మూడో రోజూ భారీ వర్షం

ABN , First Publish Date - 2021-09-29T05:51:51+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో వరుసగా మూడో రోజు (మంగళవారం) కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం సుమారు మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో తూటిపాల, పైడిపాల, జి.కోడూరు, మాకవరపాలెం తదితర గ్రామాల్లో వరి పొలాలు నీటిమునిగాయి.

మూడో రోజూ భారీ వర్షం
మాకవరపాలెంలో నీట మునిగిన వరి పొలాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం

ముంపులోనే వరి పొలాలు


మాకవరపాలెం, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో వరుసగా మూడో రోజు (మంగళవారం) కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం సుమారు మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో తూటిపాల, పైడిపాల, జి.కోడూరు, మాకవరపాలెం తదితర గ్రామాల్లో వరి పొలాలు నీటిమునిగాయి. నర్సీపట్నం-తాళ్లపాలెం రోడ్డులో తామరం వద్ద వర్షం నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తున్నది. మాకవరపాలెంలో డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడంతో వర్షంనీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పైడిపాల కాలనీ నీట మునిగిపోయింది. కాగా మండలంలో ముంపునకు గురైన పలు ప్రాంతాలను తహసీల్దార్‌  రాణిఅమ్మాజీ పరిశీలించారు. పైడిపాల కాలనీతోపాటు మాకవరపాలెం, తామరంలో మెయిన్‌రోడ్డుపై నిలిచిన వర్షపునీరు బయటకు పోయేలా కాలువలు తవ్వించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న జాజిగెడ్డను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్షాల వల్ల నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్టు చెప్పారు.  


తాండవ నుంచి నీరు విడుదల

నాతవరం సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో వరుసగా మూడో రోజు (మంగళవారం) కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ముసురు వాతావరణం నెలకొని జల్లులు పడగా, మధ్యాహ్నం భారీవర్షం పడింది. కొండగెడ్డల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. సాగునీటి చెరువులన్నీ పూర్తిగా నిండడడంతో అదనపు నీరు పొర్లుగట్టు మీదుగా బయటకు పోతున్నది. తాండవ రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో మూడు గేట్లు ఎత్తి అదనపు నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.


గొలుగొండలో..

గొలుగొండ, సెప్టెంబరు 28:  గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో మంగళవారం కూడా దఫదఫాలుగా వర్షం కురిసింది. పాతమల్లంపేట, కొత్తఎల్లవరం, గొలుగొండ, అమ్మపేట, పుత్తడిగైరంపేట, ఏటిగైరంపేట గ్రామాల్లో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాతమల్లంపేట వద్ద ధారగెడ్డ పొంగి ప్రధాన రహదారిపై ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తఎల్లవరం, పాకలపాడు, కశిమి, కరక, జిల్లేడపూడి గ్రామాల్లో సుమారు ఆగాకర పందిళ్లు కూలిపోయాయి. 


నీట మునిగిన వరి  పొలాలు

కృష్ణాదేవిపేట: తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు పడడంతో గొలుగొండ మండలంలోని కృష్ణాదేవిపేట, కొంగసింగి, పాతకృష్ణాదేవిపేట, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. రహదారులపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో కోతకు గురయ్యాయి. ఇప్పటికే అధ్వానంగా వున్న రోడ్లు, వర్షాలతో మరింత ఛిద్రం అయ్యాయి. 


భారీ వర్షాలతో నిండిన చెరువులు

నర్సీపట్నం అర్బన్‌: తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో మండలంలో సాగునీరు చెరువులు పూర్తిగా నిండాయి. మట్టి రోడ్లు బురదమయం కావడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్టుపల్లి వద్ద రోడ్డుపై చెట్టు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


Updated Date - 2021-09-29T05:51:51+05:30 IST