Abn logo
Sep 24 2021 @ 00:20AM

సోలార్‌ పీవీ యూనిట్ల ఏర్పాటుకు కంపెనీల క్యూ

  • పీఎల్‌ఐ పథకం కింద నెలకొల్పేందుకు సన్నాహాలు
  • జాబితాలో రిలయన్స్‌, అదానీ, టాటా గ్రూప్‌
  • హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌,
  • ప్రీమియర్‌ ఎనర్జీస్‌ కూడా..


న్యూఢిల్లీ : సౌర విద్యుదుత్పత్తిలో కీలకమైన ఫొటో వోల్టాయిక్‌ (పీవీ) మాడ్యూల్స్‌, సెల్స్‌ను దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రూ.4,500 కోట్లతో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కంపెనీలను మరింత ఆకర్షిస్తోంది. ఈ పథకం కింద దేశంలోనే పెద్ద ఎత్తున సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌, సెల్స్‌ ఉత్పత్తి చేపట్టేందుకు 19 కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఇందులో రిలయన్స్‌, అదానీ, టాటా గ్రూప్‌లతో పాటు పాటు హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌), ప్రీమియర్‌  ఎనర్జీస్‌ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.


దేశంలో ఏటా పెద్ద ఎత్తున సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అయితే ఇందులో అత్యంత కీలకమైన పీవీ మాడ్యూల్స్‌, సెల్స్‌ ఉత్పత్తి మన దేశంలో పెద్దగా లేదు. దీంతో చైనా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర కేబినెట్‌ రూ.4,500 కోట్లతో పీఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. 


రూ.17,200 కోట్ల పెట్టుబడులు

పీఎల్‌ఐ పథకం కింద దేశంలో సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌, సెల్స్‌ తయారీ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే 19 కంపెనీల నుంచి పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. ఏటా 10,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా మాడ్యూల్స్‌, సెల్స్‌ తయారు చేసేందుకు కనీసం రూ.17,200 కోట్ల పెట్టుబడులు సమకూరతాయని ఽఅధికార వర్గాల అంచనా.


ఎల్‌ అండ్‌ టీ, కోల్‌ ఇండియా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. పీఎల్‌ఐ పథకం కింద యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఐదేళ్ల పాటు వాటి అదనపు ఉత్పత్తి విలువ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కాకపోతే ఈ సంస్థలు తమ ప్రధాన ముడి పదార్ధాల్లో ఎక్కువ భాగం దేశీయంగానే సమకూర్చుకోవాలి.