటో’ అని ముద్దుగా పిలుచుకుంటున్న ఈ క్వాడ్‌ విషయంలో బైడెన్‌ మరింత చొరవగా, ఊహించనంత ఉదారంగా ముందడుగువేశారని అంటారు. అమెరికా కొత్త రక్షణమంత్రి అస్టిన్‌ లాయిడ్‌ రంగంలోకి దిగడంతో శిఖరాగ్ర సదస్సు తేదీలు ఖరారైనాయి. చైనా దూకుడుకు కళ్ళెం వేయడమే అసలు లక్ష్యం కానీ, నేరుగా గురిపెట్టినట్టుగా కనిపించకుండా కాస్తంత జాగ్రత్తపడ్డారు. గతంలో టోక్యోలో జరిగిన విదేశాంగమంత్రుల సమావేశంలో మైక్‌పాంపియో చైనాను తీవ్రంగా దునుమాడిన కారణంగానే సంయుక్త ప్రకటన వెలువరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయని అంటారు. ఇప్పుడు, అందుకు భిన్నంగా, సంయుక్త ప్రకటనతో పాటు, అందులోని భాష చక్కగా, ప్రజాస్వామికంగా, అందరినీ కలుపుకొనిపోయేట్టుగా ఉండటం వెనుక భారతదేశం చొరవ ఉన్నదని అంటున్నారు. ఈ ప్రాంతంలోని చాలాదేశాలు నేరుగా చైనా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే స్థితిలో లేనందున, ఈ వాస్తవాన్నీ అమెరికా అసలు లక్ష్యాన్నీ సమపాళ్ళలో మేళవిస్తూ సంయుక్త ప్రకటన వెలువడిందని కొందరి అభిప్రాయం.


క్వాడ్‌ భవిష్య వ్యూహాలేమిటన్నవి అటుంచితే, ఇలా నాలుగుదేశాలూ ఒక్కటై కరోనామీద వాక్సిన్‌ యుద్ధానికి దిగడం సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం. భారత్‌లో వందకోట్ల టీకాల తయారీకి అమెరికా జపాన్లు సాయం చేయడం, సరఫరా, రవాణా బాధ్యతలను ఆస్ట్రేలియా తీసుకోవడం బాగుంది. కరోనా కొత్త వేవ్‌ భయాల నేపథ్యంలో, అరడజనుపైగా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద సూచికలు కనిపిస్తున్న స్థితిలో యుద్ధానికి ఇది ఇతోధికంగా ఉపకరిస్తుంది. దేశంలో వాక్సినేషన్‌ కార్యక్రమం ఆశించినంత వేగంగా జరగడం లేదనీ, వాక్సిన్‌ కొరత కూడా ఉన్నదని విమర్శలు వస్తున్నస్థితిలో, కరోనా వైరస్‌ను ఉమ్మడిగా ఎదుర్కొందామన్న క్వాడ్‌ సంకల్పం మంచిదే. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా టీకా దౌత్యానికి కళ్ళెం వేయడానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. చైనానుంచి తమకు ఎదురవుతున్న సవాళ్ల గురించి క్వాడ్‌ దేశాధినేతలు చర్చించారనీ, ఆ దేశం ఘర్షణలు వీడుతుందన్న నమ్మకం తమకు లేదని సదస్సులో తేల్చేశారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఒక ప్రకటన చేశారు. చైనా లక్ష్యంగా కాక, నాలుగుదేశాల మధ్య పరస్పర సహకారం కోసమే క్వాడ్‌ పుట్టుకొచ్చిందని ఎవరూ అనుకోవడం లేదు. దీని వెనుక అమెరికా ప్రయోజనాలు ఏమైనప్పటికీ, చైనాతో ఏ విధంగా వ్యవహరించాలో ఇటీవల దానితో సుదీర్ఘకాలం ఘర్షణపడిన మనకు తెలియనిది కాదు.

Updated Date - 2021-03-16T06:52:04+05:30 IST