ఆన్‌లైన్‌ లావాదేవీలపై సందేహించండి.. ప్రశ్నించండి

ABN , First Publish Date - 2021-05-25T14:10:40+05:30 IST

ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో మునుపెన్నడూ లేని విధంగా

ఆన్‌లైన్‌ లావాదేవీలపై సందేహించండి.. ప్రశ్నించండి

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో మునుపెన్నడూ లేని విధంగా సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌, వైఫైల వాడకాల్లో అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విలువైన, విశ్వసనీయమైన వ్యక్తిగత సమాచారం సేకరించడానికి సైబర్‌ మోసగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కరోనా కట్టడి వేళ సైబర్‌ నేరాలపై అందరినీ అప్రమత్తం చేసే దిశగా నగరంలోని ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎస్ఈఏ), సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ డాక్‌) నిపుణులు దేశవ్యాప్తంగా వెబినార్లు నిర్వహించడంతోపాటు రోజూ వెబ్‌ పోస్లర్లు, తక్కువ నిడివిగల వీడియోలు విడుదల చేస్తున్నారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ దాడులు, సైబర్‌ నేరాల నివారణలపై ఐఎస్ఈఏ, సీ డాక్‌ నిపుణులు వెబ్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీ డాక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ఏఎస్.మూర్తి, రాచకొండ సీపీ, అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌లు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.  


సైబర్‌ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం ఎలా సేకరిస్తారంటే..

  • సైబర్‌ మోసాగాళ్లు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పలు విధాల్లో విశ్వసనీయమైన, వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. ఆ సమాచారంతోనే విలువైన ఏటీఎం పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నెం(పిన్‌), డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు వెరిఫికేషన్‌ వ్యాల్యూ(సీవీవీ)నెం. తదితర సమాచారం సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. సమాచార సేకరణ ఇలా....
  • ఫిషింగ్‌ : ఆకర్షణీయ మోసపూరిత మెయిల్స్‌ పంపుతూ
  • విషింగ్‌ : నిజమైన అధికారుల్లా నటిస్తూ నకిలీ వాయిస్‌ కాల్స్‌ చేస్తూ
  • స్మిషింగ్‌ : నకిలీ మెసేజీలు పంపుతూ
  • బెయిటింగ్‌ : ఉచితం అంటూ అత్యాశకు గురి చేసే మెసేజీతో ఎర వేస్తూ
  • డంప్‌ స్టర్‌ డైవింగ్‌:  చించేసిన రిసిప్టులు, ముఖ్యమైన పత్రాల నుంచి సమాచార సేకరిస్తూ
  • ప్రీ టెక్స్‌టింగ్‌ : బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తూ సున్నితమైన వివరాల సేకరిస్తూ
  • పర్సువేషన్‌ : సమాచారం కోసం పలుమార్లు నమ్మకంగా మాట్లాడుతూ ఒప్పించేస్తూ
  • ఓవర్‌ హియరింగ్‌ : దొంగతనంగా మీ మాటలు వింటూ విలువైన డేటా సేకరిస్తూ
  • సైబర్‌ మోసగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి

  • ఈ- మెయిల్స్‌లో వచ్చే లింక్స్‌, అటాచ్‌మెంట్స్‌పై క్ల్లిక్‌ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి.. ప్రామాణికతను తెలుసుకోండి.
  • వివరాలు షేర్‌ చేసే ముందు కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనేది ధ్రువీకరించుకోండి
  • ఊహించని టెక్ట్స్‌ మెసేజీలపై సందేహం ఉంటే ఆ ఆనుమానిత మెసేజీలను వెంటనే తొలగించండి /డిలిట్‌ చేయండి
  • నమ్మలేనంత వాస్తవాలుగా కనిపించే ఉచిత ఆఫర్లపై జాగ్రత్తగా వ్యవహరించండి
  • బ్యాంకులు, ఏటీఎంల వద్ద మీ ఖాతాల విలువైన సమాచారం ఉండే రిసిఫ్టులను, ఇతర పత్రాలను అజాగ్రత్తగా పడేయవద్దు. వివరాలు కనిపించకుండా చించేయండి/ధ్వంసం చేయండి.
  • సున్నితమైన సమాచారం కోసం అభ్యర్థిస్తే సందేహించండి, ప్రశ్నించండి.
  • విలువైన సమాచారం కోసం అపరిచితులు పదేపదే మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే జాగ్రత్తవహించండి. స్పందించకండి.
  • వ్యక్తిగత వివరాలు/సమాచారం గోప్యంగా ఉంచండి. ఇతరులకు తెలిసేలా బయట మాట్లాడే సమయంలో వాటిని ప్రస్తావించకండి.

సోషల్‌ మీడియా వేదికలపై అవగాహన, అప్రమత్తత ప్రధానం

కరోనా కట్టడి వేళ ఎక్కువ శాతం మంది నెట్టింట సమయం గడుపుతున్నారు. సైబర్‌ నేరస్థులు చాకచక్యంగా నెటిజన్ల వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల సమాచారం సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అందరూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. సున్నితమైన సమాచార భద్రతకు సూచనలు పాటించాలి. ప్రస్తుతం ఐఎస్‌ఈఏ, సీ డాక్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో సైబర్‌ క్రైమ్‌పై అవగాహనకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సైబర్‌ సెక్యూరిటీపై ఎలాంటి సందేహాలున్నా 18004256235 కు కాల్‌ చేసిగాని www.InfoSecawareness.in వెబ్‌సైట్‌ ద్వారా గానీ మరింత సమాచారం పొందవచ్చు. - సీహెచ్‌ఎఎస్ మూర్తి,  సీ డాక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌.


సైబర్‌మోసాలపై అవగాహన అవసరం

సైబర్‌ మోసాలపై నిరంతరం అవగాహన అవసరం. సైబర్‌ నేరాలను నివారించడానికి నిపుణుల సూచనలు పాటించాలి. ఆన్‌లైన్‌ లావాదేవీల సున్నితమైన డేటా భద్రతపైనా దృష్టి పెట్టాలి. సైబర్‌ నేరాలపై ఎల్‌బీనగర్‌ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లేదా 9490617111 వాట్సాప్‌ నెం. ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో సైబర్‌ నేరాల నివారణకు నిపుణుల సలహాలు సూచనలనూ సోషల్‌ మీడియా వేదికల వెబ్‌సైట్‌లో పోస్టర్ల ద్వారా, వాట్సాప్‌ మెసేజీల రూపంలోనూ అందజేస్తున్నాం. - మహేష్‌ భగవత్‌, అదనపు డీజీపీ, సీపీ రాచకొండ.

Updated Date - 2021-05-25T14:10:40+05:30 IST