Abn logo
Mar 14 2020 @ 20:00PM

గ్లామర్‌గా కనిపించడానికి సిద్ధమే.. కానీ: కృతి గార్గ్

కొన్ని సినిమాలకు ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండదు. కొన్ని సినిమాలు ట్రైలర్‌తోనే బాగా పాపులర్‌ అయిపోతాయి. అలాంటి సినిమానే ఇటీవల విడుదలైన ‘రాహు’. విడుదలకు ముందు, ఆ తరువాత కూడా మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా హీరోయిన్‌ కృతి గార్గ్‌తో...


మీ గురించి..

మాది రాజస్థాన్‌. తెలుగులో ఇది నాకు రెండవ సినిమా. ఇంతకు ముందు కొన్ని వెబ్‌ సిరీస్‌ చేశాను. వాటి ద్వారా మంచి గుర్తింపే పొందాను. ఆ గుర్తింపే నాకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. సాధారణంగా ఎవరికీ కెరీర్‌ ప్రారంభంలోనే ‘రాహు’ సినిమాలో నేను చేసినలాంటి పాత్రలు రావు. కానీ నాకు రెండవ సినిమాకే అలాంటి పాత్ర రావడం నా అదృష్టమనుకుంటున్నాను. విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. చూసిన వారంతా ఎంతగానో మెచ్చుకున్నారు. విడుదల తర్వాత కూడా అదే టాక్ వచ్చినందుకు సంతోషంగా ఉంది.


ఈ సినిమాలో మీతో పనిచేసిన వారి గురించి?

హీరో అభిరామ్‌ నేను ఒకే ఏజ్‌ గ్రూప్‌ కావడంతో షూటింగ్‌ సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం. కాలకేయ ప్రభాకర్‌గారితో పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌గా అనిపించింది. నటించిన మాకే కాదు చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా అనుభూతులు కొంతకాలం వరకూ గుర్తుండిపోతాయి. 


ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

నేను చెప్పానుగా... వెబ్‌ సిరీస్‌ చేయడం వలనే నాకు సినిమాల్లో అవకాశం వచ్చిందనీ, ఈ సినిమా అవకాశం కూడా అలాగే వచ్చింది. ఆడిషన్స్‌కు చాలా మంది వచ్చారు. వారిలో నన్ను సెలక్ట్‌ చేసుకున్నారు డైరెక్టర్‌ సుబ్బుగారు.


ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

నేను ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టాను. అప్పుడే ఎలాంటి సినిమాలు చేయాలన్నది నిర్ణయించుకోలేదు. ఇక్కడ కొద్దిగా సెటిల్‌ అయ్యాక ఎలాంటి పాత్రలు చేయాలన్నది ఆలోచిస్తాను. అప్పటి వరకు నాకు వచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలు అనుకున్నవి చేసుకుంటూ పోతాను.


గ్లామర్‌గా కనిపించడానికి అభ్యంతరం ఉందా?

సందర్భానుసారంగా గ్లామర్‌గా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్‌గారు నన్ను గ్లామర్‌గా, అందంగా చూపించారు. గ్లామర్‌ పేరుతో ఎక్స్‌పోజింగ్‌ అంటే మాత్రం చేయను. ఏదైనా సరే పాత్ర పరిధికి లోబడే చేస్తాను.


ఇటీవల మీ మిస్సింగ్‌ ఓ డ్రామా అంటున్నారు ఎంత వరకు నిజం?

దీని మీద అప్పుడే వివరణ ఇచ్చాను కదా! సినిమా వర్క్‌తో బాగా ఒత్తిడిగా అనిపించి ముంబాయిలో మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఎవరికీ చెప్పలేదు. సినిమా షూటింగ్‌ అయిపోయింది కదా, ఒకటిరెండు రోజులు రెస్ట్‌ తీసుకుని వద్దామని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళినతరువాత నా ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయింది. ఇది నేను చూసుకోలేదు. దాంతో నేను మిస్‌ అయ్యాననీ, సినిమా ప్రమోషన్‌ కోసమే ఇలాంటి డ్రామా ఆడుతున్నాననీ చాలా కథలు అల్లేశారు. సినిమా ప్రమోషన్‌ కావాలంటే వేరే విధంగా చేస్తారు కానీ, ఇలా చేయరు కదా! కొద్దిగా కమ్యునికేషన్‌ గ్యాప్‌ వచ్చింది. అందుకే ఇంత హడావిడి జరిగింది. 


మీకు ఎవరినుంచో ఫోన్‌ వచ్చినందుకే అలా అర్ధాంతంరగా వెళ్ళిపోయారని ప్రచారం జరిగింది?

అదంతా గడిచిపోయిన గతం. తిరిగి దాన్ని గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ సంఘటనను నేను పూర్తిగా మరచిపోయాను. అందరూ మరచిపోతే బాగుంటుందని నా కోరిక.


తెలుగులో సినిమాలు ఒప్పుకున్నారా?

చాలా కథలు విన్నాను. రెండు కథలు నచ్చాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను.


బాలీవుడ్‌లో సినిమాలు చేసే ఉద్దేశముందా?

అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. 

–కె.రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement