Abn logo
Apr 2 2021 @ 04:31AM

యోగ్యత–సందర్భం

ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు 2019 సంవత్సరానికి గాను అత్యున్నత సినీరంగ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. వ్యక్తిగత నటనా విశేషాలతో అశేష అభిమానగణాన్ని సంపాదించుకోవడంతో పాటు, సినిమా వ్యాపారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లిన రజనీకాంత్ అన్నివిధాల ఈ గుర్తింపునకు యోగ్యుడు. మరో సందర్భంలో, నాలుగు నెలల ముందు అయినా, నాలుగు వారాలు ఆగి అయినా ఈ ప్రకటన చేస్తే బాగుండేది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఐదురోజులుండగా ఈ ప్రకటన చేయడం కేంద్రప్రభుత్వం, బిజెపి-–అన్నాడిఎంకె అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్టార్ ప్రతిష్ఠను కొంత చిన్నబుచ్చినట్టు అయ్యింది. రాజకీయాల అండ లేకుండానే స్వయంప్రకాశం కలిగిన ‘తలైవా’ అతను. 


చలనచిత్రరంగానికి విశేషసేవలు అందించినవారికి ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తారు. భారతదేశంలో చలనచిత్రరంగానికి తొలి అడుగులునేర్పినవారు ఫాల్కే. ఆయన స్మృతిలో 1969 నుంచి భారత ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తున్నది. సినీరంగంలో శిఖరాయమాన పురస్కారంగా ఫాల్కే అవార్డు ఉండాలన్న ఆశయానికి తగ్గట్టుగానే దేవికారాణి, పృధ్వీరాజ్ కపూర్, సత్యజిత్ రే, శాంతారామ్, బి.ఎన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్, పైడి జయరాజ్, ఎల్‌వి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కె.విశ్వనాథ్.. ఇంకా అనేకమంది ఉద్దండులు గ్రహీతలుగా ఉన్నారు. ఇంకా పురస్కారం అందవలసి ఉండిన అనేకులకు అందలేదు కూడా. ఒకరిద్దరు స్థాయికి తగని సన్మానితులుకూడా ఉంటే ఉండవచ్చు. 2018 సంవత్సర పురస్కారం అమితాబ్ బచ్చన్‌ను వరించింది. గతంలో తమిళ అగ్ర కథానాయకుడు శివాజీ గణేశన్‌కు కూడా ఫాల్కే లభించింది. ఈ క్రమంలో 51వ అవార్డు రజనీకాంత్‌కు లభించింది. ఇది అత్యంత సహజమూ న్యాయమూ కూడా. 


తమిళంలో కొత్తరకం సినిమాలను సృజించిన ప్రతిభాశాలి కె. బాలచందర్ తీర్చిదిద్దిన నటుడు రజనీకాంత్. ఆయన, కమల్ హాసన్ ఇద్దరూ బాలచందర్ ద్వారా ఎదిగి, తమిళ చిత్రసీమలో రెండు శిఖరాలుగా నిలిచారు. ప్రయోగాత్మకంగాను, శిష్ట వర్గ అభిరుచులకు తగ్గట్టుగాను తమ నటనావ్యక్తిత్వాన్ని కమల్ హాసన్ రూపొందించుకోగా, వ్యాపారాత్మకంగానూ, జనరంజకంగాను ఉండే మార్గాన్ని రజనీకాంత్ ఎన్నుకున్నారు. వ్యాపార సినిమాలోనూ కొత్త సాంకేతిక ధోరణులు, కొత్త నిర్మాణ విలువలు తెలిసిన దర్శకులతోను, సాంకేతిక నిపుణులతోను రజనీకాంత్ ప్రయాణించారు. తమిళ చిత్రాలలో ప్రత్యేక లక్షణంగా ఉండిన ‘అతి నటన’, ‘బిగ్గర మాటలు’ రజనీ దగ్గరికి వచ్చేసరికి వెనక్కితగ్గి, శైలీయుత నటనారీతి, పదునైన సంభాషణలు ఆదరణలోకి వచ్చాయి. రజనీకాంత్ స్టయిల్, అతిశయం తమిళప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అద్భుతాలను స్టయిల్‌గా చేయగలిగిన నటుడిగా ఆయనను ఆరాధించారు. అభిమానులు ఎంతగా ఆయన వెంట సమీకృతులయ్యారంటే, తమిళసినిమా ఆర్థికశాస్త్రమే మారిపోయింది. తమిళులు ఎక్కడ ఉంటే అక్కడ, మలేసియాలో, సింగపూర్‌లో, జపాన్‌లో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన ప్రారంభ వసూళ్లు రాసాగాయి. 1975లో అపూర్వ రాగంగళ్ అనే కొత్త తరహా సినిమాతో ప్రవేశించిన రజనీకాంత్, 1996లో బాషా సినిమా నాటికి ఆరాధ్య కథానాయకుడయ్యారు. 2007లో ‘శివాజీ’ సమయానికి 100 కోట్ల వ్యాపారం చేసే సినిమాల హీరో అయ్యారు. ఆ తరువాత పదేళ్లలోనే ‘రోబో’ (ఎంతిరన్) వెయ్యికోట్ల మార్కెట్‌ను కళ్లచూసింది. తమిళనాడులోనే కాక, తక్కిన దక్షిణ రాష్ట్రాలలోను, హిందీ ప్రాంతాలలోను కూడా రజనీ సినిమాలకు మంచి ఆదరణ, వ్యాపారం లభిస్తుంది. 


పాతికేళ్ల కిందట 1996లో రజనీకాంత్ మొదటిసారిగా రాజకీయ వ్యాఖ్య చేశారు. అప్పుడు జయలలిత ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆమె కనుక మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు అని రజనీ చేసిన వ్యాఖ్య, అప్పటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసిందంటారు. అప్పటి నుంచి రజనీ రాజకీయరంగ ప్రవేశం గురించిన కథనాలు తరచు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఆయన కూడా అందుకు తగ్గట్టుగా, అప్పుడప్పుడు సినిమాలలో తన రాజకీయ ప్రవేశం గురించిన సూచనాత్మక సంభాషణలు జొప్పించేవారు. దాదాపు పాతికేళ్ల పాటు అదే ఉత్కంఠతో తన అభిమానులను నిరీక్షింపజేయడం కూడా రజనీ రికార్డులలో ఒకటిగా చెప్పుకోవాలి. మూడేళ్ల కిందట రాజకీయ సంకల్పాన్ని స్పష్టంగా చెప్పి, ఏడాది కిందట మరొక అటూ ఇటూ కాని అస్పష్ట ప్రకటన చేసి, మళ్లీ కొన్నినెలల తరువాత జనవరి 2021లో పార్టీ ఖాయమని ప్రకటించి, సంవత్సరాంతానికి అంతా తూచ్ అని ఆరోగ్యం సహకరించదు కాబట్టి మొత్తంగా విరమించుకుంటున్నట్టు తేల్చేశారు. రజనీకాంత్ పార్టీ పెడితే అది బిజెపి కోవలో ఉంటుందని, ఆధ్యాత్మిక రాజకీయాలని ఆయన చెప్పిన దాని అర్థం అదే అని కొందరు భాష్యం చెప్పారు. జయలలిత మరణించినప్పటి నుంచి రజనీకాంత్‌తో జాతీయపార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని, రజనీతో కలసి నడవడానికి అన్నాడిఎంకె వర్గాలు సుముఖంగా లేనందున, రజనీ విరమణకు ఆ పార్టీయే సూచనలు చేసి ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. రజనీని, ఆ తరువాత శశికళను రంగంలో లేకుండా చేయడంలో ఒక వ్యూహం ఉన్నదని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి, తన ఆరోగ్య కారణాల వల్ల కానీ, మరెందువల్లనో కానీ రజనీ రాజకీయాలలోకి రాకముందే తప్పుకున్నారు. ఇక రజనీ ప్రతిష్ఠ నుంచి పొందగలిగే రాజకీయ ప్రయోజనం ఇదొక్కటే అని భావించి ఈ సమయంలో అవార్డు ప్రకటన చేసి ఉండవచ్చు. రజనీకి అవార్డు ఇవ్వడం ద్వారా బిజెపి–అన్నాడిఎంకె కూటమికి అదనపు ఓట్లు వస్తాయా? 


రజనీకి ఈ పురస్కారాన్ని అన్ని పక్షాల వారు అంగీకరిస్తారు, ఆహ్వానిస్తారు. ఇందులో రాజకీయ ప్రయోజనాల చర్చకు ఆస్కారమే ఉండకూడదు. పోలింగ్‌కు ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవలసింది కాదు.