Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల కష్టం కన్నీటిపాలు

నేటికీ నీటిలోనే వరిపంట 

ఈ ఏడాది రైతుకు మిగిలేది అప్పే 

సాయం కోసం ఎదురుచూపు

రేపల్లె, నవంబరు 29: కూలినాలి చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని వరి సాగుచేస్తే బాగా పండిందని మురిసిపోయిన రైతన్న పంటను కొతకోసి ఇంటికి తెచ్చుకుందామన్న తరుణంలో అల్పపీడనం రూపంలో నీటి పాలైందంటూ తీరప్రాంత రైతులు భోరున విలపిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో సుమారు లక్ష  ఎకరాల్లో వరి వేయగా 20వేల ఎకరాలకుపైనే వరిపైరు నేలవాలి నీటిలో నానుతున్న దయనీయ పరిస్థితి. పంటను చూసి తెచ్చిన అప్పు తీర్చుకుందామని ఆశపడ్డ రైతన్నకు అధిక వర్షాలతో పంటంతా నీటిపాలై నిరాశనే మిగిల్చింది. గత ఇరవై రోజులుగా ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులు వీయటంతో తీరప్రాంత రైతులు భయానక వాతావరణంలో ఉన్నారు. పంటపొలాలన్నీ నీటిలోనే నానుతూ దర్శనమిస్తున్నాయి. డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకాకపోవటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్ళే పరిస్థితిలేకుండాపోయింది. మోకాల్లోతు నీటిలోనే వరిపైరు నాని మొలకలు రావటంతో పెట్టుబడికూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు భయాందోళన చెందుతున్నారు. లక్షలాదిరూపాయలు పెట్టుబడి పెట్టి అధికవర్షాలతో పంటంతా కోల్పోయామంటూ రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

నీటిలో నానిన వరి పైరును కోసి దిగాలుగా కూర్చున రైతు

ఎకరాకు రూ.25వేలపైనే పెట్టుబడి పెట్టాలి

అధికవర్షాల కారణంగా తీరప్రాంతంలో చేతికొచ్చిన పంటంతా నీటిపాలవటంతో నేలవాలిన పంటను కట్టలు కట్టి కోతకోసి కుప్పలు వేసి నూర్పిడి చేయలంటే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే, దిగుబడి మాత్రం 15 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయటంలేదని.. దళారులకు అమ్ముదామంటే సగానికి సగం రేటు కోసి అడిగే పరిస్థితి. రూ.10వేలుకూడా చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే నారుమళ్ళు, దుక్కులు, నాట్లు, పిండి చల్లటం వరకు ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు.. మళ్లీ రూ.30వేలు పెట్టుబడి పెట్టినా మిగిలేదేమీ లేదంటున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా తమ వద్దకు వచ్చిందిలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


Advertisement
Advertisement