క్వారంటైన్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2021-05-05T09:18:06+05:30 IST

మొదటి దశలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ‘క్వారంటైన్‌ కేంద్రాలు’ ఎంతగానో ఉపయోగపడ్డాయి. అవే ప్రధాన అస్త్రాలుగా పనిచేశాయి

క్వారంటైన్‌ ఎక్కడ?

ముంచేస్తున్న హోం ఐసొలేషన్‌.. 70 శాతం వ్యాప్తికి కారణం ఇదే 

ప్రాణాల మీదకొచ్చే వరకూ పసిగట్టలేని స్థితి

మొదటి దశలో వైరస్‌ కట్టడికి క్వారంటైనే ప్రధాన అస్త్రం

రెండో దశలో క్వారంటైన్‌ లేక వైరస్‌ విజృంభణ

14 శాతానికి పెరిగిపోయిన పాజిటివ్‌ రేటు

కరోనా బారిన పడుతున్న కుటుంబాలు


విజయవాడలోని ఓ కుటుంబంలో భార్యకు పాజిటివ్‌ నిర్థారణైంది. హోం ఐసొలేషన్‌ ప్రారంభించిన రెండు రోజులకు పెద్ద కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. మరో రెండు రోజులకు చిన్న కుమారుడికి పాజిటివ్‌ నిర్థారణైంది. వారం రోజుల్లో అందరూ కోలుకున్నారనే సమయంలో భర్తకు కరోనా సోకింది. ఆయనా తొలుత హోం ఐసొలేషనే ఎంచుకున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోవడంతో ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఇలానే హోం ఐసొలేషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మొదటి దశలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ‘క్వారంటైన్‌ కేంద్రాలు’ ఎంతగానో ఉపయోగపడ్డాయి. అవే ప్రధాన అస్త్రాలుగా పనిచేశాయి. ఒక ఇంట్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ఆ ఇంటి ముందుకు వెంటనే అంబులెన్స్‌ వచ్చేంది. ఆ వ్యక్తిని సీసీసీ(కొవిడ్‌ కేర్‌ సెంటర్‌)కు లేదా, ఆస్పత్రికి తరలించేవారు. కుటుంబ సభ్యులనూ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి ఏడు నుంచి 14 రోజులపాటు ఆ సెంటర్‌లో ఉంచేవారు. వారం తర్వాత వారికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తేనే ఇంటికి పంపించేవారు. అలా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో పాటు ఆ కుటుంబాన్ని కూడా మిగిలిన వారికి దూరంగా ఉంచేవారు. దీని వల్ల కరోనా వ్యాప్తిని కొంత మేర అడ్డుకోడానికి అవకాశం ఉండేది. కరోనా రెండో దశలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంక్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయడం లేదు. కేవలం సీసీసీ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. 


అరచేతిలో ప్రాణాలు..

కరోనా మొదటి దశలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని సీసీసీలో ఉంచి,  అక్కడ ఆరోగ్యం క్షీణిస్తే ఆస్పత్రులకు తరలించేవారు. అక్కడ కూడా ఆరోగ్యం మెరుగుపడకపోతే రాష్ట్రస్థాయి ఆస్పత్రులకు పంపించే వారు. ఇందంతా ప్రభుత్వమే ఒక పద్ధతి ప్రకారం చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇవేమీ లేవు. ‘ఎవరి కరోనాను వారే తగ్గించుకోవాలి. ఎవడి చావు వాడే చావాలి’ అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో వైరస్‌ మరణ మృదంగం మోగిస్తోంది. పాజిటివ్‌ రేటు 14 శాతానికి పెరిగిపోయింది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్‌ సోకిన వారికి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం పోయింది. పాజిటివ్‌ సోకిన ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు.  

 

ప్రమాదకరంగా హోం ఐసొలేషన్‌..

హోం ఐసొలేషన్‌ అత్యంత ప్రమాదకంగా తయారైంది. హోం ఐసొలేషన్‌ అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇలాంటి ప్రమాదకరమైన హోం ఐసొలేషన్‌ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. హోం ఐసొలేషన్‌ ఎంచుకున్న చాలా మంది సొంతవారిని కోల్పోయారు. దారిద్య్రరేఖకు పైన ఉన్న వారికి ఇంట్లో మూడు లేదా నాలుగు గదులు ఉంటాయి. కాబట్టి వాళ్లు హోం ఐసొలేషన్‌ను ఎంచుకుంటున్నారు. ఇది అందరికీ సాధ్యం కాదు. పేదలు, మధ్య తరగతి వాళ్లు ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురు ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ప్రత్యేక గదిని కేటాయించినా, ఇంట్లో చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు ఏదో ఒక సమయంలో వారితో టచ్‌ అవుతారు. అందరూ ఒకే టాయిలెట్‌ ఉపయోగించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక చోట పాజిటివ్‌ వ్యక్తితో కాంటాక్ట్‌ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి పేద, మధ్య తరగతివాళ్లు హోం ఐసొలేషన్‌ కంటే ఆస్పత్రుల్లో చేరడం మంచిదని వైద్య నిపుణులు కూడా చూస్తున్నారు. 


చెప్పింది జరగట్లేదు...

హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి బాధ్యత మాదే. వారికి అవసరమైన మందులు అందిస్తాం. ఏఎన్‌ఎం లేదా ఆశ వర్కర్‌ రోజుకోసారి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మేం ఆస్పత్రికి తరలిస్తాం. ఇదీ హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం చెబుతున్న మాటలు. కానీ ఇందులో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. హోం ఐసొలేషన్‌లో ఉన్న చాలా మంది సొంత డబ్బులతో మందులు కొనుక్కుంటున్నారు. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు వచ్చే పరిస్థితే లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలిస్తామని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కరోనాలో అత్యవసర పరిస్థితి అంటే ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో అందకపోవడమే. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా ఉన్న బెడ్స్‌ కొరత తీవ్రమైంది. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎక్కడా దొరకడం లేదు. చివరికి ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఆక్సిజన్‌ సరఫరా ఉన్న బెడ్స్‌ అందుబాటులో ఉండటం లేదు. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినా మూడు గంటల్లో బెడ్స్‌ దొరికే పరిస్థితి లేదు. దీంతో అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో పది వేల కేసులు నమోదైనప్పుడే వందల సంఖ్యలో క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు రోజుకు దాదాపు 20 వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ, ప్రభుత్వం హోం ఐసొలేషన్‌నే ప్రోత్సహిస్తోంది. ఇలాంటి చర్యలతో కరోనా మరింత తీవ్రం అవ్వడం తప్ప, తగ్గుముఖం పట్టే మార్గం కనిపించడం లేదు. 

Updated Date - 2021-05-05T09:18:06+05:30 IST