Abn logo
Oct 26 2021 @ 23:24PM

బియ్యం సంచుల రగడ

బియ్యం గోడౌన్‌కు తాళాలు వేసి నిరసన తెలుపుతున ్న డీలర్లు

గోడౌన్లకు తాళాలు వేసిన డీలర్లు


కడప (కలెక్టరేట్‌), అక్టోబరు 26: డీలర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా డీలర్లు నిరసనలకు దిగారు. జిల్లా డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు రామమోహన్‌రెడ్డి నాయకత్వంలో డీలర్లు కడప మార్కెట్‌యార్డులోని బియ్యం గోడౌన్‌కు మంగళవారం తాళాలు వేశారు. అనంతరం సివిల్‌ సప్లయ్స్‌ కార్యాలయంలో ఏడీఎం మోహన్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మొబైల్‌ వాహనాలు తెచ్చి దశాబ్దాల కాలం నుంచి పేదలకు బియ్యం పంచుతున్న డీలరు వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది చాలదన్నట్లు బియ్యంతో పాటు వచ్చే సంచులను కూడా వదలకుండా తిరిగి తీసుకునేందుకు జావో జారీ చేయడం దుర్మార్గమన్నారు. కేవలం కమీషన్‌పై ఆధారపడి బియ్యం, సరుకులు పంచుతున్న తమకు సంచుల ద్వారా 2, 3 వేల వరకు ఆదాయం వస్తుందని, ఆ రాబడితోనే తాము రూము బాడుగలు, కరెంట్‌ బిల్లులు, గుమాస్తాకు జీతం ఇస్తూ తమ కమీషన్‌ కూడా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం సంచులను కూడా వదలకుండా తిరిగి తీసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని తెలిపారు. కరోనా సమయంలో మృతి చెందిన డీలర్లకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యానికి కమీషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘ నేతలు యోగానంద్‌, భవానీ ప్రసాద్‌, లక్మీదేవి, సుబ్బయ్య, డీలర్లు పాల్గొన్నారు.