పవర్‌ కట్‌చేస్తే జనం మనల్ని కట్‌ చేస్తారు

ABN , First Publish Date - 2021-10-13T08:36:19+05:30 IST

‘‘ప్రజల పవర్‌ (విద్యుత్‌) మనం కట్‌ చేస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన పవర్‌(అధికారం) కట్‌ చేస్తారు’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు...

పవర్‌ కట్‌చేస్తే జనం మనల్ని కట్‌ చేస్తారు

నిన్నటిదాకా జగనన్న వాతలు..

ఇప్పుడిక కోతలు: రఘురామరాజు 


న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల పవర్‌ (విద్యుత్‌) మనం కట్‌ చేస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన పవర్‌(అధికారం) కట్‌ చేస్తారు’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. నిన్నటివరకు జగనన్న విద్యుత్‌ వాతలతో బాధపడితే.. ఇప్పుడు జగనన్న విద్యుత్‌ కోతలతో జనం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పరిపాలనా రాహిత్యం, అవగాహనాలోపం వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ రంగం చతికిలపడిందని రఘురామ విమర్శించారు.


‘‘రోజూ సాయంత్రం 6గంటల నుంచి 10గంటల వరకు ఒక్క పంకా మినహా ఇతర గృహ అవసరాలకు చెందిన ఎలక్ట్రానిక్‌ యంత్రాలేవీ ఇళ్లల్లో వినియోగించవద్దంటూ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవచనాలు పలికారు. అసలుకే మోసం వస్తుందనేమోనని, పంకా (ఫ్యాన్‌-వైసీపీ గుర్తు) వరకు సడలింపు ఇచ్చారు’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయేమోనని అన్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంవల్లే ఇపుడు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలో సమస్యలు వస్తున్నాయన్నారు. బొగ్గుకు ఎలాంటి లోటు లేదని కేంద్ర మంత్రి ప్రకటిస్తే, అది అబద్ధమని సజ్జల చెప్ప డం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-13T08:36:19+05:30 IST