రాతి నిద్ర

ABN , First Publish Date - 2020-11-30T08:37:55+05:30 IST

దేశం మొత్తం నిండుకుండలా ప్రవహించే నిశ్శబ్దం ఇపుడు నీలోనూ నాలోనూ నెత్తురు గడ్డకట్టిస్తోంది...

రాతి నిద్ర

నల్ల ముసుగేసుకుని

పాకుడుపట్టిన వాన

నాలో ధారాపాతంగా కురుస్తోంది

ఎంతకీ తెరిపివ్వని వాన

తాటాకు కప్పని దేహంపై

ముసురు చీకట్లు

దోసిటితో ఎత్తిపోస్తుంది


అన్నిటినీ చూరులో కుక్కి

ఆశల వుట్టి కుండకు వేలాడుతూ

సగం కొరికి వదిలేసిన చంద్రుణ్ణి

ఆబగా చప్పరించాలని చూస్తాను


నెమ్మదిగా

గడియతీసి

గుమ్మం బయటకొచ్చి చూస్తానా

నల్ల మీగడి చీకటి

వూరంతా కమ్మేసి వుంటుంది


ఉలిక్కిపడి

వెనక్కి తిరిగి చూస్తానా

నీరెండా కాలపు

చప్పట్ల ఊరేగింపులో

చేతులు కట్టుకున్న అవిటితనమేదో

పూనకంతో వూగిపోతుంటుంది


భయం భయంగా

దొడ్డెనక తలుపు

సన్నగా తెరుస్తాను


నిద్రగన్నేరు చెట్టు కింద

భేటీ బచావో

తన నడుమును తానే విరగ్గొట్టుకుని

ఛిద్రమైన యోని, తెగిన నాలుకతో

తనకు తానే నిప్పంటించుకుంటుంది


ఎటూ పాలుపోని

ఒకానొక రాతి నిద్ర

సరీసృపాల్లా పాదాలను చుట్టేసి

నా గొంతు నొక్కేయమని

నన్నే వుసిగొల్పుతుంటుంది


***

దేశం మొత్తం

నిండుకుండలా ప్రవహించే నిశ్శబ్దం

ఇపుడు నీలోనూ నాలోనూ

నెత్తురు గడ్డకట్టిస్తోంది

మేడక యుగంధర రావు

90320 56738


Updated Date - 2020-11-30T08:37:55+05:30 IST