రాహుల్ గాంధీ ఘాటు లేఖపై స్పందించిన ట్విట్టర్

ABN , First Publish Date - 2022-01-27T18:21:58+05:30 IST

భారత దేశ భావన విధ్వంసంలో పావుగా మారవద్దని

రాహుల్ గాంధీ ఘాటు లేఖపై స్పందించిన ట్విట్టర్

న్యూఢిల్లీ : భారత దేశ భావన విధ్వంసంలో పావుగా మారవద్దని ట్విటర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గట్టిగా కోరారు. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించడాన్ని అరికట్టడంలో ఈ సంస్థ అనుకోకుండా భాగస్వామి అవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు రాసిన లేఖపై ఆ సంస్థ స్పందించి, ఆయనకు బదులిచ్చింది. మానిప్యులేషన్, స్పామ్‌లను ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. 


రాహుల్ గాంధీ గురువారం రాసిన ఈ లేఖలో తన ట్విటర్ ఖాతాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ల ట్విటర్ ఖాతాలతో పోల్చుతూ విశ్లేషణాత్మక వివరాలను జోడించారు. 2021లో మొదటి ఏడు నెలల్లో సగటున 4 లక్షల మంది చొప్పున ఫాలోయర్లు పెరగగా, అదే సంవత్సరం ఆగస్టులో ఎనిమిది రోజులపాటు తన ఖాతా సస్పెండ్ అయిన తర్వాత ఫాలోయర్ల పెరుగుదల నిలిచిపోయిందని తెలిపారు. కచ్చితంగా ఇదే సమయంలో తాను ఢిల్లీలో ఓ అత్యాచార బాధితురాలి కుటుంబం అనుభవిస్తున్న ఆవేదనపై నిలదీశానని, రైతులకు సంఘీభావంగా నిలిచానని, ప్రభుత్వంతో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాడానని తెలిపారు. భారత దేశంలో ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు పోస్ట్ చేసిన వీడియోలలో చాలా ఎక్కువ మంది చూసినవాటిలో ఒకటి తన వీడియో అని తెలిపారు. ఆ వీడియోలో తాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు.  తాను ఓ బిలియన్‌కుపైగాగల భారతీయుల తరపున ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు. భారత దేశ భావన విధ్వంసంలో పావుగా మారవద్దని కోరారు. 


ట్విటర్ ఇండియాలోని వ్యక్తుల ద్వారా తనకు విశ్వసనీయ సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తన గళాన్ని మూగబోయేలా చేయాలని ప్రభుత్వం నుంచి వారిపై అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు చెప్పారన్నారు. తన ఖాతాను కొద్ది రోజులపాటు బ్లాక్ చేశారని తెలిపారు. తాను పోస్ట్ చేసిన ఫొటోలవంటివాటినే పోస్ట్ చేసిన ట్విటర్ హ్యాండిల్స్  చాలా ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ వర్గాలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ఖాతాలను బ్లాక్ చేయలేదన్నారు. కేవలం తన ఖాతాను మాత్రమే టార్గెట్ చేశారని తెలిపారు. 


ట్విటర్ స్పందన

దీనిపై ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ట్విటర్‌ ప్లాట్‌ఫాంను మానిప్యులేషన్, స్పామ్‌ చేయడాన్ని ఎంత మాత్రం సహించేది లేదన్నారు. తాము స్పామ్, మాలిషియస్ ఆటోమేషన్‌లపై వ్యూహాత్మకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను భారీగా వినియోగించి వీటిపై పోరాడుతున్నామన్నారు. ఆరోగ్యకరమైన సేవలు అందేవిధంగానూ, విశ్వసనీయమైన ఖాతాలు ఉండేవిధంగానూ తాము నిలకడగా చేపడుతున్న చర్యల వల్ల ఫాలోయర్ కౌంట్స్ మారుతుండవచ్చునన్నారు. 

Updated Date - 2022-01-27T18:21:58+05:30 IST