ఆఫ్‌లైన్‌ కష్టాలు.. ఆన్‌లైన్‌ సేవలున్నా తప్పని క్యూలు

ABN , First Publish Date - 2020-02-02T04:35:25+05:30 IST

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని.. ఆ సమయానికి అక్కడికెళ్తే చాలు.. ఎంచక్కా నిమిషాల వ్యవధిలో ఆర్టీఏ సేవలను పొంది తిరిగి వచ్చేయచ్చు అనుకుంటున్నారా..? కానీ.. కొన్ని కార్యాలయాల వద్ద ఆ పరిస్థితి లేదు.

ఆఫ్‌లైన్‌ కష్టాలు.. ఆన్‌లైన్‌ సేవలున్నా తప్పని క్యూలు

ఆర్టీఏ కార్యాలయాల వద్ద అవస్థలు

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని.. ఆ సమయానికి అక్కడికెళ్తే చాలు.. ఎంచక్కా నిమిషాల వ్యవధిలో ఆర్టీఏ సేవలను పొంది తిరిగి వచ్చేయచ్చు అనుకుంటున్నారా..? కానీ.. కొన్ని కార్యాలయాల వద్ద ఆ పరిస్థితి లేదు. పరికరాలు మొరాయించడం.. సర్వర్‌ డౌన్‌... వంటి కారణాలతో గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సిన పరిస్థితి. ఫొటో దిగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సిందే. 

గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో, నగర శివారులోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి, రెండు రోజుల ముందుగానే అవసరమైన సేవలకోసం ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుక్‌ చేసుకొని, ఫీజులు చెల్లించిన తర్వాత ఆర్టీఏ కార్యాలయాలకు వినియోగదారులు వస్తున్నారు. అక్కడికి వెళ్తే భారీ లైన్‌లు దర్శనమిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, కెమెరాలు మొరాయిస్తుండడం, సర్వర్‌ డౌన్‌ అవుతుండడంతో గంటల తరబడి కార్యాలయాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. భారీ లైన్‌లలో నిలబడాల్సి ఉంటుంది. 

ఫీజులు ముందుగానే వసూళ్లు...

ఆర్టీఏ కార్యాలయాల్లో మెరుగైన సేవలను అందించేందుకు 4 ఏళ్ల కిత్రమే సుమారు 59 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు. కార్యాలయాల్లో ఏదైనా సేవను పొందలాంటే ఒక రోజు ముందుగానే స్లాట్‌ బుక్‌ చేసుకొని, సంబంధించిన ఫీజును చెల్లించిన తర్వాతే అక్కడకు వెళ్లాలి. పూర్తిగా క్యాష్‌లెస్‌ కౌంటర్లుగా మార్చేసిన అధికారులు ప్రజలకు నిరంతరం మెరుగైన సేవలందించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. క్షేత్రస్థాయిలో సమయపాలన ఉండడం లేదు. సర్వర్‌ డౌన్‌ ఉందని, ఫొటో తీసే కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని వచ్చినా రోజంతా నిరీక్షణ చేయాల్సి వస్తోందని సరూర్‌నగర్‌కు చెందిన మనోహర్‌ వాపోపారు. దండిగా ఆదాయం వస్తున్నా.. సేవలు అధ్వానంగా ఉంటుండడంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.

ఒక్కసారిగా రావడం వల్లే : అధికారులు

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్‌ సేవలు అందించాల్సి ఉంటుందని, స్లాట్‌ టైం ప్రకారం కాకుండా చాలా మంది ఒక్కసారిగా రావడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎంత మంది వచ్చినా 2 గంటల వరకు సేవలందిస్తామని, అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుందని అంటున్నారు.

Updated Date - 2020-02-02T04:35:25+05:30 IST