కన్సల్టెన్సీకే టోకరా

ABN , First Publish Date - 2021-11-25T17:49:48+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా సభ్యులు ఏకంగా కన్సల్టెన్సీనే మోసం చేశారు. పలువురి నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేశారు. రాచకొండ పోలీసులు రంగంలోకి దిగిన వారి

కన్సల్టెన్సీకే టోకరా

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

రూ. 25 లక్షలు కొల్లగొట్టిన ముఠా

ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

నలుగురు నిందితుల అరెస్టు


హైదరాబాద్‌ సిటీ: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా సభ్యులు ఏకంగా కన్సల్టెన్సీనే మోసం చేశారు. పలువురి నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేశారు. రాచకొండ పోలీసులు రంగంలోకి దిగిన వారి ఆటకట్టించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.70లక్షలు, 19 నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, 53 నకిలీ రబ్బర్‌స్టాంపులు, ప్రింటర్‌, ల్యాప్‌టా్‌పను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. 


కర్మన్‌ఘాట్‌లోని ఖాసీం.. లెమినీ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. ప్రైవేట్‌ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులు, హౌజ్‌ కీపింగ్‌ పోస్టులు ఇప్పిస్తుంటాడు. అతని వద్దకు పెద్ద అడిసెర్లపల్లి మండలం అంగడిపేటకు చెందిన మద్దెలమడుగు వరకుమార్‌ అలియాస్‌ వరుణ్‌, ఎల్‌బీనగర్‌కు చెందిన యాతాకుల ప్రమోద్‌, చంపాపేట కు చెందిన వెన్ను దినకర్‌రెడ్డి వచ్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టు, పంచాయితీరాజ్‌ శాఖ, విద్యుత్‌శాఖలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. మీ వద్దకు వచ్చే వారికి చెప్పమని సూచించారు. నమ్మిన ఖాసీం ముందుగా తన సోదరునికి పంచాయతీరాజ్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.


ఉద్యోగాన్ని బట్టి రేటు..

ఇప్పించే ఉద్యోగం, జీతాన్ని బట్టి రేట్‌ నిర్ణయించినట్లు ఖాసీంకు చెప్పారు. జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రూ.3లక్షలు, అటెండర్‌ పోస్టుకు రూ.1.50 లక్షలు అంటూ ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు చెప్పాడు. తన సోదరుడి ఉద్యోగం కోసం రూ.1.10 లక్షలు ఖాసీం అడ్వాన్స్‌ ఇచ్చాడు. దీంతో పకడ్బందీగా, పలానా ప్రభుత్వ జీవో ప్రకారం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా జీవో నంబర్‌లతో సహా ఉండేలా చూసుకొని, స్టాంపులతో కూడిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను అందజేశారు. తాము చెప్పేంత వరకు జాయిన్‌ కావొద్దని, ఈ విషయం ఎవరికీ చెప్పొదని గట్టిగా చెప్పారు. ఈ క్రమంలో హయత్‌నగర్‌కు చెందిన రోజా వారిని సంప్రదించగా,  రంగారెడ్డి జిల్లా కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని  నమ్మించి రూ. 1.10లక్షలు తీసుకున్నారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి, తాము చెప్పేంత వరకు జాయిన్‌ కావొద్దని సూచించారు. ఇంతలో కరోనా రెండో దశ వచ్చింది. దాంతో కోర్టులు నడవడంలేదని, మరికొంతకాలం ఆగాలని నమ్మిస్తూ వచ్చారు. ఇలా మొత్తం 25-30 మందిని మోసం చేసి రూ. 25లక్షలు కొల్లగొట్టారు. ఎంతకీ ఉద్యోగాలకు పిలవకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో ఎల్‌బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షణలో నిందితులను అరెస్టు చేశారు. 


జైల్లో జతకట్టి.. 

మద్దెలమడుగు వరకుమార్‌ అలియాస్‌ వరుణ్‌ కర్మన్‌ఘాట్‌లో ఉంటున్నాడు. చంపాపేటకు చెందిన వెన్ను దినకర్‌రెడ్డి ఎంఎస్‌ కోసం యూకే వెళ్లాడు. మధ్యలోనే తిరిగి వచ్చాడు. అతను దొంగ సర్టిఫికెట్ల తయారీ కేసులో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అక్కడ వరకుమార్‌ పరిచయమయ్యాడు. వరకుమార్‌ స్నేహితుడు ప్రమోద్‌ను, బీఎన్‌రెడ్డి నగర్‌లో ఆర్‌ఎస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో స్టాంపులు తయారు చేస్తున్న విప్పర్తి ప్రకాశ్‌ను ముఠాలో చేర్చుకున్నారు. ఉద్యోగాల పేరుతో వారు దోచుకున్న సొత్తును సమానంగా పంచుకునేవారని విచారణలో తేలింది. 

Updated Date - 2021-11-25T17:49:48+05:30 IST