Abn logo
Oct 24 2021 @ 23:13PM

రబీ సాగు జరిగేనా ?

నీరు పారుతున్న సర్వేపల్లి కాలువ

పుష్కలంగా జలాశయాలు, చెరువుల్లో నీరు

ఐఏబీ సమావేశం లేకుండానే నీటి విడుదల

గత అనుభవాలతో రైతుల ఆందోళన

అన్నదాతలకు పట్టించుకోని ప్రజాప్రతినిధులు

సీజన ప్రారంభమైనా ఒక్క సమావేశం నిర్వహించని వైనం


నెల్లూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సీజన మొదలైంది. అత్యధిక విస్తీర్ణంలో పంట సాగు వేసేది ఈ సీజనలోనే. సోమశిల, కండలేరు జలాశయాలు నిండుగా ఉన్నాయి. అలాగే చాలావరకు గడిచిన ఎడగారు కోసం చెరువుల్లో నీరు నింపారు. అప్పుడు సాగు చేసేందుకు రైతులు మందుకు రాకపోవడంతో చెరువుల్లో  నీరు కూడా అలాగే ఉంది. ఈ దఫా పూర్తిస్థాయి ఆయకట్టులో పంట సాగు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రైతుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. గడిచిన  రెండే ళ్లుగా వారికి ఎదురైన అనుభవాలే ఇందుకు కారణం. ఆరు గాలం శ్రమించి పంట పండించినా, ఆ ధాన్యాన్ని అమ్ముకోవ డం రైతులకు కత్తిమీద సాములా మారింది. దళారుల రాజ్యంలో రైతాంగం చితికిపోయింది. రకరకాల నిబంధనలు, కొర్రీలతో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకో లేక దళారులకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. వీటికి తోడు నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతుల ను మరింత భయపెడుతున్నాయి. గడిచిన సీజన్లలో విత్తనా లు, ఎరువుల కొరత కూడా జిల్లాలో ఏర్పడింది.  ఈ నేప థ్యంలో గత సీజన్లో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం గమనార్హం. సాగునీటి కాలువల ఆధునికీకరణకు అధికారులు టెండర్లు పిలుస్తున్నా, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. రబీ సీజన మొదలైనా ఇంతవరకు కాలువల్లో పూడికతీత ప్రారంభం కాలేదు. ఇన్ని సమస్యల మధ్య రైతాంగం సతమతమవుతుంటే ఆ సమస్యలను పరి ష్కరించే దిశగా అడుగులు పడకపోవడం వారిలో ఆందోళన పెరుగుతోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నా రైతుల సమస్యలను పట్టించుకునే వారులేరు. దీంతో అధికా రులు కూడా సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. 


ప్రజాప్రతినిధుల జాడెక్కడ...?

 రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని పరిష్కరించే ఆలోచనతో ప్రభుత్వం వ్యవసాయ సలహా మండళ్ల(ఏఏబీ)ను ఏర్పాటు చేసింది. రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బీకే) స్థాయిలో ఒక కమిటీని, మండల స్థాయిలో మరో కమిటీని, జిల్లా స్థాయిలో ఇంకో కమిటీని ప్రభుత్వం నియమించింది. ముందుగా ఆర్‌బీకే స్థాయి కమిటీలో ఆ ప్రాంతంలోని రైతుల సమస్యలను చర్చిస్తారు. వాటిని మండల స్థాయి కమిటీలో ప్రస్తావించి, తదుపరి జి ల్లా స్థాయి కమిటీలో చర్చిస్తారు. ఈ సమస్యల్లో జిల్లా స్థాయిలో పరిష్కరించేవాటిని ఇక్కడే పరిష్కరిస్తారు. రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఇప్పటి వరకూ ఏడుసార్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల సంఖ్యను చూస్తేనే వారికి రైతు లపై ఏపాటి చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతుంది. గతేడాది నవంబరులో జరిగిన మొదటి సమావేశంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు దాదాపుగా ప్రజాప్రతిని ధులంతా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన సమా వేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ముఖం చాటేస్తూ వచ్చారు. చివరగా జరిగిన నాలుగు సమావేశాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పా ల్గొనలేదు. చివరకు రబీ సీజన మొదలయ్యాక రెండు రోజు ల క్రితం ఏఏబీ జరిగింది. ఇంతటి కీలకమైన సాగు సమ యంలో కూడా ప్రజాప్రతినిధులెవరూ సమావేశానికి హాజ రుకాలేదు. కేవలం అధికారులు మాత్రమే ఈ సమావేశంలో  పాల్గొన్నారు. ఈ పరిస్థితిని చూసిన్న రైతులు తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు. జిల్లాలో ఉంటూ రాజకీయ కార్యక్రమా లకు హాజరైన ప్రజాప్రతినిధులు రైతు సమస్యల పరిష్కా రానికి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకపోవడంపై రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


ఐఏబీ లేనట్లే..?


ప్రస్తుతం జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది. అయినా ఈ ఏడాది సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించడం అనుమానంగా  ఉంది. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటి కేటాయింపులు జరిపేందుకు వీలుంది కాబట్టి సమావేశం అవసరం లేదని మంత్రులు, ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగు తుండడంతో సముద్రానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటినే డెల్టాలో కాలువల ద్వారా చాలా వరకు చెరువులకు మళ్లిస్తున్నారు. అలానే కండలేరు నుంచి ఇప్పటికే నీటి విడుదల మొదలైంది. దీంతో రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలపై చర్చిం చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తే బావుం టుందని వారంటున్నారు.