టీకాల కోసం బారులు

ABN , First Publish Date - 2021-04-17T06:00:32+05:30 IST

జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు.

టీకాల కోసం బారులు
గోదావరిఖనిలో కరోనా టెస్ట్‌ కోసం వచ్చిన ప్రజలు

- అపోహలు తొలగి పెరుగుతున్న ఆసక్తి

- రోజుకు సగటున 4వేల మందికి వ్యాక్సిన్‌

- జిల్లాలో 30 కేంద్రాల ఏర్పాటు..

- మరిన్ని పెంచాలని కోరుతున్న ప్రజలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)  

జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు క్రమంగా తొలగిపోతుండడంతో వ్యాక్సిన్లు వేసుకునేందుకు డిమాండ్‌ పెరుగుతున్నది. రోజుకు ఒక్కో కేంద్రానికి వంద నుంచి 200 మందికి పైగా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వస్తున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలో 199 మందికి కరోనా వైరస్‌ సోకగా, దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,327కి చేరింది. దీంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. వారం రోజుల నుంచి వ్యాక్సిన్‌ వేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 4,041 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం గమనార్హం. 

30 ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌..

జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్లు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది. దేశంలోనే రూపొందించిన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను ప్రభుత్వం ఉచితంగా వేస్తున్నది. మొదట ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకాలు వేయగా, ఆ తర్వాత 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, 45 నుంచి 59 సంవత్సరాల వరకు వయసుగల వారై ఉండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు టీకాలను వేయడం ప్రారంభించారు. జిల్లాలో శుక్రవారం నాటికి 40,578 మందికి వ్యాక్సిన్‌ వేయగా, ఇందులో 29 ప్రభుత్వ కేంద్రాల్లో 40,342 మందికి, ప్రైవేట్‌ ఆసుపత్రిలో 236 మంది వ్యాక్సిన్లు వేసుకున్నారని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు పేన్కొన్నారు. 60 ఏళ్లు నిండిన వాళ్లు 14,578 మందికి, 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి 15,286 మందికి, 45 ఏళ్లలోపు హెల్త్‌వర్కర్లు 5,386 మందికి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు 5,388 మందికి వ్యాక్సిన్లు వేశారు. 

ఎండలను సైతం లెక్కచేయకుండా...

జిల్లాలో వ్యాక్సిన్‌ కేంద్రాలకు ప్రజలు ఎండలను సైతం లెక్కచేయకుండా తరలివస్తున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 30 కేంద్రాల్లో సగటున రోజుకు 100 నుంచి 120 మందికే వ్యాక్సిన్‌ ఇవ్వాలని భావించినప్పటికీ, రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కొవిడ్‌ టీకాలపై ఉన్న అపోహలు ఒక్కటొక్కటిగా తొలగిపోతుండడంతో పాటు వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతుండడంతో ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వస్తున్నారు. జిల్లాలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉండగా, ఇందులో 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లు 3.5 లక్షల వరకు ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరందరికీ టీకాలు వేయాలంటే ఇంకా చాలాకాలం పట్టనున్నది. రద్దీ పెరిగిన చోట అదనపు వైద్య బృందాలను నియమించి టీకాలు వేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే 45 ఏళ్లలోపు వారికి కూడా ఉచితంగా టీకాలు ఇచ్చే విషయమై ఆలోచన చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-17T06:00:32+05:30 IST