ఇదెక్కడి క్వారంటైన్‌?

ABN , First Publish Date - 2020-03-29T10:41:54+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారి ఇళ్లకు మాత్రమే స్టిక్కర్లు అతికిస్తుండగా.. దానికి భిన్నంగా ‘క్వారంటైన్‌ జోన్‌‘ అంటూ నగరంలోని మణికొండ తానేష్‌ నగర్‌ వద్ద వెలిసిన బ్యానర్‌ శనివారం కలకలం

ఇదెక్కడి క్వారంటైన్‌?

  • ఇళ్లను వదలి కాలనీలు చేయడం ఏమిటి?
  • వాస్తవ సమస్యలను పట్టించుకోరా?
  • మార్గదర్శకాలు లేవంటున్న జీహెచ్‌ఎంసీ
  • మణికొండలో ‘ప్రభుత్వ‘ బ్యానర్‌
  • శాఖల సమన్వయలోపంతోనే సమస్య?

(హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారి ఇళ్లకు మాత్రమే స్టిక్కర్లు అతికిస్తుండగా.. దానికి భిన్నంగా ‘క్వారంటైన్‌ జోన్‌‘ అంటూ నగరంలోని మణికొండ తానేష్‌ నగర్‌ వద్ద వెలిసిన బ్యానర్‌ శనివారం కలకలం రేపింది. దీనిపై సోషల్‌ మీడియాలో ఎవరికివారు తోచిన వ్యాఖ్యానం చేయడం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే, ‘తెలంగాణ ప్రభుత్వం’ పేరిట ఉన్న ఈ బ్యానర్‌ను తాము ఏర్పాటు చేయలేదని అటు సైబరాబాద్‌ పోలీస్‌, ఇటు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులూ సంబంధం లేదని ప్రకటించారు. కాగా, ఇళ్ల వరకు స్టిక్కర్లు అతికిస్తే ఇబ్బందేమీ లేదని.. ఒక ప్రాంతం మొత్తానికి ‘క్వారంటైన్‌ జోన్‌’గా ఎలా చేస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జోన్‌ పరిధిలో కిలోమీటరు మేర రాకపోకలను అనుమతించరని తెలిసిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘లోపలకు ఎవరిని రానివ్వనంటున్నారు.


బయటకు పోనివ్వమంటున్నారు. పాలు.. కూరగాయలు.. మంచి నీళ్ల క్యాన్లు సంగతి ఏమిటి? వాటిని ఎలా అందిస్తారు?’ అని మణికొండ వాసి ఒకరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌ జోన్‌ మార్గదర్శకాలు ఏమిటి? అంటూ పలు శాఖల అధికారులను కోరినా, సమాధానం రాలేదు. బ్యానర్‌ను తొలగించే ప్రయత్నమూ చేయలేదు. ‘క్వారంటైన్‌ జోన్లు అంటూ మేం ఎలాంటి బ్యానర్లు పెట్టడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం’ అని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య తెలిపారు. 


హైదరాబాద్‌లో రెడ్‌జోన్లు లేవు: ఈటల

గచ్చిబౌలి, మార్చి28 (ఆంధ్రజ్యోతి): కరోనా నిరోధానికి హైదరాబాద్‌ నగరంలో రెడ్‌ జోన్‌ ప్రతిపాదన ఏదీ లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. వదంతులతో ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దని కోరారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారన్నారు. గచ్చిబౌలిలో 1500మందిని క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-29T10:41:54+05:30 IST