చెప్పింది చేయలేదు!

ABN , First Publish Date - 2020-09-24T07:43:36+05:30 IST

రాఫెల్‌ ఒప్పందంలో భాగంగా కుదుర్చుకున్న ఆఫ్‌సెట్‌ నిబంధనలను దసో ఏవియేషన్‌, ఎంబీడీయే ఇంకా నెరవేర్చలేదని కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

చెప్పింది చేయలేదు!

రాఫెల్‌ ఆఫ్‌సెట్‌ నిబంధనలను దసో, ఎంబీడీయే నెరవేర్చలేదు

కావేరీ ఇంజన్‌ ప్రాజెక్టు పునరుద్ధరణకు సాయం చేస్తామన్న దసో ఏవియేషన్‌

2015 సెప్టెంబరులో ఆ ప్రతిపాదన 

ఇప్పటికీ ఆ పని చేయలేదు: కాగ్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: రాఫెల్‌ ఒప్పందంలో భాగంగా కుదుర్చుకున్న ఆఫ్‌సెట్‌ నిబంధనలను దసో ఏవియేషన్‌, ఎంబీడీయే ఇంకా నెరవేర్చలేదని కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం కింద భారత్‌కు అత్యున్నతస్థాయి సాంకేతికపరిజ్ఞానాన్ని అందించేందుకు ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం దసో ఏవియేషన్‌, యూర్‌పకు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీయే అంగీకరించాయి.


వీటిలో దసో ఏవియేషన్‌ రాఫెల్‌ విమానాలను తయారు చేసే సంస్థ కాగా.. అందులో అమర్చే క్షిపణి వ్యవస్థలను సరఫరా చేసే సంస్థ ఎంబీడీయే. రూ.59 వేల కోట్లతో 136 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబరులో భారత ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ కాంట్రాక్టులో ఆఫ్‌సెట్‌ నిబంధనలు కూడా భాగం. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు (డీఆర్‌డీవో) అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం ద్వారా.. ఆఫ్‌సెట్‌ బాధ్యతల్లో 30 శాతాన్ని నెరవేర్చేందుకు ఆ రెండు సంస్థలూ సన్నద్ధతను వ్యక్తం చేస్తూ 2015 సెప్టెంబరులో ప్రతిపాదన చేశాయి. దాన్ని ఇప్పటికీ నెరవేర్చలేదని.. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్‌ పేర్కొంది. తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీయే) తేజస్‌ కోసం అవసరమైన ఇంజన్ల కోసం భారత ప్రభుత్వం గతంలో చేపట్టిన ‘కావేరీ ఇంజన్‌ ప్రాజెక్టు’ విఫలమైంది. ఆఫ్‌సెట్‌ నిబంధనల్లో భాగంగా ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి సాయం చేస్తామని దసో అప్పట్లో అంగీకరించింది.


ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఏడాది జూలై 29న తొలివిడతగా ఐదు రాఫెల్‌ విమానాలు మన దేశానికి చేరుకున్నాయి. కానీ, డీఆర్‌డీవో మాత్రం ఇప్పటికీ తమకు అందాల్సిన టెక్నాలజీ కోసం ఎదురుచూస్తోందని కాగ్‌ పేర్కొంది. ఇప్పటిదాకా విక్రేతలు (దసో,  ఎంబీడీయే) ఈ టెక్నాలజీ సరఫరా గురించి ఏ విషయాన్నీ తేల్చలేదని గుర్తుచేసింది. అంతేకాదు.. భారత ఆఫ్‌సెట్‌ విధానం అంత సమర్థం గా లేదని.. విదేశీ విక్రేతలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భార త పరిశ్రమలకు సరఫరా చేసిన సందర్భం లేకపోవడం ఇందుకు నిదర్శనమని కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంటున్న 63 రంగాల్లో రక్షణ రంగం 62వ స్థానంలో ఉండడాన్ని గుర్తుచేసింది.


ఇలాగైతే లాభం లేదు!

రాఫెల్‌ ఒప్పందం విషయంలో.. ఆఫ్‌సెట్‌ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి రక్షణ శాఖ ఆ విధానాన్ని, దాని అమలును సమీక్షించాలని కాగ్‌ సూచించింది. ఆఫ్‌సెట్‌ నిబంధనల అమలులో అటు విదేశీ సంస్థలకుగానీ, భారతీయ సంస్థలకుగానీ ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను ఆలోచించాలని సూచించింది. 

Updated Date - 2020-09-24T07:43:36+05:30 IST