అకాల వర్షం.. ఆగమాగం!

ABN , First Publish Date - 2022-01-17T06:13:14+05:30 IST

అకాల వర్షం అన్నదాతలకు అనుకోని నష్టాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం పడిన అకాలవర్షం కారణంగా పలు చోట్ట వరిపొలాలు నీటమునిగ్గా..

అకాల వర్షం.. ఆగమాగం!
నీట మునిగిన వరి నాటు

రైతులను ముంచిన వర్షం

కూసుమంచి మండలంలో నీటమునిగిన వరిపొలాలు

కల్లాల్లో తడిచిన మిర్చి.. తాలుగా మారుతుందని రైతుల ఆవేదన

కూసుమంచి, జనవరి 16: అకాల వర్షం అన్నదాతలకు అనుకోని నష్టాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం పడిన అకాలవర్షం కారణంగా పలు చోట్ట వరిపొలాలు నీటమునిగ్గా.. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. ముఖ్యంగా పాలేరు, నర్సింహలగూడెం, నానుతండ, చౌటపల్లి, నాయకన్‌గూడెం, కొత్తూరు తదితరప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో ఆయా గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. కూసుమంచి మండలంలో 23వేల ఎకరాలకు గాను ఇప్పటికే 12వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. భారీవర్షం కురవడంతో పంటకాల్వల ద్వారా నీరు పొలాల్లోకి వచ్చి అవన్నీ నీటమునిగాయి. అలాగే మండలంలో 5,700 ఎకరాల్లో మిర్చి సాగవగా.. ఈ సారి తెగుళ్లతో నష్టపోయిన రైతులను వర్షం అనుకోని దెబ్బ కొట్టింది. నాలుగు రోజులుగా అడపాదడపా వర్షం పడుతుండగా.. మొదటికాపు కోసి కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. దీంతో ఆ పంట తాలుగా, రంగుమారుతుందనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తామరపురుగు కారణంగా నష్టపోయిన తమకు అకాలవర్షం గోటిచుట్టూ రోకటిపోటులా తయారైందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2022-01-17T06:13:14+05:30 IST