దురహంకారాన్ని లొంగదీసిన రైతన్నలు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-11-19T19:10:57+05:30 IST

దేశంలోని రైతన్నలు తమ సత్యాగ్రహంతో దురహంకారం

దురహంకారాన్ని లొంగదీసిన రైతన్నలు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : దేశంలోని రైతన్నలు తమ సత్యాగ్రహంతో దురహంకారం మెడలు వంచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్యాయంపై విజయం సాధించిన రైతులను అభినందించారు. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో రాహుల్ శుక్రవారం ట్విటర్ వేదికగా ఈ విధంగా స్పందించారు. 


ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గతంలో తాను ఇచ్చిన ఓ ట్వీట్‌ను షేర్ చేశారు. ఈ మూడు సాగు చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పని పరిస్థితులు వస్తాయని ఆయన ఆ ట్వీట్‌లో హెచ్చరించారు. ‘‘రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వస్తుంది, నా మాటలను రాసి పెట్టుకోండి’’ అని జనవరి 14న ఇచ్చిన ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. 


రాహుల్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘దేశంలోని రైతులు సత్యాగ్రహంతో అహంకారం మెడలు వంచారు. అన్యాయంపై విజయం సాధించిన రైతులకు అభినందనలు. జై హింద్, రైతులకు జై’’ అని పేర్కొన్నారు. 


అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, రైతుల నిరసనల నేపథ్యంలో మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. రైతులు తమ నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి హోదాలో తాను ఇప్పటి వరకు చేసినదంతా దేశ ప్రయోజనాల కోసమేనని తెలిపారు. 


Updated Date - 2021-11-19T19:10:57+05:30 IST