కట్టుకథలు ప్రచారం చేస్తున్న 'బ్రదర్స్': సంబిత్ పాత్ర

ABN , First Publish Date - 2021-07-21T20:04:19+05:30 IST

కోవిడ్ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా మరణించలేదని, ఒక్క రాష్ట్రం కానీ ..

కట్టుకథలు ప్రచారం చేస్తున్న 'బ్రదర్స్': సంబిత్ పాత్ర

న్యూఢిల్లీ: కోవిడ్ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా మరణించలేదని, ఒక్క రాష్ట్రం కానీ , కేంద్ర పాలిత ప్రాంతం కానీ ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించినట్టు రిపోర్ట్ చేయలేదని రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటనను బీజేపీ నేత సంబిత్ పాత్ర సమర్ధించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై 'బిగ్ బ్రదర్' రాహుల్ గాధీ, 'యంగర్ బ్రదర్' కేజ్రీవాల్ కట్టుకథలు అల్లుతున్నారని అన్నారు. విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణను తోసిపుచ్చారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, కేసులు, మరణాలపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, యూటీలు కేంద్రానికి రిపోర్ట్ చేస్తుంటాయని అన్నారు.


''కోవిడ్ మరణాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని రాష్ట్రాలు, యూటీలకు  కేంద్ర ఆరోగ్య శాఖ చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. అందుకు సంబంధించిన డాటాను రెగ్యులర్ బేసిస్‌లో అవి అందిస్తుంటాయి. అయితే, ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించినట్టు ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా తమ నివేదకలో పేర్కొనలేదు'' అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు. పెద్ద సోదరుడు (రాహుల్), చిన్న సోదరుడు (కేజ్రీవాల్) అతి సున్నితమైన కోవిడ్ మరణాలపై అయోమయం సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనాపై పోరాటం సాగిస్తున్న తరుణంలో కొందరు రాజకీయ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాల అఫిడవిట్లను సంబిత్ పాత్ర చదవి వినిపిస్తూ, ఆక్సిజన్ కొరతతో ఒక్క మరణం కూడా సంభవించలేదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుకు తెలియజేశాయని అన్నారు.

Updated Date - 2021-07-21T20:04:19+05:30 IST