రాహుల్ వ్యాఖ్యలతో కదిలిన తేనెతుట్టె

ABN , First Publish Date - 2021-02-25T01:45:34+05:30 IST

ఉత్తర, దక్షిణాది ప్రజల అవగాహన విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యవహారం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

రాహుల్ వ్యాఖ్యలతో కదిలిన తేనెతుట్టె

న్యూఢిల్లీ : ఉత్తర, దక్షిణాది ప్రజల అవగాహన విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యవహారం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఉత్తరాది, దక్షిణాదిగా రాహుల్ దేశాన్ని విడదీస్తున్నారని మండిపడింది. రాహుల్ విభజన రాజకీయాలు చెల్లవని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

స్మృతి ఇరానీ... కేంద్ర మంత్రి

‘‘కృతజ్ఞత లేనివారు. ఎక్కువ జ్ఞానం లేనివారని ప్రపంచమే వారి గురించి చెబుతుంది.’’ అని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.  

కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి :

‘‘రాహుల్ జీ... దయచేసి అమేధీని, ఉత్తరాది ప్రజలను తిట్టకండి. మీ కుటుంబానికి అమేధీ ప్రజలు చాలా అవకాశాలిచ్చారు. మీరు మంచి వ్యక్తులైతే... దేశప్రజలందరూ మంచివారే.

యోగి ఆదిత్యనాథ్... సీఎం

ఇన్ని సార్లు లోక్‌సభకు పంపిన యూపీ ప్రజలను రాహుల్ కేరళ వెళ్లి ఎగతాళి చేశారని సీఎం యోగి మండిపడ్డారు. కొందరికి భారత దేశ పురోగతి నచ్చదని మండిపడ్డారు. ‘‘యూపీ, అమేధీ ప్రజలను ఎవరు అవమానపరుస్తున్నారో గమనించండి. చివరికి వారిని కాంగ్రెస్ ఏం చేయాలని అనుకుంటోంది? విభజన రాజకీయాలను ఎందుకు చేస్తున్నారు?’’ అని యోగి ఫైర్ అయ్యారు. 

శివరాజ్ సింగ్ చౌహాన్ (సీఎం)..

‘‘రాహుల్ ఎక్కడ కాలు మోపితే.. అక్కడ కాంగ్రెస్ ఖల్లాస్. రాహుల్ మొదట ఉత్తర భారతాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్‌గా చేశారు. ఇప్పుడు దక్షిణ భారత్ వైపు మళ్లారు. మాకు, ప్రజలకు దేశం అంతా ఒక్కటే. దేశాన్ని ఉత్తర, దక్షిణాదిగా విభజించడానికి కాంగ్రెస్ చూస్తోంది. ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారు.’’ అని శివరాజ్ వ్యాఖ్యానించారు. 

దితీ సింగ్... రాయ్‌బరేలీ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ప్రశంసిస్తూ, పాత నియోజకవర్గాన్ని తక్కువ చేసి చూపడం పూర్తిగా తప్పు. ఇతర పార్టీలు విభజన రాజకీయాలకు దిగుతాయని ప్రతిరోజూ రాహుల్ విమర్శిస్తారు. కానీ... ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అమేధీ నియోజకవర్గమే ఆయనకు రాజకీయాలను నేర్పింది. వారి పూర్వీకులకు విజయాలను అందించింది. రాహుల్‌ను ఢిల్లీకి పంపింది కూడా అమేధీయే.’’ ఆమె గుర్తు చేశారు. అంతటి అమేధీపై రాహుల్ విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ప్రజలంతా ఒకే దేశమని, రాహుల్ గాంధీ వెంటనే అమేధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

రాహుల్ ఏ సందర్భంలో అన్నారో : కపిల్ సిబాల్

ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. రాహుల్ గాంధీ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. అయితే విభజన విషయంలో బీజేపీ తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విభజన రాజకీయాలనే చేస్తోందని విమర్శించారు. రాహుల్ వివరణ ఇచ్చేంత వరకు తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. దేశంలోని ఓటర్లు చాలా తెలివైన వారని, వారి స్వేచ్ఛను నేతలందరూ గౌరవించాల్సిందేనని సిబల్ స్పష్టం చేశారు. 

ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే... 

‘‘నార్త్ ఇండియా నుంచి నేను 15 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నా. వివిధ రకాలైన రాజకీయాలను చూశా. నా మట్టుకు.. కేరళకు రావడం ఉత్సాహంగా ఉంది. సమస్యలను తెలుసుకోడానికి ఇక్కడి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తే కాదు... లోతుగా అధ్యయనం చేస్తున్నారు.’’ అని రాహుల్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-25T01:45:34+05:30 IST