ముంచేసింది!

ABN , First Publish Date - 2020-10-16T08:35:45+05:30 IST

దంచికొడుతున్న వానలు దాదాపు తగ్గుముఖం పట్టడంతో వరద మిగిల్చిన పంట నష్టాన్ని తేల్చే పనిని అధికారులు ..

ముంచేసింది!

పొలాల నిండా వరదనీరు.. అన్నదాత కష్టం, పెట్టుబడీ బురదపాలు

వరద మిగిల్చిన పంటనష్టం అపారం.. తూర్పులోనే వంద కోట్లు వర్షార్పణం

లక్ష ఎకరాల్లో పంటలు మునక.. అందులో 50వేల ఎకరాల్లో చేతికిరాని వరి

పొలంలోనే కుళ్లిన పత్తి పంట.. చేతికి రాకముందే మెట్ట పంటలు నీటిపాలు

కర్నూలులో 37,619 హెక్టార్లలో మునిగిన పంట

54,210 హెక్టార్ల సాగు, 

9,290 హెక్టార్ల 

ఉద్యాన పంటలకు దెబ్బ

కేంద్రం ప్రాథమిక అంచనా


నిండా ముంచేసిన వరద నీరు దిగేకొద్దీ పంటనష్టం వెలికివస్తోంది. వరుస వరదలు, అధిక వర్షాలతో కుంగిన అన్నదాతకు తీవ్రవాయుగుండం అపార కష్టాన్నే మిగిల్చింది. 2రోజులుగా పొలాల్లోకి భారీగా చేరిన నీరు ఇప్పుడిప్పుడే ఇంకుతోంది. పాడైపోయి బయటపడుతున్న పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అపార పంట నష్టాన్ని కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వ్యవసాయ పంటలు 4,210హెక్టార్లు, ఉద్యాన పంటలు 9,290 హెక్టార్లు దెబ్బతిన్నట్టు తేల్చింది.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): దంచికొడుతున్న వానలు దాదాపు తగ్గుముఖం పట్టడంతో వరద మిగిల్చిన పంట నష్టాన్ని తేల్చే పనిని అధికారులు మొదలుపెట్టారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కుండపోత కురిసింది. కృష్ణా, వంశధార, శారద నదుల వరదల ముంపు వల్ల కృష్ణా, గుంటూరు, కడప, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు వరద బీభత్సాన్ని చవిచూశాయి. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేసిన వ్యవసాయ పంటలతో పాటు అరటి, పసుపు, టమోట, కూరగాయ తోటలు నీట మునిగి పాడైపోతున్నాయి.


కర్నూలు, నంద్యాల, ఏలూరు, అమలాపురం, జంగా రెడ్డిగూడెం, ఒంగోలు, రాజంపేట, కడప, కాకినాడ, శ్రీకాకుళం, విజయవాడ, టెక్కలి, తెనాలి, నూజివీడు, గుంటూరు విజయనగరం డివిజన్లలో దాదాపు 20వేల ఎకరాల్లో 33ు కన్నా అధికంగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి ప్రాతిపాదనలు పంపారు. కాగా భారీ వర్షాలు, వరదల ముంపు వల్ల ఆక్వా రంగంలో జరిగిన నష్టంపై మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 11,200ఎకరాల్లో ఆక్వా దెబ్బతిన్నట్టు ఈ సమావేశంలో తేల్చారు. 


పంటలు నీట్లోనే..


విశాఖజిల్లాలో 13,135 మంది రైతులకు చెందిన 5,795 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి. ఇంకా 84 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. పంటలు, తోటలకు కలిపి రూ.ఏడు కోట్లు నష్టం సంభవించిందని అంచనా. వర్షాలకు గ్రామీణ ప్రాంతంలో 157.75 కి.మీ. మేర రహదారులు దెబ్బతినడంతో రూ.62 కోట్లు నష్టం వాటిల్లింది. వరదల్లో కొట్టుకుపోయి జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం శ్రీకాకళం జిల్లాలో పలుప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటనష్టాలను అంచనావేస్తున్నారు. 


