ఐదు శతాబ్దాల క్రితమే క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-03-30T13:36:56+05:30 IST

క్వారంటైన్‌... కరోనా వైరస్‌ మూలంగా బాగా వాడుకలోకి వచ్చిన పదం.

ఐదు శతాబ్దాల క్రితమే క్వారంటైన్‌

క్వారంటైన్‌... కరోనా వైరస్‌ మూలంగా బాగా వాడుకలోకి వచ్చిన పదం. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఒక వ్యక్తిని బయట తిరగకుండా ఒక ప్రదేశానికి పరిమితం చేసి ఉంచడాన్ని క్వారంటైన్‌ అంటున్నారు.

ఈ పదం, ఈ విధానం మనం మొదటిసారి వింటున్నాం కానీ యూరప్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్‌ను అమలు చేశారు. క్వారంటైన్‌ కోసమే ప్రత్యేకంగా ఎత్తైన గోడలు, విశాలమైన గదులతో ప్రత్యేక క్వార్టర్లు నిర్మించారు. ఆ క్వార్టర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

క్రోయేషియాలోని డుబ్రావ్నిక్‌ అనే పట్టణంలో క్వారంటైన్‌ కోసం క్వార్టర్లను నిర్మించారు. మధ్యదరా సముద్రం ఒడ్డున ఒక దీవిలా ఉండే ప్రదేశంలో ఈ  క్వార్టర్లు చూడొచ్చు.

14వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి బారినపడిన వారిని క్వారంటైన్‌లో పెట్టడం కోసం వీటిని నిర్మించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఆ రోజుల్లోనే ఈ విధానం అమలు చేశారు.

మొదట్లో ఈ దీవిలో క్వార్టర్లు ఉండేవి కావు. ప్లేగు వ్యాధి బారినపడిన వారిని క్వారంటైన్‌ చేయడం కోసం ఈ దీవికి తెచ్చి వదిలేసే వారు. ఆ తరువాత కాస్త నీడైనా కల్పించాలనే ఉద్దేశంతో క్వార్టర్లు నిర్మించారు. 

ప్రస్తుతం ఈ ప్రదేశం టూరిస్ట్‌ స్పాట్‌గా గుర్తింపు పొందింది. కరోనా వైరస్‌ మూలంగా ఈ ప్రదేశం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated Date - 2020-03-30T13:36:56+05:30 IST