Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్షం ఆగినా నీటి ప్రవాహం ఉధృతం

జలదంకి, నవంబరు 30: మండలం సోమవరప్పాడు చప్టా వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. చెరువు నిండడంతో అలుగు పారుతుతంది. ఈ నీరు ప్రవాహానికి వాగులో చెట్లుమొలచి అడ్డంకాగా మారడంతో చప్టాపై పారుతుంది. దీంతో గత  కొన్ని రోజులుగా రాకపోకలు స్తంభించి ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో సోమవరప్పాడు, కొత్తపాలెం గ్రామాలతో పాటు ఈ మార్గంలోని జలదంకి, కలిగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాలకు ప్రయాణ సౌకర్యం నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలిగిరి మండలం శిద్ధనకొండూరు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అదికారులు స్పందించి వాగులో కమ్ముకుపోయిన చెట్లను తొలగింపజేసి వరదప్రవాహం సులువుగా వాగులో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, మాజీ సాగునీటి సంఘం అద్యక్షుడు చేవూరి పాపిరెడ్డి కోరుతున్నారు. 

24 రోజులు వర్షమే..!

మండలంలో ఈ నెలలో 24 రోజుల పాటు వర్షం కురిసింది. ఒక నెలలో ఇన్ని రోజులు గతంలో ఎన్నడూ వర్షం పడలేదని మండల ప్రజలు అంటున్నారు. దీంతో గ్రామీణ రోడ్లు బురదమయమై నడిచేందుకు వీలు లేకుండా ఉన్నాయి. వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ట పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మాగాణి భూముల్లో వర్షపు నీరు బయటకు పోక వరినారుమళ్లు, వరినాట్లు దెబ్బతిన్నాయి.  మండలంలోని 23 సాగునీటి చెరువలు పూర్తిగా నిండి కలుజులు పారుతున్నాయి. చినక్రాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నిండి రెండు అలుగులు పారుతున్నాయి. దీంతో వాగులు, వంకల నీటి ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కమ్మవారిపాలెం, చామదల, దాసరిఅగ్రహారం వాగులపై వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.  ఇదిలా ఉండగా సోమవారం రాత్రి మండలంలో 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. మండలంలో నవంబరు మాసంలో సాధారణ వర్షపాతం 32 సెంటీ మీటర్లు కాగా 84 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

గండిపాళెం జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ఉదయగిరి : మండలంలోని గండిపాళెం జలాశయాన్ని మంగళవారం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. జలాశయంలో నీటి మట్ట, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో   వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట అక్కి భాస్కరరెడ్డి, వెంగళలరెడ్డి, సీఐ గిరిబాబు, ఎస్‌ఐ లతీపున్నీసా ఉన్నారు. అలాగే శకునాలపల్లి చెరువు కట్ట నెర్రెలు బారడం, కట్టకు చిన్నపాటి రంధ్రం ఏర్పడడంతో  సర్పంచు కల్లూరు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి కరిముల్లా ఎక్స్‌కవేటరును ఏర్పాటు చేసి మరమ్మతులు చేయించారు. బండగానిపల్లి పంచాయతీలో పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

పర్యాటకుల సందర్శకుల తాకిడి 

మండలంలోని గండిపాళెం జలాశయం నిండకుండాల మారి క్రష్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో జలాశయాన్ని తిలకించేందుకు సందర్శకుల తాకిడి అఽధికమైంది. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాలతోపాటు సమీప ప్రకాశం జిల్లా పామూరు నుంచి ప్రజలు వాహనాల్లో తరలివచ్చి జలాశయాన్ని తిలకించారు. 

కూలిన ఇల్లు

మండలంలోని గుడినరవ ఎస్సీ కాలనీలో మంగళవారం బక్కా రమణమ్మ అనే మహిళకు చెందిన కాలనీ ఇల్లు కూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం గోడలు నాని ఒక్కసారిగా శ్లాబు నేలకూలింది. ఇల్లు కూలే సమయంలో రమణమ్మ ఆమె భర్త ఆరుబయట ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పంది. సర్పంచు కృష్ణ బాధితులను పరామర్శించి విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు కురిసి వాగులు, వంకలు ప్రహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు ఎన్‌.శ్రీనివాసులు సూచించారు. మంగళవారం మండలంలోని గండిపాళెం జలాశయాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అడుసుమల్లి వెంకటేశ్వర్లు, జలాశయ సిబ్బంది బాషా, రాజా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సహాయకచర్యలు వేగవంతం చేయండి : ఆర్డీవో

