రైల్వే పార్శిల్‌ ‘సర్వీస్‌’

ABN , First Publish Date - 2021-06-23T05:32:33+05:30 IST

పార్శిల్‌ సర్వీసులో వాల్తేరు డివిజన్‌ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

రైల్వే పార్శిల్‌ ‘సర్వీస్‌’

కొత్త సేవలు ప్రారంభించిన వాల్తేరు డివిజన్‌

ఇకపై డోర్‌ డెలివరీ, పికప్‌


విశాఖపట్నం, జూన్‌ 22: పార్శిల్‌ సర్వీసులో వాల్తేరు డివిజన్‌ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులకు డోర్‌ డెలివరీ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ద్విచక్ర వాహనాలు, ఇతర వస్తువులను ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్‌ చేయడంతోపాటు వినియోగదారుడు సూచించిన గమ్యానికి చేరవేయనున్నది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పార్శిళ్లను డోర్‌ డెలివరీ చేస్తుంది. ఇప్పటివరకు రైల్లో ద్విచక్ర వాహనాన్ని ఇతర ప్రాంతాలకు పంపాలంటే స్టేషన్‌లోని పార్శిల్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి బుక్‌ చేయడంతోపాటు ప్యాకింగ్‌ చేయించుకోవాల్సి వచ్చేది. అంతేకాకుండా పార్శిల్‌ బుక్‌ చేసుకున్న రైలులో ప్రయాణించి గమ్యం చేరిన తర్వాత సొంత వాహనాన్ని విడిపించుకోవాల్సి వచ్చేది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని పార్శిల్‌ కార్యాలయాలనికి వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై వినియోగదారుడి ఇంటి వద్దకే సేవలందనున్నాయి. ఈ సేవలను శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్‌ ఏజెన్సీ సంస్థ చేపట్టనుంది. సేవలను వినియోగించుకోవాలనుకునేవారు ఫోన్‌:8885673389కు సంప్రతించవచ్చు. లేదా హెచ్‌టీటీపీఎస్‌://రైల్‌పార్శిల్‌.కో.ఇన్‌/వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి సేవలను పొందవచ్చు. ఈ మేరకు డోర్‌ టు డోర్‌ డెలివరీ కార్యాలయాన్ని మంగళవారం డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్‌ టు డోర్‌ డెలివరీ, పికప్‌ పార్శిల్‌ సేవలను ప్రవేశపెట్టిన తొలి డివిజన్‌ వాల్తేరు రైల్వే కావడం విశేషమన్నారు. వినియోగదారులకు ఉత్తమ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. వినియోగదారులతో స్నేహపూర్వక  సంబంధాలు వుంటాయని, పార్శిల్‌ ప్యాకింగ్‌ కూడా నిపుణులు చేపడతారని, వినియోగదారుని సౌలభ్యాన్ని బట్టి డోర్‌ డెలివరీ, పికప్‌ వుంటుందని, చార్జీల వసూళ్లలో పారదర్శకత వుంటుందని తెలిపారు. 

Updated Date - 2021-06-23T05:32:33+05:30 IST