12 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం.. అతడి భార్య మాటలతో..

ABN , First Publish Date - 2022-01-11T22:55:01+05:30 IST

2 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బీహార్ వాసి బ్రహ్మదేవ్ మండల్ (84)ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

12 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం.. అతడి భార్య మాటలతో..

ఫోన్ నెంబర్లు మార్చి మరీ 12 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బీహార్ వాసి  బ్రహ్మదేవ్ మండల్ (84)ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తప్పంతా ప్రభుత్వ అధికారులు చేసి తమను ఎందుకు వేధిస్తున్నారని అతని భార్య నిర్మలా దేవి ప్రశ్నించింది. బ్రహ్మదేవ్‌ను అరెస్ట్ చేసేందుకు సోమవారం రాత్రి పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తలుపు వేసి ఉండడంతో దానిని బద్దలుగొట్టారు. దాంతో బ్రహ్మదేవ్ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత చేసినా బ్రహ్మదేవ్ ఆచూకీ మాత్రం పోలీసులకు దొరకలేదు. 


`మేం నేరస్థుల్లా బ్రతుకుతున్నాం. మేం దొంగతనం చేశామా? ఆరోగ్యం గురించి ఆలోచించడమే మేం చేసిన నేరమా? రాత్రి పూట తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి వస్తారా? వ్యాక్సిన్ వేయించుకున్నాక ఆరోగ్యం బాగున్నట్టు అనిపించడంతో నా భర్త పదే పదే వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆ మాత్రం దానికే అతడిని దొంగ అంటారా` అంటూ నిర్మలా దేవి పోలీసులను నిలదీసింది. పోలీసుల వైఖరిని చుట్టుపక్కల వారు కూడా ఖండించారు. నిబంధనలను అతిక్రమించి 12 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న బ్రహ్మదేవ్‌ మీద ఛీటింగ్ కేసు, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం వంటి కేసులను పోలీసులు నమోదు చేశారు. 


ఆ కేసులు రిజిస్టర్ అయిన వెంటనే బ్రహ్మదేవ్ స్పందించారు. `వ్యాక్సినేషన్ వల్ల నాకు మేలు జరిగింది. కాబట్టి మళ్లీ మళ్లీ వ్యాక్సిన్ తీసుకున్నా. నాది నేరమైతే.. నాకు 12 సార్లు వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వాధికారులది కూడా నేరమే. వాళ్లను వదిలేసి నా ఒక్కడి పైనే ఎందుకు కేసులు పెట్టార`ని బ్రహ్మదేవ్ ప్రశ్నించారు. ఎక్కువ సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం బాగుందని, అంతకుముందున్న చాలా నొప్పులు దూరమయ్యాయని బ్రహ్మదేవ్ ఓ వీడియోలో చెప్పడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-01-11T22:55:01+05:30 IST