నేలకొరిగిన ఆశలు..

ప్రధాన నదులైన కృష్ణ, తుంగభద్రకు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ వరద ఉధృతికి కర్నూలు జిల్లాలోని వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చామకాలువ, మద్దిలేరు, హంద్రీలో భారీ ప్రవాహం వల్ల పరివాహక గ్రామాల్లోని పంటలు మునిగిపోయాయి. వరి, పత్తి, వేరుశనగ, మిరప, మినుము, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు గత రెండు రోజులుగా జలదిగ్బంధం లోనే ఉన్నాయి.  ప్రకాశంబ్యారేజి నుంచి వస్తున్న వరద ఉధృతి కారణంగా పలు లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ గ్రామాల పరిధిలో వాణిజ్య పంటలు వేసిన వేలాది ఎకరాల్లోకి నీరు చేరింది.


ఈ జిల్లాలో నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. కృష్ణాజిల్లాలో ఈ ఏడాది 1.07 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేశారు. ఇందులో 4560.79 హెక్టార్లలో పసుపు,  కూరగాయలు, అరటి, బొప్పాయి, మిర్చి, పూలతోటలు, తమలపాకు, జామ, మామిడి, నిమ్మ, కంద, తదితర పంటలు నీటమునిగినట్టు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. పంట నష్టం రూ.74.08 కోట్టుగా తేల్చారు. 


శ్రీశైలానికి పెరిగిన వరద

కర్నూలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం డ్యాంకు వరద భారీగా పెరిగింది.  గురువారం సాయంత్రం శ్రీశైలంలో 5,00,457 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పదిగేట్లను 20అడుగులమేర ఎత్తి 4,71,730 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 26,382 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.


మరో 4 రోజులు వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): కాకినాడ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్‌ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఈనెల 19న మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 19వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


3 దశాబ్దాల తర్వాత తొలిసారి.. 

ఒకదానివెంట ఒకటిగా వెంటాడిన జల విపత్తులు పశ్చిమ రైతును చిత్తుచేసేశాయి. ఉండ్రాజవరం మండలం కాల్ధరి వద్ద ఎర్రకాలువ ఎడమగట్టుకు గండి పడి.. వందలాది ఎకరాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ వాగు కాలువ ఉధృతికి తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం పరిధిలో ఐదు వేల ఎకరాలు నీట మునిగాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 60,498 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. 48 మండలాల్లోని 417 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా 53,508 ఎకరాల్లో వరి పంట నీట మునగగా, 3,342 ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. 242 ఎకరాల్లో వేరుశనగ, 931 ఎకరాల్లో ప్రత్తి, 2,460 ఎకరాల్లో మినుము, మూడు వేల ఎకరాల్లో పెసలు, పది ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది.


ఎంత కష్టం..

చెరువులు, కాలువలు, డ్రయిన్లు పొంగిపొర్లడంతో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ వరిపంట నీటమునిగిపోయింది. సరిగ్గా పొట్టపోసుకుని నిలబడ్డ తరుణంలో అవన్నీ ముంపునకు గురయ్యాయి. ఈ జిల్లా వ్యాప్తంగా 95,820 ఎకరాల్లో పంటలు మునిగినట్లు గురువారం అధికారుల్ఙ్ఙ్ఙ్ఙు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే, అందులో 50 వేల ఎకరాల్లో వేసిన వరి పంట అసలు ఎందుకూ పనికిరాకుండా పోయినట్లు తేల్చారు. ఎకరానికి రూ. 20వేలు పెట్టుబడి రైతులు పెట్టారు. ఈ లెక్కన యాభై వేలు ఎకరాలకుగాను వందకోట్లు వర్షార్పణం అయినట్టే! వరద, వర్షం నీరు చాలామేర ఇంకా చేలల్లోనే ఉండడంతో ఈ నష్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-16T08:35:45+05:30 IST