రైతులకు ధైర్యం ఇచ్చేందుకే రాహుల్‌ సభ

ABN , First Publish Date - 2022-04-25T08:40:21+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో నష్టాల పాలైన రైతుల్లో ధైర్యం కల్పించేందుకే మే 6న వరంగల్‌లో రాహుల్‌ గాంధీ సభను నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వెల్లడించారు.

రైతులకు ధైర్యం ఇచ్చేందుకే రాహుల్‌ సభ

  • వారికి ఏం చేయనున్నామో ఆయన చెబుతారు: భట్టి విక్రమార్క
  • రుణమాఫీ చేయని కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో నష్టాల పాలైన రైతుల్లో ధైర్యం కల్పించేందుకే మే 6న వరంగల్‌లో రాహుల్‌ గాంధీ సభను నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వెల్లడించారు. రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేయనుందో ఆ సభలో రాహుల్‌ వివరిస్తారని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు తీసుకున్న రూ. లక్ష రుణం.. వడ్డీలు పెరిగి రూ.4 లక్షలైందన్నారు. రాహుల్‌ సభకు రాజకీయాలకు అతీతంగా రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


కాగా, ప్రధాని మోదీని విమర్శించినందుకుగాను దళిత ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీని అరెస్టు చేయడాన్ని తెలంగాణ సీఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్‌క చెప్పారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత మోసం చేశారన్నారు. రుణమాఫీ చేయని సీఎం కేసీఆర్‌ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ సభను విజయవంతం చేయడానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నిర్మల్‌లో నిర్వహించిన రాహుల్‌ సభలో లక్షల మంది పాల్గొన్నారని, వరంగల్‌ సభనూ అదే స్థాయిలో విజయవంతం చేస్తామన్నారు. మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలోని సమస్యలపైన రాహుల్‌గాంధీతో ఒక కరపత్రం విడుదల చేయించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు.



Updated Date - 2022-04-25T08:40:21+05:30 IST