రబీపై రైతన్న ఆందోళన

ABN , First Publish Date - 2020-12-04T04:57:41+05:30 IST

సార్వా సాగులో నష్టాలతో అప్పుల భారం మోస్తున్న రైతులను రబీ సాగు మరింత ఆందోళన కలిగిస్తోంది.

రబీపై రైతన్న ఆందోళన
భీమవరం మండలం తాడేరులో నీటిలో కుళ్లిన వరి చేను

పూర్తికాని సార్వా 

నష్టంపై కొనసాగుతున్న అధికారుల సర్వే 

 దాళ్వాకు పొంచివున్న నీటి ఎద్దడి


సార్వా సాగులో నష్టాలతో అప్పుల భారం మోస్తున్న రైతులను రబీ సాగు మరింత ఆందోళన కలిగిస్తోంది. సాగునీటి ప్రమాద ఘంటికలు మోగడం ఆలోచనలో పడేసింది. ఒకవైపు కుళ్లుతున్న వరి చేలు.. నీటిలో తడిచిన చేలల్లో మాసూలు.. మాసూలు చేసిన ధాన్యం ఒబ్బిడి చేసే పనుల్లో తలమునకలుగా ఉన్నారు. మరోవైపు పంట నష్టంపై అధికారులు సర్వే. ఈ నేపథ్యంలో రబీ సాగుకు సిద్ధం కావాలంటూ వ్యవసాయాధికారులు వెంటబడుతున్నారు.  ఆలస్యమైతే సాగునీటి పరిస్థితి అనుకూలించదని హెచ్చరిస్తున్నారు. విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా పలుచోట్ల విత్తనాలు లేవని ఆందోళన వ్యక్తమవుతోంది. సార్వా సాగులో మునిగిపోయిన రైతులు దాళ్వా సాగులో ఎండిపోతామని భయపడుతున్నారు.


భీమవరం రూరల్‌, డిసెంబరు 3 : తుఫాన్‌ ప్రభావంతో సార్వా పంట పూర్తిగా దెబ్బతింది. వర్షపునీరు చేలల్లో ఉండడంతో వరి కుళ్లుతోంది. దీంతో సాగులో భారీ నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 12వేల ఎకరాలలో సాగు సాగగా 10వేల ఎకరాల్లో పంట నేలకొరిగింది. పల్లపు ప్రాంతాలలో వర్షపు నీరు ఇంకా చేలల్లో నిలిచిఉంది. కొన్ని చోట్ల వరి కంకుల నుంచి మొలకలు వస్తున్నాయి. మాసూళ్లలో ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. వరికోత యంత్రాలతో వీలుకాదని అధిక ధర చెల్లించి కూలీలతో కోతకు సిద్ధ మవుతున్నారు. ఎకరా మాసూలుకు రూ.10వేలు, దూరపు చేలకు రూ.15వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. దిగుబడి 15 బస్తాలు లోపే వస్తుంది. చివరికి దిగుబడి కేవలం మాసూళ్ల పెట్టుబడికి సరి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసుళ్ళు ఎలా చేయాలో తెలియడం లేదు. ఇక దాళ్వా సాగుకు ఎలా సన్నద్ధం కావాలని ఆందోళన చెందుతున్నారు. నీటి ఎద్దడి ఉంటుందని త్వరితగతిన సాగు చేపట్టాలని అధికారులు చెప్పడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు.


పంట నష్టం అంచనాలపై సర్వే

కాళ్ళ, డిసెంబరు 3 : వర్షాలు, తుఫాన్‌ కారణంగా వరి పంట నష్టం అంచనా వేయడానికి వ్యవసాయ, గణాంకశాఖ అధికారులు గురువారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. పూర్తిగా నీటిలో మునిగి చెరువులా కనిపిస్తున్న చేలను స్వయంగా పరిశీలించారు. జిల్లా గణాంక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, నరసాపురం డివిజన్‌ డివైఎస్‌వో మణిపాల్‌, ఆకివీడు డివిజన్‌ వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.అనిల్‌కుమారి మాట్లాడుతూ వర్షాలు కారణంగా నష్టపోయిన పంట అంచనాలన్ని ప్రభుత్వానికి పారదర్శకంగా నివేదిక ఇస్తామని రైతులందరికి ధైర్యం చెప్పారు. అనంతరం పలు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దాళ్వా సాగుకు పలు సూచనలు చేశారు. కాలువలు త్వరగా కట్టేస్తున్న నేపథ్యంలో రైతులు సకాలం దాళ్వా వరి సాగు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10 నాటికి నారుమడులు వేసుకుంటే ఏప్రిల్‌ నాటికి మాసూళ్లయ్యే అవకాశం ఉందన్నారు. దాళ్వా వరి సాగుకు ఎంటీయూ 1121 అనువైన వరి వంగడం అని వారు సూచించారు. రైతులు ముందస్తు సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో ఏవో జయవాసుకి, ఏఈవో మురళీకృష్ణ, ఏఎస్‌వో శేషురామారావు, ఆయా గ్రామాల రైతులు, వ్యవసాయ, రెవెన్యూశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు లేవు

ఆకివీడు, డిసెంబరు 3: సబ్సిడీపై విత్తనాలందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని, రైతు భరోసా కేంద్రాలలో అవసరమైన విత్తనాలు లేవని  బీజేపీ మండలాధ్యక్షుడు నేరెళ్ళ పెదబాబు అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందాల్సిన వస్తువులు ఒక్కటీ లేవన్నారు. కొన్నిచోట్ట ఆర్బీకేలకు తాళాలువేసి ఉంటున్నాయన్నారు. సార్వా నష్టపోయి న రైతును ఆదుకోకుండానే రబీకి సన్నద్ధం కావాలని చెబుతున్నారని, కాల్వలు కట్టేస్తున్నాం త్వరితగతిన నారుమడులు పూర్తిచేసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంటీయూ 1121 వరి రకం మేలని చెబుతున్నా రు. ఎంతవరకు అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించారు. మార్చి 31 నాటి కి కాల్వలు కట్టేస్తామంటున్న చెబుతున్న వారు రైతులకు కావాల్సిన విత్తనాలు సరఫరా చేయాలని పెదబాబు కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కాల్వలు కట్టేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-04T04:57:41+05:30 IST