కలిగిరి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కావలి ఆర్డీవో శీనా నాయక్‌  తహసీల్దారు టీవీఎం కృష్ణప్రసాద్‌కు సూచించారు. మండలంలోని వెలగపాడు, పెద్ద అన్నలూరు, జిర్రావారిపాలెం, వెంకన్నపాలెం ఎస్టీ కాలనీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. వెలగపాడు ఎస్టీ కాలనీకి వెంటనే విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ప్రమాదకరంగా పారుతున్న అలుగును పరిశీలించి రక్షణ చర్యలను పటిష్టం చేయాలని కోరారు. వెంకన్నపాలెం ఎస్టీ కాలనీవాసులు నివసిస్తున్న పూరిగుడిసెల చుట్టూ వర్షపునీరు ఉండటం గమనించిన వారికి పక్కా గృహాల మంజూరుకు చర్యలు చేపట్టాలని అదేశించారు. వెలగపాడులో రేకుల షెడ్డు కూలి గాయపడిన మస్తాన్‌ సాహెబ్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మాల్యాద్రి,  వెలగపాడు సర్పంచు దేవనబోయిన వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐ కళ్యాణ్‌, వీఆర్వో చినరాజ్యం, తదితరులు పాల్గొన్నారు. 

93.4 మి.మీ వర్షపాతం నమోదు

కొండాపురం : మండల పరిధిలో మంగళవారం ఉదయం వరకు 93.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో వాగులు, వంకలు, చెరువుల అలుగులు పారుతున్నాయి. మిడతవాగు, ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహించడంతో మండలానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. శెట్టిపాలెం చెరువు తెగి సోమశిల ఉత్తరకాలువ నుంచి ఉప్పుటేరుకు నీరు చేరింది. మండల పరిధిలో రైతులు సాగు చేసిన మెట్టపైర్లయిన మినుము, మిరప, పొగాకు తదితర పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు అంటున్నారు.

అలుగు పారుతున్న వింజమూరు చెరువు

వింజమూరు: పట్టణంలోని బంగ్లాసెంటర్‌ కూడలిలో ఉన్న వింజమూరు చెరువు నిండి అలుగు పారుతుంది. చాలా ఏళ్ల నుంచి నిండకుండా ఉన్న చెరువు ఈ ఏడాది వర్షాల కారణంగా నిండడంవల్ల సాగు, తాగునీటికి సుమారు రెండేళ్లపాటు ఇబ్బంది ఉండదని స్థానికులు అంటున్నారు. అలుగు వద్ద ప్రజలు చేపలుు పడుతూ సందడి చేశారు.

సిద్ధేశ్వరం మార్గంలో కూలిన చప్టా

సీతారామపురం : మండలంలో కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు జలకళ సంతరించుకుంది. ఈ తరుణంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి సిద్ధేశ్వరం వెళ్లే మార్గంలో వరద ప్రభావంతో రెండు చోట్ల చప్టాలు కూలిపోయాయి. దీంతో వేంపల్లెతోక, రాగిమానుదిన్నె, సిద్ధేశ్వరంకు రాకపోకలు స్తంభించాయి. మండలంలో నిండిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లతోపాటు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలను మంగళవారం అధికారులు పరిశీలించారు. ప్రజలు వాగులు దాటకుండా ఉండాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, డీటీ షాజియా, ఇరిగేషన్‌, పీఆర్‌ ఏఇలు అంకులయ్య, శ్రీనివాసరాజు, ఎస్‌ఐ కిషోర్‌బాబు, వైసీపీ మండల కన్వీనర్‌ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కూలిన ఇంటి శ్లాబు

బిట్రగుంట : బోగోలు మండలం పాతబిట్రగుంట గిరిజన కాలనీలో పాముల పద్మమ్మకు చెందిన ఇంటి శ్లాబు సోమవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే సోమవారం కుండపోత వర్షం కురవడంతో వీఆర్వో మాల్యాద్రి, కార్యదర్శి బాషా అక్కడి ప్రజలను సమీపంలోని చర్చిలోకి తరలించారు. దీంతో శ్లాబు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాని సర్పంచి శ్రీరాం.గోపాల్‌, కర్తం.సురేంద్రరెడ్డి పరిశీలించి అధికారులు తెలియజేశారు. అరుంధతి వాడలో దావులూరి.కొండమ్మ ఇల్లు గోడలు వరిగి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అల్పపీడనం వలన నిరాశయులైన పేద, దళిత, గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి, గిరిజన సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు బాపట్ల వెంకటపతి, గిరిజన నేత పాలకుర్తి వెంకట రామకృష్ణ కోరారు. 


జలదంకి : సోమవరప్పాడు వద్ద చప్టాపై పారుతున్న వరద నీరు


ఉదయగిరి రూరల్‌ : గండిపాళెం జలాశయం వద్ద సందర్శకులు


ఉదయగిరి : గండిపాళెంను పరిశీలిస్తున్న ఎమ్యెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి


కలిగిరి : పెదఅన్నలూరులో అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీఓ శీనానాయక్‌


బిట్రగుంట : కూలిన ఇంటి శ్లాబు


Advertisement
Advertisement