Abn logo
May 23 2020 @ 21:52PM

వాళ్లపై రాహుల్ ‘‘దరిద్రపు రాజకీయాలు’’చేస్తున్నారు: బీజేపీ

న్యూఢిల్లీ: వలస కార్మికులపై కేంద్ర వైఖరిని నిరసిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. వలస కార్మికులపై రాహుల్ ‘‘దరిద్రపు రాజకీయాలు’’ చేస్తున్నారంటూ విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వలస కార్మికులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టింది. ‘‘తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గాంధీ కుటుంబం వలస కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదు. యూపీఏ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వలస కార్మికులను కనీసం తమ స్వగ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు...’’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ ఫోటోలకు ఫోజులిస్తూ ‘‘కెమేరా రాజకీయాలు’’ చేస్తున్నారంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ వలస కార్మికులతో రాహుల్ మాట్లాడుతున్నది వారికి సాయం చేసేందుకు కాదనీ.. ‘‘దరిద్రపుగొట్టు రాజకీయాలు’’ చేసేందుకే తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. గత వారంలో రాహుల్ గాంధీ వలస కార్మికులతో జరిపిన సంభాషణపై కాంగ్రెస్ పార్టీ ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన మరుసటి రోజే బీజేపీ ఈ మేరకు స్పందించడం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement