ఓయూలో స్థలంపై రగడ

ABN , First Publish Date - 2020-05-23T07:11:52+05:30 IST

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థల వివాదం రాజుకుంది. ఓయూ పక్కనే ఉన్న డీడీ కాలనీలోని

ఓయూలో స్థలంపై రగడ

  • వర్సిటీదేనంటున్న విద్యార్థులు, టీచర్లు.. 
  • తమదేనంటున్న మాజీ సీజే కుటుంబం
  • వివాదం కోర్టులో ఉందన్న ఔటా
  • చదును చేసి... గుంతలు తీసిన వైనం
  • పనులకు పోలీసుల భద్రతపై భగ్గు


హైదరాబాద్‌/ఉప్పల్‌/రాంనగర్‌/అంబర్‌పేట మే 22 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్థల వివాదం రాజుకుంది. ఓయూ పక్కనే ఉన్న డీడీ కాలనీలోని సర్వే నంబరు 80/2లో 311 గజాల స్థలంపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కుటుంబం ఇంటి నిర్మాణానికి సిద్ధపడింది. ఆ లే-అవుట్‌ మొత్తం ఓయూ స్థలమేనంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ ఒక్క ప్లాట్‌ వదిలేస్తే వంద కోట్ల రూపాయల విలువైన మొత్తం లే-అవుట్‌ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపిస్తున్నాయి. విశ్వవిద్యాలయం ప్రధాన భద్రత అధికారి శ్రీరామ్‌ అంజయ్య తన సిబ్బందితో వెళ్లి, ప్లాట్‌ చదును చేసే పనులు నిలిపి వేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వచ్చి, అందరినీ బయటికి వెళ్లి మాట్లాడుకోవాలన్నారు. స్థలం తమదేనని జస్టిస్‌ నరసింహారెడ్డి సతీమణి ఎల్‌.ఇందిర అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. శుక్రవారం ఉదయం పోలీసు భద్రత మధ్య స్థలంలో నిర్మాణ పనులు మొదలయ్యాయి. సాయంత్రం వరకు  పనులు  జరిగాయి. చదును చేసిన భూమిలో గుంతలు తీసి, పిల్లర్లు వేశారు. ఆ తర్వాత కూడా అక్కడ పోలీసులు కాపలా ఉన్నారు. దీనిపై ఉస్మానియా టీచర్స్‌ అసోసియేషన్‌(ఔటా), విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కొందరు ఓయూ స్థలాన్ని సొంతం చేసుకుంటున్నారని ఆరోపించారు. డీడీ కాలనీ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని ఔటా అధ్యక్షుడు మనోహర్‌ చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఓయూ రిజిస్ట్రార్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. డీడీ కాలనీలోని తులసీ హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో వర్సిటీకి చెందిన 100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌ సర్దార్‌ వినోద్‌ ఆరోపించారు. ఉన్నతాధికారులు, నాయకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్‌ మండిపడ్డారు. ప్రొఫెసర్‌ నవనీతరావు వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న రోజుల్లో 24 ఏళ్ల క్రితం ఓయూ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. డీడీ కాలనీ ప్రాంతంలో స్థల వివాదం ఉండటం, హబ్సిగూడ ప్రాంతంలో కాలనీలు, మాణికేశ్వర్‌నగర్‌ కాలనీలు ఓయూ స్థలంలోకి చొచ్చుకొని రావడంతో ప్రహరీ గోడ నిర్మించలేక పోయారు.


హక్కులు మా అమ్మకే ఉన్నాయి: అరవింద్‌రెడ్డి

తాజా పరిణామాలపై  శుక్రవారం జస్టిస్‌ నరసింహారెడ్డి కుమారుడు ఎల్‌.అరవింద్‌రెడ్డి మాట్లాడారు. ఆ స్థలం తమ తల్లి ఇందిర పేరుమీద కొనుగోలు చేశామన్నారు. ఈ స్థలంపై హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఓయూ అధికారులు ఓడిపోయారని చెప్పారు. స్థలానికి సంబంధించిన సర్వహక్కులు తమ తల్లి ఇందిరకే ఉన్నాయని చెప్పారు. భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నామని వివరించారు. స్థలం వివాదాస్పదమని నిరూపిస్తే తాము వదులుకుంటామని స్పష్టం చేశారు. అలా నిరూపించే ఒక్క పత్రమైనా చూపించాలని డిమాండ్‌ చేశారు.


కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆగాలి: వీహెచ్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నాలుగు వేల గజాల భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ మాజీ ఎంపీ వి.హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓయూకు 3 వేల ఎకరాల భూమి ఉండేదని, సర్వే ఆఫ్‌ ఇండియా, దూరదర్శన్‌, లిటిల్‌ ఫ్లవర్స్‌ స్కూలు, హోమియో ఆసుపత్రి, సర్వశిక్షా అభియాన్‌లకు ఇవ్వగా, కబ్జాలు అయినదీ పోగా ప్రస్తుతం 90 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. వీసీ నవనీతరావు హయాంలో గోడ కట్టే ప్రయత్నం చేసినపుడు తులసీ సొసైటీ వాళ్లు ఈ 4 వేల గజాల భూమి వర్శిటీది కాదని, మహమ్మద్‌ ఆజంకు చెందినదని చెప్పి అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా ఆ సొసైటీ సభ్యురాలు, రిటైర్డ్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి సతీమణి ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేసుకొని రక్షణ కల్పించారన్నారు. వర్సిటీ భూమేనంటూ సెక్యూరిటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదును మాత్రం తీసుకోలేదన్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకూ ఆ భూమిపైకి ఎవరూ పోవద్దని, అనవసరంగా శాంతి భద్రతల అంశంగా మారే పరిస్థితి కల్పించవద్దని హెచ్చరించారు.

Updated Date - 2020-05-23T07:11:52+05:30 IST