ఆస్పత్రిలోనే నాకు చికిత్స అందించాలి.. కమాండర్‌కు రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-05-25T01:32:57+05:30 IST

ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నా..

ఆస్పత్రిలోనే నాకు చికిత్స అందించాలి.. కమాండర్‌కు రఘురామ లేఖ

హైదరాబాద్: ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నా.. తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని తెలిపారు. బీపీలో కూడా హెచ్చుదల కనిపిస్తోందని చెప్పారు. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖ రఘురామ పేర్కొన్నారు. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలన్నారు. అయినా మీరు డిశ్చార్జ్‌ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్‌ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయండని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.



ఇటీవల రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని ఆయన అన్నారు. అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ అన్నారు.

Updated Date - 2021-05-25T01:32:57+05:30 IST