Hyderabad : నిలిచిన రాకపోకలు.. నీట మునిగిన పంటలు

ABN , First Publish Date - 2021-09-06T18:07:30+05:30 IST

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర శివారు..

Hyderabad : నిలిచిన రాకపోకలు.. నీట మునిగిన పంటలు

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని చెరువు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. కల్వర్టులను వరద ప్రవాహం ముంచెత్తింది. చింతల చెరువు, రెడ్డికుంటలోకి భారీగా వర్షం నీరు చేరడంతో అలుగులు పారుతున్నాయి. చెరువు కింద ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి, అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి కవాడిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహిస్తుండడంతో రాత్రి కొన్ని గంటలు రాకపోకలు నిలిచిపోయాయి.


అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి లష్కర్‌గూడ రోడ్డులో కల్వర్టుపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈదుల చెరువు అలుగు పారుతుండడంతో కోహెడ రోడ్డు వరద ప్రవాహంలో మునిగిపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. బాటసింగారం నుంచి మజీద్‌పూర్‌ రోడ్డు, విజయవాడ జాతీయ రహదారి, ఇనాంగూడ కమాన్‌ వద్ద రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆదివారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్‌ వైపు వెళ్లే వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.


విద్యుత్‌ శాఖ హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. గ్రేటర్‌జోన్‌ పరిధిలోని సీజీఎంలు, ఎస్‌ఈలతో సీఎండీ రఘుమారెడ్డి రోజూ ఆడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. 24 గంటలూ ఉన్నతాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే స్థానికులు ఎవరూ ట్రాన్స్‌ఫార్మర్లు, తీగల వద్దకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. తీగలపై చెట్లకొమ్ములు పడితే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు స్థానిక ఎఫ్‌ఓసీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. వానాకాలంలో ఇంటి బయట స్విచ్‌బోర్డులు, కరెంట్‌ బాక్సులోకి వర్షపు నీరు పోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ర్టిసిటీ లైసెన్సింగ్‌ బోర్డుసభ్యుడు నక్కయాదగిరి సూచించారు. భవనాలపై ఉన్న కేబుల్‌ వైర్లు, విద్యుత్‌తీగలు నీటిలో ఉంటే ఎర్తింగ్‌వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా ప్లగ్‌లు తీయవద్దన్నారు.

Updated Date - 2021-09-06T18:07:30+05:30 IST