ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

ABN , First Publish Date - 2022-07-10T06:05:21+05:30 IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్లారెడ్డిపేట జలమయమైంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
బాధితులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌

ఎల్లారెడ్డిపేట, జూలై 9: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్లారెడ్డిపేట జలమయమైంది. మండల కేంద్రంతోపాటు పదిర, నారాయణపూర్‌, దుమాల, అక్కపల్లి గ్రామాల శివారుల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లారెడ్డిపేట-వన్‌పల్లి ప్రధాన రహదారిపై దుమాల ఎల్లమ్మ ఆలయం సమీపంలోని చిట్టి వాగు వద్ద రోడ్డు వరద ఉధృతికి కోతకు గురైంది. అక్కపల్లి, పదిర-రామలక్ష్మణపల్లి, నారాయణపూర్‌ గ్రామాల్లోని లేతమామిండ్ల, మానేరు, పెద్దమ్మ వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీఐ మొగిలి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, ఎస్సై శేఖర్‌ గ్రామాల్లో పర్యటించి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. వెంకటాపూర్‌లోని ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదకు లలిత, రాజవ్వకు చెందిన గుడిసెలు నీట మునిగాయి. నిత్యావసర సరుకులు, వస్తువులు వరద పాలయ్యాయి. సమాచారం అందుకున్న  తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ అక్కడిరి చేరుకొని నిరాశ్రయులను వారి బంధువుల ఇళ్లకు తరలించారు. ఉప సర్పంచ్‌ బాలయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డితో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది.  ప్రజలు వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని సీఐ మొగిలి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.  పాత ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. ఏమైనా సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే సమాచారం అందించాలని సీఐ మొగిలి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ కోరారు.

 ఇల్లంతకుంట: భారీ వర్షంతో మండలంలోని పలు గ్రామాల సమీపంలోని వాగులు ప్రవహిస్తున్నాయి. తిప్పాపూర్‌, నర్సక్కపేట తదితర గ్రామాల సమీపంలో నుంచి వెళ్లే బిక్కవాగు ప్రవహిస్తోంది. కందికట్కూర్‌, పొత్తూర్‌ గ్రామాల మధ్యలోని సుద్ద ఒర్రె ఉధృతికి తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. పెద్దలింగాపూర్‌, అనంతారం గ్రామాల మధ్యలోని కల్వర్టు పైనుంచి భారీగా నీరు వెళ్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని పలువు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంట నుంచి కరీంనగర్‌ వెళ్లేవారు సుద్ద ఒర్రె ఉధృతితో గాలిపెల్లి మీదుగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మండలంలో వాగుల ప్రవాహాన్ని ఎస్సై మహేందర్‌, ఏఎస్సై మోతీరాం, ఆర్‌ఐలు సంతోష్‌, షఫీ పరిశీలించారు. ప్రమదకరంగా ఉన్న ప్రదేశాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-07-10T06:05:21+05:30 IST