Idias for India : ఒక తప్పును మించి మరో తప్పు చేయడం రాహుల్ గాంధీకి అలవాటు : బీజేపీ

ABN , First Publish Date - 2022-05-21T21:20:46+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అలవాటుగా తప్పులు చేసే నాయకుడని

Idias for India : ఒక తప్పును మించి మరో తప్పు చేయడం రాహుల్ గాంధీకి అలవాటు : బీజేపీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అలవాటుగా తప్పులు చేసే నాయకుడని బీజేపీ దుయ్యబట్టింది. ఆయన శుక్రవారం లండన్‌లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసిన పొరపాటుకు మించిన పొరపాటు చేసే లక్షణం ఆయనకు ఉందని ఆరోపించింది. ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా భారత దేశాన్ని నకారాత్మక కోణంలో చిత్రిస్తారని పేర్కొంది. 


రాహుల్ గాంధీ శుక్రవారం లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో మాట్లాడుతూ, బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్  జల్లిందని ఆరోపించారు. దీనికి ఓ నిప్పు రవ్వ చాలునని చెప్పారు. రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా వాడుకుంటోందన్నారు. ఓ భావజాలం భారత దేశ గళాన్ని అణగదొక్కిందన్నారు. ఇప్పుడు జాతీయ భావజాల పోరాటం జరుగుతోందని చెప్పారు. భారత దేశంలో మీడియా న్యాయంగా లేదని, ఓ పక్షం వైపు ఉంటూ ఏకపక్షంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లడఖ్‌ (Ladakh)లో ప్రస్తుతం ఉక్రెయిన్ (Ukraine) తరహా పరిస్థితులు ఉన్నాయన్నారు. సరిహద్దుల్లో చైనా వృద్ధి చెందుతోందని, ఆ దేశం పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కనీసం ఉచ్చరించడం లేదన్నారు. భారత దేశంలోని పరిస్థితులను పాకిస్థాన్, శ్రీలంకలలోని పరిస్థితులతో పోల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం (Russia-Ukraine Crisis)  గురించి మాట్లాడుతూ, ‘‘ఇటువంటిదానిని గమనించండి. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది? లడఖ్‌లో జరుగుతున్నదేమిటి? ’’  అన్నారు. 


బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (BJP National Spokesperson Gaurav Bhatia) శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పుస్తకాలను ఇష్టపడని, కనీసం నర్సరీలో అయినా  ఉత్తీర్ణుడు కాని వ్యక్తి పీహెచ్‌డీ పరీక్షలకు హాజరుకావాలని కోరుకున్నట్లు రాహుల్ గాంధీ పరిస్థితి ఉందన్నారు. ఆయనకు విదేశీ వ్యవహారాల గురించి కనీసం ఓనమాలు అయినా తెలియవన్నారు. అయితే వ్యాఖ్యలు మాత్రం ఆగకుండా చేస్తారని అన్నారు. 


రాహుల్ గాంధీ (Rahul Gandhi) అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి (Habitual Offender) అని ఆరోపించారు. అంతకుముందు చేసిన తప్పును మించిన మరొక తప్పును చేసే వ్యక్తి అన్నారు. ఆయన విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ భారత దేశాన్ని నకారాత్మకం (Negative)గానే చూపిస్తారన్నారు. బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్  జల్లిందని, ఓ నిప్పు రవ్వ చాలునని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, 1984 నుంచి కాంగ్రెస్ నేతల్లో ఈ పని చేయనివారు లేరన్నారు. 


ఉక్రెయిన్ పరిస్థితిని లడఖ్ పరిస్థితితో పోల్చి చెప్పడాన్నిబట్టి రాహుల్ గాంధీకి భారత దేశ బలం గురించి కానీ, విదేశీ వ్యవహారాల గురించి కానీ ఏమీ తెలియదని అర్థమవుతోందని రుజువవుతోందన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ (Galwan) హీరో కల్నల్ సంతోష్ కుమార్ చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేశారు. 


భారత్, పాక్ పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయని రాహుల్ చెప్పడంపై గౌరవ్ స్పందిస్తూ ‘‘మీకు పుస్తక పఠనం ఇష్టం లేదని మాకు తెలుసు. కానీ ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌తో భారత దేశాన్ని పోల్చవద్దని హెచ్చరిస్తున్నాను’’ అని చెప్పారు. 


Updated Date - 2022-05-21T21:20:46+05:30 IST