రైల్వే స్థల నివాసితుల దీక్షల విరమణ

ABN , First Publish Date - 2022-01-25T05:13:46+05:30 IST

తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాలలోని రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి సంబంధిత అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానికులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం విరమించారు.

రైల్వే స్థల నివాసితుల దీక్షల విరమణ
సీఎం ఇల్లు ముట్టడికి బయల్దేరిన వారిని నిలువరిస్తున్న పోలీసులు

- సీఎం ఇల్లు ముట్టడి పిలుపుతో....

- కొద్దిసేపు ఉద్రిక్తత

- అధికారుల హామీతో శాంతించిన స్థానికులు 

తాడేపల్లి టౌన్‌, జనవరి 24: తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాలలోని రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి సంబంధిత అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానికులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం విరమించారు. కాగా దీక్షలు విరమణకు ముందు నివాసితులు సీఎం ఇల్లు ముట్టడికి పిలుపు ఇవ్వడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీక్షా శిబిరం నుండి పెద్ద ఎత్తున నివాసితులు సీఎం ఇంటికి వెళ్లడానికి రోడ్లపైకి దూసుకొచ్చారు. అప్రమత్తమైన డీఎస్పీ రాంబాబు, సీఐలు శేషగిరిరావు, సాంబశివరావు, బ్రహ్మయ్యలు సిబ్బందిని మోహరించి, వారిని నిలువరించారు. తాడేపల్లి తహశీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి,  ఎంటీఎంసీ డిప్యూటి కమిషనర్‌ రవిచంద్రారెడ్డిలను దీక్ష శిబిరం వద్దకు పిలిపించి నివాసితులతో మాట్లాడించారు. రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు 650 కుటుంబాల వారు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు నివాసితులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అలాగే నివాసితుల తరపున ఆమరణ దీక్ష చేపట్టిన అనిల్‌ అనే యువకుడిని పోలీసులు అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-01-25T05:13:46+05:30 IST