కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ ఏకగ్రీవం!?

ABN , First Publish Date - 2022-09-20T07:11:06+05:30 IST

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే మరోసారి పార్టీ పగ్గాలు దక్కనున్నాయా.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ ఏకగ్రీవం!?

అధిష్ఠానం వ్యూహాత్మక ఎత్తులు 

ఓవైపు ఆయనపై ఒత్తిడి 


ఇంకోవైపు రాహుల్‌గాంధీనే 

ఎన్నుకోవాలంటూ పీసీసీల తీర్మానాలు

22న అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ 

వెలువడేలోపు మిగతా పీసీసీలూ

రాహుల్‌ కాదంటే మళ్లీ సోనియానే!

కుదరకుంటే బరిలో అశోక్‌ గహ్లోత్‌?

ఆయనకు పోటీగా శశి థరూర్‌!

సోనియాతో కేరళ ఎంపీ భేటీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే మరోసారి పార్టీ పగ్గాలు దక్కనున్నాయా..? ఆయన్ను ‘ఏకగ్రీవం’గా ఎన్నుకోనున్నారా..? కాంగ్రె్‌సలో తాజా పరిణామాలు వీటినే సూచిస్తున్నాయి. ఆయన్ను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ నాయకత్వంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ససేమిరా అంటున్న ఆయనపై సీనియర్‌ నేతల ద్వారా ఒత్తిడి పెంచుతోంది. బాధ్యతలు చేపట్టి తీరాలని పలువురు నాయకులు మీడియా ముఖం గా రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ ప్రతినిధులకు పిలుపిస్తున్నారు.


ఇదే సమయంలో.. ‘భారత్‌ జోడో యాత్ర’ చేస్తున్న రాహులే అధ్యక్ష పదవి చేపట్టాలని వివిఽధ రాష్ట్రాల పీసీసీల ద్వారా తీర్మానాలు చేయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌ శాఖలు ఈ మేరకు తీర్మానాలు చేసి అధిష్ఠానానికి పంపాయి. జమ్మూకశ్మీరు, ముంబై పీసీసీలు కూడా ఇదే బాటపట్టాయి. ఈ నెల 22న అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడేలోపు మిగతా పీసీసీలు కూడా తీర్మానించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. 24 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న ఓటింగ్‌ నిర్వహిస్తారు. కాగా.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌తో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలని దాదాపు 650 మంది యువనేతలు రాసిన లేఖను ఆయన ఇటీవల సమర్థించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.


అభ్యర్థులంతా ప్రతిజ్ఞ చేయాలి

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేవారు.. ఎన్నికైన వంద రోజుల్లోపు పార్టీ ఉదయపూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేస్తామంటూ బహిరంగంగా ప్రతిజ్ఞ చేయాలని ‘కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌’ పేరిట సోషల్‌ మీడియాలో ఓ పిటిషన్‌ పోస్టు చేశారు. దీనిని థరూర్‌ స్వాగతించారు. పార్టీ ప్రక్షాళన జరగాలనే మంచి సంకల్పానికి ఇంతమంది మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని థరూర్‌ వ్యాఖ్యానించారు.


‘జోడో’తో బీజేపీకి వణుకు 

న్యూఢిల్లీ/అలప్పుజా/ముంబై/చెన్నై, సెప్టెంబరు 19: రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న  స్పందన చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అందుకే ఈ యాత్రపై బీజేపీ తప్పుడు సమాచారాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆపార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ విమర్శించారు. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రధాని మోదీ భయపడుతున్నట్టు ఆయన ప్రసంగాల్లో ప్రతిబింబిస్తోందని అన్నారు. రాహుల్‌ చేపడుతున్న భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ఉపయోగకరమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో విపక్ష కూటమిలో కాంగ్రె్‌సను చేర్చుకునేందుకు తాను వ్యతిరేకిని కాదని పవార్‌ స్పష్టం చేశారు. 


అలప్పుజా జిల్లాలో పాదయాత్ర

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. సోమవారం కేరళలోని అలప్పుజా జిల్లా పున్నప్రా నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అంతకుముందు వడక్కల్‌ బీచ్‌ వద్ద మత్స్యకారులతో సమావేశమయ్యారు. పున్నప్రా నుంచి పాదయాత్ర చేపట్టిన రాహుల్‌ సోమవారం రాత్రి చెర్తలా సమీపంలోని మయితార వద్ద బస చేశారు.


పోటీ వారిద్దరి నడుమేనా?

తిరిగి పోటీ చేసే విషయంపై రాహుల్‌ ఏదీ తేల్చడం లేదు. సరైన సమయంలో చెబుతానని ఇటీవల కన్యాకుమారిలో ప్రకటించారు. నోటిఫికేషన్‌ విడుదల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు. సీనియర్ల ఒత్తిళ్లకు ఆయన తలొగ్గకపోతే ఎవరు బరిలోకి దిగుతారనే విషయంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియానే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని.. ఆమె కాదంటే ఆమె కుటుంబానికి సన్నిహితుడైన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ను రంగంలోకి దించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం పదవి వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు అంటున్నా.. సోనియా ఒత్తిడి చేస్తే కాదనరని తెలుస్తోంది. అయితే ఏకగ్రీవంగా రాహుల్‌ను గానీ, గహ్లోత్‌ను గానీ ఎన్నుకుంటే విమర్శలు వస్తాయనుకుంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని అనిపించుకోవడానికి సీనియర్‌ నేతనెవరిరైనా  వారిపై పోటీకి దించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ నేత థరూరే కావచ్చని.. సోనియాతో ఆయన భేటీ దీనికి బలం చేకూరుస్తోందని అంటున్నారు.

Updated Date - 2022-09-20T07:11:06+05:30 IST