Abn logo
Sep 19 2021 @ 00:58AM

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

స్వచ్ఛత పరిశీలన బృందం పర్యటన

రావులపాలెం రూరల్‌, సెప్టెంబరు 18: ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ స్వచ్ఛత పరిశీలన బృంద సభ్యులు ఊబలంక పీహెచ్‌సీని పరిశీలించారు. బృంద సభ్యులు డాక్టర్‌ హృషికేష్‌ పీహెచ్‌సీ ఆవరణలోని పరిసరాలను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలన్నారు. పీహెచ్‌సీ రికార్డులను పరిశీలించారు.  స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారులు దుర్గాప్రసాద్‌, చంద్రశేఖర్‌, అనూరాధ, ఇతర సిబ్బంది సాయిరాం, బిషప్‌ పాల్గొన్నారు.


పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు 

కొత్తపేట, సెప్టెంబరు 18: శుక్రవారం అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి వాడపాలెం లాకుల సమీపంలో పంటకాల్వలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని రక్షించడంతో పెనుప్రమాదం తప్పింది. వీరు రాజమహేంద్రవరం నుంచి అమలాపురం కొంకాపల్లి వెళ్తున్నట్టు, వాడపాలెం లాకుల సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి పల్టీ కొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల ఇదే ప్రదేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఈమలుపు వద్ద  హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు.