రాహుల్ కసరత్తులు

ABN , First Publish Date - 2021-03-03T06:19:05+05:30 IST

రాహుల్ గాంధీ ఆ మధ్య కేరళలో మత్స్యకారులతో కలసి సముద్రంలో ఈతకొట్టారు. సోమవారం నాడు, తమిళనాడులో ఒక పదోతరగతి అమ్మాయి సవాల్‌ను...

రాహుల్ కసరత్తులు

రాహుల్ గాంధీ ఆ మధ్య కేరళలో మత్స్యకారులతో కలసి సముద్రంలో ఈతకొట్టారు. సోమవారం నాడు, తమిళనాడులో ఒక పదోతరగతి అమ్మాయి సవాల్‌ను తీసుకుని బస్కీలు తీసి గెలిచారు. యాభై ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా యువకుడినే అని చెప్పాలనుకుంటున్నారా, లేక, తమిళ, మలయాళ ఓటర్లతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి పనికివచ్చే విన్యాసమా? గంభీరమైన, నిరాసక్తమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉండిన రాహుల్ గాంధీ ధోరణిలో ఇప్పుడు ఏదో మార్పు కనిపిస్తోంది. ఈ సారి ఎట్లా అయినా రెండు దక్షిణాది రాష్ట్రాలలో, కేరళలో యుడిఎఫ్, తమిళనాడులో డిఎంకె-కూటమి గెలిచేటట్టయితే, కాంగ్రెస్ అధ్యక్షపదవిని అధిరోహించడానికి ఏ మాత్రం సంకోచించనక్కరలేదని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకని, తన పద్ధతికి కాస్త ఎడంగా నడిచి అయినా ఫలితం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. పోయినవారం ఆయన ఉత్తరాది– దక్షిణాది భేదాన్ని సూచించే ఒక వ్యాఖ్య చేశారు. ‘‘పదిహేనేళ్లు ఉత్తరాదిలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కానీ, అక్కడ వేరే రకం రాజకీయాలకు అలవాటుపడిపోయాను, ఇక్కడ కేరళ నుంచి ఎంపి అయ్యాక ఎంతో కొత్తగా అనిపించింది, ఇక్కడి ప్రజలు విషయాల పట్ల నిజంగా పట్టింపు ఉన్నవారు, ఏదో పైపైన కాదు, లోతుల్లోకి వెళ్లి తరచిచూసే లక్షణం ఉన్నవారు’’ అని రాహుల్ చేసిన ట్వీట్ అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. ఇట్లా భేదభావాన్ని ప్రస్ఫుటపరిచే వ్యాఖ్యలు చేయడం రాహుల్‌కు అలవాటు లేదు. ఉత్తరాది నేతల నుంచి కొంత విమర్శ వచ్చింది కానీ, అందుకు రాహుల్ సిద్ధపడినట్టే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కనీసం రెండు ఆయన లక్ష్యం. అవి రెండూ దక్షిణాదివే. అసోంలో కూడా కాంగ్రెస్ పోరాటంలో ఉన్నది కానీ, అది ఉత్తరమూ కాదు దక్షిణమూ కాదు. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాగా, శరీర దారుఢ్య ప్రదర్శన చేసి, ఆయన సహచరుల మాదిరిగా విభజన వ్యాఖ్యలు కూడా చేసి, వివాదాస్పద నాయకుడిగానే ముందుకు వెళ్లాలని రాహుల్ అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ సాంప్రదాయిక ఎజెండా అయిన సంక్షేమాన్ని కూడా నరేంద్రమోదీ తన అంశంగా మలచుకున్నట్టు కనిపిస్తోంది. సంస్కరణల మీద గట్టిగా పోరాడలేని చారిత్రక బలహీనత కాంగ్రెస్‌ది. అందువల్ల, విచ్ఛిన్నకర వాదనలను తాను కూడా మరింత బలంగా చేయాలి, లేదా, వామపక్షవాదానికి ప్రతిధ్వనులు వినిపించాలి. కాసేపు అటు, కాసేపు ఇటు పద్ధతిలో రాహుల్ గాంధీ నడుస్తున్నారు. బెంగాల్‌లో వామపక్షాల నాయకత్వంలోని సెక్యులర్ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. కేరళలో, వామపక్ష కూటమికి ప్రత్యర్థి. అసోంలో ఎంతవరకు పౌరసత్వచట్టం వివాదాన్ని ఉపయోగించుకుంటారో తెలియదు. 


ఇటువంటి కీలక సన్నివేశంలో, పోయిన ఆగస్టులో అలజడి సృష్టించిన జి 23 మళ్లీ కలకలం మొదలుపెట్టారు. పోయిన శనివారం జమ్మూలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి, పూర్వపు లేఖారచయితలలో కొందరు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం తనను తాను సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. జమ్మూ సభకు ముందు, గులాం నబీ ఆజాద్ ప్రధాని మోదీని ఆయన పారదర్శకతను ప్రశంసించారు. తాను చాయ్ అమ్మానని, గిన్నెలు కడిగానని చెప్పుకోవడానికి మోదీ వెనుకాడలేదన్నది ఆజాద్ ప్రశంస. రాజ్యసభలో ఆజాద్ పదవీకాలం ముగిసినప్పుడు, నరేంద్రమోదీ చూపిన ఆశ్చర్యకరమైన ఉద్వేగం అందరికీ తెలిసిందే. ఇప్పుడు, నాలుగు రాష్ట్రాల ఎన్నికల కాలంలో, ఆజాద్, ఆనందశర్మల నాయకత్వంలోని బృందం కొంత చికాకు రాజకీయానికి పాల్పడే అవకాశమున్నది. బెంగాల్ సెక్యులర్ కూటమిలో ఐఎస్ఎఫ్ అనే ఒక మైనారిటీ సంస్థను చేర్చుకోవడంపై, ఆ సంస్థ పాల్గొన్న సభలో ఆధిర్‌రంజన్ చౌధురి పాల్గొనడంపై ఆనందశర్మ బహిరంగంగా విమర్శ చేశారు. ఈ జి-23 బృందాన్ని ఇందిరాగాంధీ తొలిరోజుల్లోని సిండికేట్‌తో రాజకీయ పరిశీలకులు పోలుస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ బృందంతో కఠినంగా వ్యవహరించకూడదని కలుపుకుపోవాలని భావిస్తోంది. 


ఆ వైఖరిలో భాగంగానే, ఆ బృందంలోని పృథ్వీరాజ్ చౌహాన్‌ను అసోం అభ్యర్థుల ఎంపికకమిటీకి చైర్మన్‌గా నియమించారు. ఇది తమ బృందంలో చీలిక తేవడానికి ఉద్దేశించిందేనని జి23 భావిస్తోంది. నియామకాల విషయంలో రాహుల్ గాంధీ ప్రాధాన్యాలు భిన్నంగా ఉన్నాయని అర్థమవుతోంది. ఆయన పరిగణించే సామాజిక సమీకరణలు, ఆయన ఎంపికలలోని పాతకొత్తల మిశ్రమాలు సహజంగానే సీనియర్ సభ్యులకు నచ్చకపోవచ్చు. కొత్తతరాన్ని అర్థం చేసుకుని అనువుగా ముందుకు పోవాలని సీనియర్లు, సీనియర్లను గౌరవించి వారి అనుభవాన్ని స్వీకరిస్తూ సంస్కరణలు తేవాలని కొత్త నాయకత్వం భావించాలి. అదే సమయంలో, పార్టీలో ఆత్మవిమర్శ కోరేపేరిట, మొదటికే మోసం తెచ్చేధోరణిని అనుమతించకూడదు. 


అంతర్గత విమర్శకులు చెబుతున్నదానిలో మంచిని స్వీకరిస్తూ, రానున్న ఎన్నికలలో కనీస సానుకూల ఫలితాలను సాధించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నించడం అవసరం. ఈ ఎన్నికలలో పూర్తి పరాజయం లభిస్తే, కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టం. ఇప్పుడు ప్రతిపక్షాలు సాధించే ఫలితాలు మాత్రమే, దేశంలో రాజకీయశక్తుల సమతూకానికి మార్గం వేయగలవు.

Updated Date - 2021-03-03T06:19:05+05:30 IST